Big Boss 5 September 7th Episode Updates - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: జనాలను పిచ్చోళ్లను చేసిన లోబో, సిరి

Published Tue, Sep 7 2021 11:50 PM | Last Updated on Wed, Sep 8 2021 5:21 PM

Bigg Boss 5 Telugu: Vishwa Gets Emotional, Anee, Kajal Burst - Sakshi

Bigg Boss Telugu 5, September 7th Episode: బుల్లితెరపై బిగ్‌బాస్‌ సందడి మొదలైంది. అక్కడ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య కొట్లాట కూడా షురూ అయింది. ఇలా పరిచయాలు అయ్యాయో లేదో అప్పుడే ఒకరి మీద ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు. షో ఆరంభంలోనే ఈ రేంజ్‌లో గొడవలు ఉంటే రానురానూ ఇది ఏ స్థాయిలో ఉండబోతుందో అంటున్నారు బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌. మరి నేటి(మంగళవారం) ఎపిసోడ్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి..

మానస్‌ను అన్నయ్య అని పిలవలేను
మగవాళ్లు జిమ్ములో కూర్చుంటున్నారు తప్ప ఏ పనీ చేయట్లేదని ఉమాదేవి చిరాకుపడింది. ఇంట్లో ఉన్న అందరూ పని చేయాల్సిందేని అభిప్రాయపడింది. మరోపక్క లహరితో దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది కాజల్‌. కానీ అది ఫ్లోలో జరగాలి తప్ప ఇలా మాట్లాడుకుంటే కుదరదు అని లహరి అనడంతో ఊరకుండిపోయింది. ఇక రవి, విశ్వను అన్నయ్య అని పిలుస్తానన్న ప్రియాంక సింగ్‌.. మానస్‌ను మాత్రం అలా పిలవలేనని చెప్తూ తెగ సిగ్గుపడింది. దీంతో అందరూ మానస్‌ను లవర్‌ బాయ్‌ అంటూ ఆటపట్టించారు. ఈ సీజన్‌లో కొత్తగా పవర్‌ రూమ్‌ను పరిచయం చేశాడు బిగ్‌బాస్‌. ఈ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత సాధించిన సభ్యులకు పవర్‌ యాక్సెస్‌ దొరుకుతుందని, తద్వారా వారికి ఆటను మార్చగలిగే శక్తి దొరుకుతుందని చెప్పాడు. అందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ 'శక్తి చూపరా డింభకా!'ను ప్రవేశపెట్టాడు.

ఒంటి మీదున్న దుస్తులను పంపించేసిన రవి, ప్రియ
ఈ టాస్క్‌లో ఉరుముల శబ్ధం వినిపించగానే పవర్‌ స్కాన్‌పై ఎవరు మొదట చేయి పెడతారో వారికి ఆ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత సాధించినట్లు లెక్క. ఈ టాస్క్‌లో మొదట గెలిచిన విశ్వ పవర్‌ రూమ్‌లో అడుగు పెట్టాడు. ఇద్దరు ఇంటిసభ్యులు వారి ఒంటి మీదున్న దుస్తులతో సహా అన్ని బట్టలు, వస్తువులను స్టోర్‌రూమ్‌కు పంపించాలని, అయితే ఆ ఇద్దరూ వారి స్వంత బట్టలు కాకుండా ఒకరి దుస్తులను మరొకరు ధరించవచ్చని మెలిక పెట్టాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌ కోసం విశ్వ.. ప్రియ, రవి పేర్లను సూచించాడు. దీంతో ఆ ఇద్దరూ తమ సామానంతా పంపించేసి.. ప్రియ బట్టలను రవి, రవి బట్టలను ప్రియ వేసుకున్నారు.

నాలో తమ్ముడిని చూసుకో..
లేడీ గెటప్‌లో ఉన్న రవిని కాసేపు ఎత్తుకుని తిప్పిన విశ్వ తన తమ్ముడిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. గతేడాది తమ్ముడిని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యాడు. రవి తనను అన్న అని పిలుస్తాడని, నా కోసం ఈ టాస్క్‌కు ఒప్పుకున్నాడంటూ ఎమోషనల్‌ అయ్యాడు. దీంతో రవి.. నాలో తమ్ముడిని చూసుకో అంటూ అతడిని హత్తుకుని ఓదార్చాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో తర్వాత మానస్‌ గెలుపొంది పవర్‌ను సాధించాడు. అతడు ఎంచుకునే కంటెస్టెంట్‌ హౌస్‌లోని ఇంటి సభ్యులందరూ పడుకున్నాకే నిద్రించాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. లేదంటే పెద్ద సౌండ్‌తో అలారమ్‌ మోగుతుందని చెప్పాడు. ఈ టాస్క్‌కు మానస్‌.. ఆర్జే కాజల్‌ పేరును ఎంచుకున్నాడు.

గొడవపడ్డట్లు డ్రామా.. చివర్లో అంతా ఉట్టిదే
ఇంతలో లోబో.. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా అను, మోతెబరిలా మాట్లాడకు అని సిరిని నిందించాడు. ముఖం అద్దంలో చూసుకో, హైట్‌ చూసుకో, నా ముందు చెటాకంత ఉన్నవ్‌ అంటూ నానామాటలు అన్నాడు. ఇవన్నీ చెవిన పడటంతో ఆవేశంతో అట్టుడికిపోయిన సిరి ఫేస్‌ గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది అని వార్నింగ్‌ ఇచ్చింది. వీళ్లిద్దరికీ సడన్‌గా ఏమైంది? ఇంత గొడవపడుతున్నారు? అని కంటెస్టెంట్లంతా టెన్షన్‌ పడుతుండగా ఇదంతా వుట్టి డ్రామా అని ఇద్దరూ పెద్దగా నవ్వేసి అందరినీ పిచ్చోళ్లను చేశారు.

హైడ్రామా చేస్తున్నావంటూ కాజల్‌కు చురకలు
కిచెన్‌లో పనులను షేర్‌ చేసుకుందామని కాజల్‌ అందరినీ పిలిచి హడావుడి చేస్తుండగా.. ఎందుకంత హైపర్‌ అవుతున్నారని లహరి ప్రశ్నించింది. నార్మల్‌గా మాట్లాడండి, అంతే తప్ప కంటెంట్‌ క్రియేట్‌ చేయాలని చూడొద్దని కాజల్‌కు సూచించింది. చాలా హైడ్రామా చేస్తున్నారని చురకలంటించింది. దీంతో కాజల్‌ ఆమెకు క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చి ఏడ్చేసింది.

జెస్సీ మీద యానీ మాస్టర్‌ ఫైర్‌
ఇక రాత్రి అందరూ ముచ్చట్లు పెట్టుకుంటుండగా సిరి ప్లేస్‌లో హమీదా కూర్చుంటే ఆమెను అక్కడి నుంచి లేవమన్నాడు జెస్సీ. ఆమె కుదరదనడంతో సిరిని తన స్థానంలో కూర్చోమన్నాడు. ఆ తర్వాత మరో ఖాళీ కుర్చీ దొరికితే దాని మీద కాలేసి కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన యానీ మాస్టర్‌ తనకు చెయిర్‌ ఇవ్వమని రిక్వెస్ట్‌ చేసింది. ప్లీజ్‌ అంటున్నా అతడు నిరాకరించడంతో యానీకి బుర్ర వేడెక్కిపోయింది. నాటకాలు చేయకు, నీ గొంతే కాదు నా వాయిస్‌ కూడా లేస్తుంది,  అక్కడ కాళ్లెందుకు పెట్టినవ్‌ అని జెస్సీ మీద పూనకంతో ఊగిపోయింది. ఇంతలా ఆవేశపడ్డ యానీ మాస్టర్‌ తన బెడ్‌ దగ్గరకు వెళ్లి ఏడ్చేయడం గమనార్హం. ఈరోజు ఎపిసోడ్‌లో ఇంత రభస ఉంటే మరి రేపటి ఎపిసోడ్‌ ఎలా ఉంటుందో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement