
ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలైంది. ప్రేక్షకులకు ముక్కూముఖం తెలియని కంటెస్టెంట్ల సంఖ్యే ఈసారి ఎక్కువగా ఉంది. అయినా ప్రతి సీజన్ ప్రారంభంలో ఇది మామూలేలే! కొన్నాళ్లు పోతే వీళ్లకే మళ్లీ అభిమాన సంఘాలు పుట్టుకొస్తాయి. ఈసారైతే కంటెస్టెంట్లు మొదటిరోజే గొడవలుపడ్డారు. ఆ విషయాలు, విశేషాలేంటో సెప్టెంబర్ 2 నాటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..

ఆవేశంగా నాగమణికంఠ
బిగ్‌బాస్ లాంచింగ్ రోజే కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టాడు నాగ్. అడుగుపెట్టిన మొదటిరోజే ఒకరు ఎలిమినేట్ అవుతారంటూ అనిల్ రావిపూడిని హౌస్‌లోకి పంపించి బాంబ్ పేల్చాడు. ఎవరిని బయటకు పంపిద్దామన్నప్పుడు మెజారిటీ జనాలు నాగమణికంఠకు ఓటేశారు. ఇలా వచ్చానో లేదో అప్పుడే వెళ్లగొట్టడమేంటని అతడిలో అగ్నిపర్వతం బద్ధలైంది. నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశం బిగ్‌బాస్, మీరేమో ఎలిమినేట్ చేస్తున్నారంటూ ఫ్రస్టేట్ అయ్యాడు.

అందరికీ నచ్చే వ్యూ..
అయితే అనిల్ రావిపూడి అది ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. దీంతో అతడిని పంపించేయమని సూచించిన కంటెస్టెంట్లు తనను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మనోడు తగ్గేదేలే అన్నట్లుగా కోపాన్ని అలాగే కంటిన్యూ చేశాడు. ఇకపోతే బాత్‌రూమ్‌లో శేఖర్ బాషా.. అందరికీ నచ్చే వ్యూ.. ఐ లవ్యూ అనడంతో గలగలా మాట్లాడే బేబక్క సైతం అవాక్కయిపోయింది.

రూల్స్ పెట్టడానికి నువ్వెవరు?
తర్వాత కిచెన్ టీమ్‌లో ఉన్న ఆర్జీవీ బ్యూటీ సోనియా.. ఎవరికీ బాధ్యత లేదంటూ అందరిపైనా రంకెలేసింది. ఆరెంజ్‌తో గేమ్ ఆడినవారెవరూ ఆ పండ్లు తినడానికి వీల్లేదంటూ కొత్త చట్టాలు తీసుకొచ్చింది. దీంతో బాషాకు ఒళ్లు మండింది. రూల్స్ పెట్టడానికి నువ్వెవరు? అంటూ తనపై ఫైరయ్యాడు. తర్వాత కాసేపటికి కూలైపోయి మళ్లీ మామూలుగానే మాట్లాడుకున్నారు.

బిగ్‌బాస్ ట్విస్ట్
ఈసారి కెప్టెన్‌కు బదులుగా ఇంటికి ముగ్గురు కంటెస్టెంట్లు చీఫ్‌లుగా ఉండనున్నారని బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. షో లాంచింగ్ రోజు పెట్టిన గేమ్స్‌లో గెలిచిన నిఖిల్, యష్మి, శేఖర్ బాషా, పృథ్వి, నైనిక, బేబక్క చీఫ్ పదవి కోసం పోటీపడనున్నట్లు ప్రకటించాడు. వీరికి.. పట్టుకుని ఉండండి- వదలకండి అనే టాస్క్ ఇచ్చాడు.

మూడో చీఫ్‌గా..
ఈ గేమ్‌లో ఎక్కువసేపు తాడును పట్టుకుని ఉన్న నిఖిల్ మొట్టమొదటి చీఫ్‌గా గెలిచాడు. రెండో గేమ్‌లో నైనిక గెలిచి రెండో చీఫ్‌గా నిలిచింది. యష్మి, బేబక్క, అఫ్రిది, బాషాలలో ఒకరిని మూడో చీఫ్‌గా సెలక్ట్ చేయండంటూ నిఖిల్, నైనికలకే నిర్ణయాన్ని వదిలేశాడు. అందరూ ఊహించినట్లుగానే నిఖిల్ తన ఫ్రెండ్ యష్మిని చీఫ్‌గా ఎంపిక చేశారు.
గొడవకు దిగిన సోనియా
అఫ్రిదికి బదులు యష్మిని సెలక్ట్ చేయడంపై సోనియా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫ్రెండ్‌షిప్‌ను పక్కనపెట్టి నిజంగా అర్హులైనవారిని సెలక్ట్ చేయాలంటూ గొడవకు దిగింది. ఆల్రెడీ చీఫ్‌గా ప్రకటించాక మధ్యలో నీ గొడవేంటని సోనియామీద గరమైంది యష్మి. అలా ఈరోజు ఎపిసోడ్ వాడివేడిగానే ముగిసిపోయింది. నేటి గొడవలే రేపటి నామినేషన్‌కు దారి తీయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment