Bigg Boss Telugu 5, Episode 20: బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తెలుసుకున్నానన్నాడు షణ్ముఖ్. సిరి తనతో మాట్లాడమని ఎంత బతిమిలాడినా అతడు మాత్రం పట్టించుకోలేదు. బెడ్డు దగ్గరకొచ్చి బుజ్జగించినా అతడు చలించలేదు. తర్వాత బిగ్‌బాస్ అతికిందంటే అదృష్టమే అనే లగ్జరీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఫుడ్ ఐటమ్స్ రాసి ఉన్న బంతులు గోడకు విసరాలి. ఏవైతే గోడకు అతుకుతాయో అవి హౌస్‌మేట్స్‌కు అందుతాయని తెలిపాడు. ఈ టాస్క్‌లో విశ్వ ఫోయిలవగా సన్నీ, రవి, శ్రీరామ్ కిందామీదా పడి పూర్తి చేశారు.
కాళ్లు విరగ్గొట్టేసేవాడిని.. ఆవేశంతో ఊగిపోయిన మాస్టర్
మానస్ హమీదాకు గోరు ముద్దలు తినిపిస్తూ ఇంటి ముచ్చట్లు మాట్లాడాడు. ఈ మధ్య లహరి పొసెసివ్‌గా ప్రవర్తిస్తోందన్నాడు. మొన్న అమ్ముకు రోటీ తినిపిస్తుండగా నువ్వు కూడా తినిపించమన్నావు.. సరే, ఇద్దరికీ కలిసి తినిపిద్దాం అని అక్కడకు వెళ్లి కూర్చుందాం అంటే కుదరదు అని చెప్పేసింది, ఇక్కడే ఇంకో రోటీ తినిపించమని అని మొండిగా ప్రవర్తించిందన్నాడు. మరోపక్క నటరాజ్ మాస్టర్ దేనికో బాగా ఉడుక్కున్నాడు. 'ఎలా ఆడాలన్న బేసిక్ నాలెడ్జ్ లేదు, సెన్స్ కూడా ఉండదు. ఏమైనా అంటే ప్రొఫెషనల్ డైలాగులు.. బయటైతే కాళ్లు విరగ్గొట్టేసేవాడిని..' అంటూ ఏవేవో మాట్లాడాడు. దీంతో అక్కడున్న సన్నీ, రవి, యానీ మాస్టర్, లోబో ఎవరి గురించి అంటున్నారో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానో టైం వచ్చినప్పుడు డైరెక్ట్‌గా చెప్తానన్నాడు. అయితే ఆయన అంటోంది తననే అని అటు యాంకర్ రవి, ఇటు జెస్సీ ఎవరికి వారే తెగ ఫీలయ్యారు. మాస్టర్ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడని రవి అభిప్రాయపడ్డాడు.
మానస్ జైలుకు వెళ్లడం కూడా స్ట్రాటజీనే!
తర్వాత ఇంటిసభ్యులందరూ టాస్క్‌లతో పాటు ఇంట్లోని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బెస్ట్, వరస్ట్ పర్ఫామ్స్‌ను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. కెప్టెన్ జెస్సీ.. హమీదాను; షణ్ముఖ్, హమీదా, సిరి, కాజల్, రవి, నటరాజ్ మాస్టర్, శ్రీరామచంద్ర.. మానస్‌ను; విశ్వ, లహరి.. ప్రియను; యానీ మాస్టర్.. సన్నీని; శ్వేత వర్మ.. నటరాజ్ మాస్టర్, సన్నీ.. షణ్ముఖ్‌లనను వరస్ట్ పర్ఫామర్లుగా సూచించారు. మానస్.. తనకు తానే నచ్చలేదంటూ తన పేరు చెప్పుకున్నాడు. అది కుదరదని కెప్టెన్ వారించడంతో మానస్.. జెస్సీ పేరును సూచించాడు. మొత్తంగా ఎక్కువ ఓట్లు వచ్చిన మానస్‌ను చెత్త ఆటగాడిగా అభివర్ణిస్తూ అతడిని జైల్లో వేశారు. అయితే జైలుకు వెళ్లడం కూడా ఒక స్ట్రాటజీ అని యానీ అభిప్రాయపడింది.
ఆ కోతిముఖానికి తినిపించడం అవసరమా?: పింకీ
మానస్ జైల్లో ఉన్నందుకు ప్రియాంక సింగ్ ఆ జైలు దగ్గరే తచ్చాడింది. హమీదాకు తినిపించినందుకు బాగా హర్టయిన పింకీ.. నువ్వు జైల్లో ఉన్నావు కదా! మరి హమీదాకు ఎవరు తినిపిస్తారు? అని అడిగింది. అంతలోనే అందుకుంటూ ఆమెకు రెండు చేతులు బాగానే ఉన్నాయి కదా, అయినా మూడు పూటలా తినిపిస్తున్నాడు అని అక్కసు వెళ్లగక్కింది. తర్వాత మాత్రం తన జెలసీని పట్టించుకోవద్దని, అలా అని పూర్తిగా పట్టించుకోకుండా ఉండొద్దని సూచించింది. హమీదాకు తినిపిస్తుంటే ఆ కోతిముఖం దానికి అవసరమా? అన్నానని చెప్పింది. దీంతో మానస్.. ఆమె తనకు ఫ్రెండ్ అని, సిస్టర్ అనమంటే కూడా అంటానని అనడంతో సంతోషపడ్డ పింకీ.. వద్దులే, ఫ్రెండ్‌లానే ఉండమని చెప్పింది. అవసరమైతే శ్రీరామ్‌కు అయినా రాఖీ కడతా కానీ నీకు మాత్రం కట్టనని మానస్‌కు తెగేసి చెప్పింది.
తప్పు హౌస్‌మేట్స్‌ది, శిక్ష కెప్టెన్‌కు!
తర్వాత లోబో పట్టపగలే నిద్ర పోవడంతో కుక్కలు మొరిగాయి. దీంతో కెప్టెన్ జెస్సీ ఇంట్లోకి పరుగు తీసి లోబోను నిలదీయగా కానీ తాను నిద్రపోలేదని బుకాయించాడు. కెప్టెన్‌గా తన మాట ఎవరూ పట్టించుకోవట్లేదని ఫీలైన జెస్సీ.. ఇంట్లో చాలామంది తప్పులు చేస్తున్నారని, వారికి బదులుగా తాను శిక్ష తీసుకుంటానంటూ గుంజీలు తీశాడు. అనంతరం బిగ్‌బాస్ ఇంట్లో సడన్‌గా పసిపాప ఏడుపులు, నవ్వులు వినిపించడంతో అందరూ షాకయ్యారు. ఎవరైనా వస్తున్నారా అని ఆతృతగా గేటు వంక చూశారు. కానీ బిగ్‌బాస్ మాత్రం ఓ బేబీ బొమ్మను పంపించాడు. పసిపాప నవ్వులు వినగానే చాలామంది వారి కన్నబిడ్డలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
భార్యను చూసి బోరుమని ఏడ్చిన నటరాజ్
ఇంతలో నటరాజ్ భార్య నీతూ సీమంతం వేడుకల వీడియోను చూపించాడు బిగ్‌బాస్. తన భార్యను చూడగానే నటరాజ్ మాస్టర్ కళ్ల వెంట నీళ్లు ధారలు కట్టాయి. 'నువ్వు రాత్రి మాట్లాడేటప్పుడు బేబీ కదిలేది కదా, ఇప్పుడు బిగ్‌బాస్‌లో నీ వాయిస్ విని నాతో డిష్యుం డిష్యుం చేస్తుంది. బేబీ బాగా కదులుతుంది. నా గురించి టెన్షన్ పడకు. సాధించే రావాలి. జాగ్రత్త' అని భార్య చెప్పిన మాటలు విని ఆయన భోరుమని ఏడ్చేశాడు. సిరి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నా షణ్నూ మాత్రం ఆమెను దూరం పెడుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని కాజల్‌తో చెప్పుకుంటూ బాధపడింది సిరి. షణ్ముఖ్ తనతో ఫేక్‌గా ఉంటున్నాడని, మనస్ఫూర్తిగా లేడని వాపోయింది. జెస్సీతో డిస్‌కనెక్ట్ అయ్యానని తెలిపింది.
మన మధ్య రిలేషన్ ఏంటి?: శ్రీరామ్
ఇక హమీదా, శ్రీరామ్ రాత్రిపూట కబుర్లాడారు. హమీదా ఏదో చెప్పడానికి ప్రయత్నించగా.. నీ మైండ్‌లో ఏముందో చెప్పేసెయ్ అన్నాడు శ్రీరామ్. నేను సన్నీని, మానస్‌ను, నిన్ను ఒకేలా చూడట్లేదని నొక్కి చెప్పింది. కొన్నిసార్లు నాకు అర్థం అవుతావు, కొన్నిసార్లు అర్థం కావని శ్రీరామ్‌ను చూసి బుంగమూతి పెట్టుకుంది. దీంతో శ్రీరామ్.. హమీదాకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నీకు, మానస్‌కు మధ్య ఫ్రెండ్‌షిప్ ఉంది, కానీ మనిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ కూడా కావచ్చు అని చెప్పాడు. మనిద్దరి రిలేషన్ క్వశ్చన్‌మార్క్‌లో ఉందని శ్రీరామ్ చెప్పడంతో ఫక్కున నవ్వేసింది హమీదా. మరి వీళ్ల మధ్య ఏ రిలేషన్ ఉందనేది ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment