ఎలిమినేట్ చేయండ‌న్న గౌత‌మ్‌, చెప్పుతో కొట్టుకుంటాన‌న్న అమ‌ర్‌దీప్‌ | Bigg Boss Telugu 7: Amardeep Helps Shobha To Become Captain | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: న‌న్ను డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేయండి.. శివాజీపై బిగ్‌బాస్‌కు గౌత‌మ్ ఫిర్యాదు

Published Fri, Nov 3 2023 11:30 PM | Last Updated on Sat, Nov 4 2023 9:46 AM

Bigg Boss Telugu 7: Amardeep Chowdary Helps Shobha to Win As Captain - Sakshi

బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండ‌ర్‌షిప్ కోసం ఇంటిస‌భ్యుల‌ను రెండు టీములుగా విభ‌జించాడు. అయితే గౌత‌మ్ టీమ్‌ను గెలిపించాల‌ని బిగ్‌బాస్ బ‌లంగా ఫిక్స‌యిన‌ట్లు క‌నిపిస్తోంది. ఎరుపు, న‌లుపు రంగులో ఉన్న బాల్స్ గౌత‌మ్ సంపాదించ‌గా వాటితో విజ‌యం సాధించేలా బిగ్‌బాస్ పావులు క‌దిపాడు. అస‌లు హౌస్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో తాజా(న‌వంబ‌ర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చ‌దివేయండి..

ఆ టీమ్‌లోని అంద‌రూ కంటెండ‌ర్లే
బిగ్‌బాస్ బ్లాక్ బాల్ ఎవ‌రి ద‌గ్గ‌రుంద‌ని అడిగాడు. వీర‌సింహాలు టీమ్ త‌మ ద‌గ్గ‌రే ఉంద‌ని బ‌దులిచ్చారు. ఈ న‌ల్ల‌ బంతి సాయంతో అవ‌త‌లి టీమ్ ద‌గ్గ‌రున్న అన్ని బంతుల‌ను తీసుకోవ‌చ్చ‌ని భ‌లే స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీంతో  వీర‌సింహాలు టీమ్ స‌భ్యులు ఎగిరి గంతేశారు. కానీ గ‌ర్జించే పులుల టీమ్‌లోని శివాజీ, ప్రియాంక మాత్రం ఓ రెండు బంతుల‌కు కక్కుర్తి ప‌డ్డారు. అన్నీ ఇచ్చేయ‌మ‌న్నాక ఇంకెందుకు ఆలోచిస్తున్నార‌ని గౌత‌మ్ ప్ర‌శ్నించ‌గా మా ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేస్తామ‌న్నాడు శివాజీ. దీంతో గౌత‌మ్ ఆవేశంతో ఊగిపోయాడు.  ఇక అన్ని బంతులు వీర‌సింహాల‌కే ద‌క్కి పైచేయి సాధించ‌డంతో ఆ టీమ్‌లో ఉన్న అంద‌రినీ కెప్టెన్సీ కంటెండ‌ర్లుగా ప్ర‌క‌టించాడు బిగ్‌బాస్‌.

ర‌తిక‌తో దూరంగా ఉండ‌మ‌న్న శివాజీ
మ‌రోవైపు ర‌తిక‌తో కాస్త దూరంగా ఉండ‌మ‌ని యావ‌ర్‌ను హెచ్చ‌రించాడు శివాజీ. మీ అతి చ‌నువు జ‌నాల‌కు న‌చ్చ‌క‌పోవ‌చ్చ‌ని సుతిమెత్త‌గా వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బంతుల టాస్కు మ‌ధ్య‌లో వీర‌సింహాలు టీమ్ త‌మ స‌భ్యులైన‌ భోలె షావ‌ళిని అవ‌త‌లి టీమ్‌లోని అర్జున్‌తో స్వాప్ చేసిన సంగ‌తి తెలిసిందే క‌దా! అయితే తాను మొద‌ట తేజ పేరు సూచించాన‌ని గౌత‌మ్ అన్నాడు. అదేంటి? నువ్వు భోలె పేరు చెప్పావ‌ట‌గా అని అశ్విని గబుక్కున అడిగేసింది. అది విని షాకైన గౌత‌మ్‌.. భోలె ద‌గ్గ‌ర‌కు వెళ్లి నేను డైరెక్ట్‌గా మీ పేరు చెప్ప‌లేదు.. అది టీమ్ నిర్ణ‌యం అని క్లారిటీ ఇచ్చాడు.

స్వ‌చ్ఛందంగా ఆట‌లో నుంచి త‌ప్పుకున్న ప్రిన్స్‌
అనంత‌రం బిగ్‌బాస్ బీన్ బ్యాగ్ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. కానీ ఇక్క‌డో మెలిక‌ పెట్టాడు. వీర‌సింహాలు టీమ్‌లోని కెప్టెన్సీ కంటెండ‌ర్స్ కోసం అవ‌త‌లి టీమ్‌లోని కంటెస్టెంట్లు ఆడాల్సి ఉంటుంద‌న్నాడు. అలాగే ఓ కంటెండ‌ర్ స్వ‌చ్ఛందంగా ఆట‌లో నుంచి త‌ప్పుకోవాల‌న్నాడు. దీంతో ప్రిన్స్ యావ‌ర్ ఆట నుంచి వైదొలిగాడు. గౌత‌మ్ త‌ర‌పున అశ్విని, అర్జున్ త‌ర‌పున శివాజీ, తేజ త‌రపున ప్రియాంక‌, ర‌తిక త‌ర‌పున భోలె షావ‌ళి ఆట‌లో దూకారు. ఇద‌స‌లే ఫిజిక‌ల్ టాస్క్‌.. చేయి నొప్పి ఉన్న శివాజీ ముందే ఆట‌లో నుంచి వైదొల‌గాల్సింది. అయినా స‌రే త‌న ప్ర‌తాపం చూపిస్తానంటూ ఆడేందుకు వెళ్లాడు.

దెబ్బ త‌గ‌ల‌డంతో శివాజీ అవుట్‌
తీరా అక్క‌డ అంద‌రూ లాక్కుని పీక్కునే క్ర‌మంలో అత‌డి చేతికి దెబ్బ త‌గిలింది. దీంతో ఆయ‌న ఆట‌లో నుంచి త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక ఈ ఆట‌లో అమ‌ర్‌దీప్‌- అశ్విని కొట్టుకున్నారు. బిగ్‌బాస్ గీసిన వృత్తంలో నుంచి అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని సంచాల‌కుడైన ప్ర‌శాంత్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఆ గీత దాటి బ‌య‌ట‌కు వ‌చ్చింది శివాజీ అన్న అని, కావాలంటే వీడియో చూడ‌మ‌న్నాడు అమ‌ర్‌దీప్‌. ఒక‌వేళ తాను చెప్పింది త‌ప్ప‌యితే చెప్పుతో కొట్టుకుంటాన‌ని స‌వాలు విసిరాడు.

అమ‌ర్ సాయం.. కెప్టెన్‌గా శోభ‌
ఇక బీన్ బ్యాగ్ టాస్కులో శోభా శెట్టి త‌ర‌పున ఆడి, పోరాడి అమ‌ర్ గెలిచాడు. మొత్తానికి అమ‌ర్ సాయంతో ఈ సీజ‌న్‌లో శోభా శెట్టి తొలి లేడీ కెప్టెన్‌గా అవ‌త‌రించింది.ఇక శోభా కెప్టెన్ అయిందో, లేదో అర్జున్‌, తేజ ఆమెను ఏడిపించేందుకు ప్ర‌య‌త్నించారు. ఎలిమినేట్ అయి వెళ్లేట‌ప్పుడు నీ ద‌గ్గ‌రున్న కాయిన్స్ ఎవ‌రికి ఇస్తావు? అని అర్జున్ అడ‌గ‌డంతో చిర్రుబుర్రులాడింది శోభ‌. కామెడీ చేయ‌డానికి కూడా ఓ స‌మ‌యం ఉంటుంద‌ని విసుక్కుంది.

శివాజీపై ఫిర్యాదు
త‌ర్వాత గౌత‌మ్‌.. శివాజీ ప్ర‌వ‌ర్త‌న‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. 'శివాజీ అన్న‌ గేమ్‌ను ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు. నీతి, నిజాయితీ, ధ‌ర్మం అని మాట‌లు చెప్తుంటాడు.. కానీ ఆయ‌న చాలా త‌ప్పులు చేస్తున్నాడు. అవ‌న్నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. ఆయ‌న చేసేదంతా చేసి మ‌ళ్లీ ఏమీ ఎరుగ‌న‌ట్లు త‌ప్పించుకుంటున్నాడు. ఇలా ఆడి, గెలిచి ఆయ‌న‌ క‌ప్పు కొట్టుకుంటాడేమో.. కానీ ఇది నేను భ‌రించ‌లేక‌పోతున్నాను. నేను త‌ప్ప‌యితే న‌న్ను ఎలిమినేట్ చేసేయండి' అని కెమెరాల ముందు బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేశాడు.

చ‌ద‌వండి: రాహుల్‌-ర‌తిక పెళ్లి.. అత‌డు పెట్టిన కండీష‌న్స్ వ‌ల్లే బ్రేక‌ప్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement