బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో వచ్చిన ప్రభావతి అలియాస్ కోడిగుడ్డు టాస్క్ మళ్లీ రిపీట్ అయింది. గుడ్డు పోయిందని కంటెస్టెంట్లు అరిచిగోల చేయలేదు, ఏకంగా కిందపడేసి రక్కి మరీ అవతలివారి దగ్గరనుంచి సాధించారు. ఈ గుడ్డు కంటే ముందు దోస గురించి ప్రేరణ, విష్ణుప్రియ పంచాయితీ పెట్టుకున్నారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
'శక్తి'కి లగ్జరీ రేషన్
ఆడింది అయిదునిమిషాలైతే అరుచుకోవడం అరగంట.. కాదు, హాఫ్‌డే అన్నట్లుంది బిగ్‌బాస్ హౌస్ పరిస్థితి. రేషన్ కోసం పెట్టిన గేమ్ శక్తి టీమ్ గెలవడంతో వారికి లగ్జరీ రేషన్ అందింది. ఓడిన కాంతార టీమ్ కేవలం ఆకుకూరలు, కూరగాయలతోనే సరిపెట్టుకుంది. మరోవైపు వంటరాని విష్ణుప్రియ ఒక దోసె అడిగితే చేసివ్వడానికి ప్రేరణ ఒప్పుకోలేదు. తనకు దోసె వేసుకోవడం రాదు, కాబట్టి ఒకటి వేసిస్తే తప్పేంటని మణి నచ్చజెప్పడంతో ప్రేరణ అయిష్టంగానే దోసె వేసిచ్చింది.
ఏడుపందుకున్న విష్ణు
ఇలా ముఖం మాడ్చుకుని ఫుడ్ విసిరేయడం నచ్చలేదంటూ విష్ణు శోకమందుకుంది. తిండి విషయంలో ఎందుకీ గొడవలు? అని మణి, నిఖిల్ చెప్పడంతో ప్రేరణకు మరింత చిరాకెత్తిపోయింది. అటు విష్ణుప్రియ తనకొద్దని మారాం చేయడంతో పృథ్వీ వెళ్లి ప్రేమగా తినిపించడంతో కూల్ అయింది. తర్వాత కాసేపటికి ప్రేరణ కూడా వెళ్లి తాను కావాలని అలా చేయలేదని విష్ణుకు క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా మణి వల్లే ఈ గొడవ పెద్దదైందని అతడిని చులకన చేస్తూ మాట్లాడింది.
సోనియాకు దూరంగా పృథ్వీ?
ఇదిలా ఉంటే 'నువ్వెవడివిరా నాకు చెప్పడానికి..' అని సోనియా అన్న మాటను మర్చిపోలేక పృథ్వీ బాధపడుతూనే ఉన్నాడు. తన వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుందని ఏకంగా సోనియానే దూరంగా పెట్టాలనుకున్నాడు. కానీ నిఖిల్ అది జరగనిస్తాడా? తెల్లారే సోనియా చెవిలో జారేశాడు. అలా ఆమె పృథ్వీని ఎలా కూల్ చేయాలా? అన్న ఆలోచనలో పడింది.
సోనియా ప్రేమ కబుర్లు
తర్వాత సోనియా.. ప్రేరణతో తన ప్రేమవిషయాలను పంచుకుంది. మేము మూడేళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. నేను ప్రారంభించిన ఒక ఎన్జీవోకు అతడు వెబ్ డిజైనింగ్‌లో సహాయపడ్డాడు, అలాగే అమెరికా నుంచి తనొక స్పాన్సర్ కూడా! అయితే ఇంతవరకు నేను ప్రపోజ్ చేయలేదు. తను నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఇప్పటికీ ఆయన నా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు అని చెప్పింది.
14 గంటల టైమ్‌లైన్
అనంతరం బిగ్‌బాస్ కిచెన్ విషయంలో ఓ బాంబు పేల్చాడు. కిచెన్‌లో వంట చేసుకునేందుకు వారమంతా కలిపి కేవలం 14 గంటలు మాత్రమే కేటాయిస్తునట్లు తెలిపాడు. ఆ సమయం గడిచిపోయాక వంటగ్యాస్ ఆన్ చేసేదే లేదన్నాడు. తర్వాత బంగారుకోడిపెట్ట ప్రభావతి 2.0 హౌస్‌లోకి వచ్చింది. ప్రభావతి వదిలే గుడ్లు పట్టుకునేందుకు, పట్టుకున్నవాళ్ల దగ్గర లాక్కునేందుకు రెండు టీమ్స్ బాగానే కష్టపడ్డాయి. తోసుకుని, నెట్టేసుకుని, లాగేసి, కిందామీద పడేసి నానాతంటాలు పడ్డారు.
చలనం లేకుండా పడి ఉన్న మణి
మొదటి రౌండ్‌లో శక్తి టీమ్ 21, కాంతార టీమ్ 10 గుడ్లు సంపాదించింది. కామన్‌సెన్స్, బ్రెయిన్ వాడని ఒకే ఒక్క వరస్ట్ పర్ఫామర్ పృథ్వీ అని అభయ్ మండిపడ్డాడు. నిఖిల్ అయితే నాగమణికంఠను లాగి పడేయడంతో అతడు కొద్ది క్షణాలపాటు లేవలేకపోయాడు. అతడి పరిస్థితి చూసి తలపగిలిందేమోనని కాంతార టీమ్ లీడర్ అభయ్ పరిగెత్తుకు వచ్చాడు. తనకేదైనా అవుతుందేమోనన్న భయంతో గేమ్‌లో నుంచి పక్కన పెట్టాలనుకున్నాడు. దీంతో హర్ట్ అయిన మణి కెమెరాలకు కనిపించకుండా గోడకు అతుక్కుని వెక్కివెక్కి ఏడ్చాడు.
బిగ్‌బాస్ షో.. నా జీవితం
నీకేమైనా అయితే ఎలా? నిన్ను నమ్ముకుని ఇద్దరున్నారని అభయ్ అనడంతో ఈ షోయే నా జీవితం, నా పెళ్లాంబిడ్డలు కావాలంటే ఈ షో విన్ అవ్వాలి అని ఏడుపు కొనసాగించాడు. సరే, ఆడుదువులేనని అభయ్ సముదాయించాడు. అటు నబీల్ తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడని విష్ణుప్రియ అనగా.. తాను కేవలం గుడ్లు తీసుకునేందుకు మాత్రమే ప్రయత్నించానని, అనవసరంగా నిందలు వేయొద్దని నబీల్ మండిపడ్డాడు. అటు పృథ్వీ ఆవేశంలో బూతులు అనేసి తలపట్టుకున్నాడు.
నబీల్ అవుట్
ఇంతలో బిగ్‌బాస్ రెండు టీమ్స్ ఎగ్స్ లెక్కపెట్టమన్నాడు. అలా శక్తి టీమ్ దగ్గర 66, కాంతార వద్ద 34 గుడ్లు ఉన్నాయి. దీంతో కాంతార టీమ్‌లో ఒకర్ని సైడ్ చేసే ఛాన్స్ శక్తి టీమ్‌కు ఇచ్చాడు. అలా వాళ్లు నబీల్‌ను గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడంతో ఎపిసోడ్ పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment