లీడర్ అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ముందుండి నడిపించాలి. అంతేకానీ ఏదైతే నాకేంటి? ఎవరెటు పోతే నాకేంటి? అనుకోకూడదు. కానీ అభయ్ అచ్చంగా అదే చేశాడు. తన టీమ్ కష్టపడి సంపాదించిన గుడ్లను కాపాడటం కూడా చేతకాలేదు. పైగా తమ గుడ్లు పోతున్నాయని టీమ్ మెంబర్స్ లబోదిబోమంటే అరవకుండా ఊరుకోమని చెప్తున్నాడు. ఇంకా హౌస్‌లో ఏమేం వింతలు, విశేషాలు జరిగాయో నేటి (సెప్టెంబర్ 19) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
కాంతార టీమ్‌పై విరుచుకుపడ్డ శక్తి టీమ్
బిగ్‌బాస్ హౌస్‌లో నిన్నటి గుడ్ల టాస్క్ నేడు కూడా కొనసాగింది. కోడికూత వినబడగానే కంటెస్టెంట్లు ముందూవెనకా చూసుకోకుండా పరిగెత్తి మరీ గుడ్లను సంపాదిస్తున్నారు. వాటిని జేబుల్లో, టీషర్ట్స్‌లో.. ఎక్కడపడితే అక్కడ దాచేసుకున్నారు. తర్వాత తీరికగా బుట్టల్లో భద్రపరుస్తున్నారు. ఇంతలో కాంతార టీమ్ దగ్గరి నుంచి శక్తి టీమ్ గుడ్లు దొంగిలించింది. ఈ విషయాన్ని టీమ్ సభ్యులు తమ చీఫ్ అభయ్‌కు చెప్పినా అతడు పెద్దగా పట్టించుకోలేదు.
నబీల్‌పై నింద వేశా: విష్ణుప్రియ
కానీ యష్మి, ప్రేరణ మాత్రం దాన్ని అలాగే వదిలేసి ఉండలేకపోయారు. నువ్వానేనా చూసుకుందామన్నరీతిలో పోట్లాడారు. ఈ రౌండ్‌లో శక్తి 66, కాంతార 30 గుడ్లు సంపాదించింది. తర్వాత పెట్టిన గేమ్‌లో కాంతార టీమ్ గెలిచి 90 గుడ్లు సంపాదించింది. ఇక నబీల్ తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడన్న విష్ణుప్రియ ఈరోజు దానిపై క్లారిటీ ఇచ్చింది. అతడు తనను టచ్ చేయలేదని, ఎక్కడ టచ్ చేస్తాడోనన్న భయంతో అలా అరిచానంది. నబీల్ మంచి బాలుడు అని సర్టిఫికెట్ ఇస్తూ సారీ చెప్పింది.
సైకోగాళ్లు.. బిగ్‌బాస్‌నే తిట్టిన అభయ్
కిచెన్ విషయంలో బిగ్‌బాస్ మరిన్ని ఆంక్షలు విధించాడు. ఒక సమయంలో ఒక టీమ్‌కు సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్‌లో వంట చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. వారిది పూర్తయ్యాకే మరో టీమ్ కిచెన్‌లో అడుగుపెట్టాలన్నాడు. ఈ నిర్ణయం విన్న అభయ్.. వీళ్లేమైనా మనిషి పుట్టుక పుట్టారా? దిమాక్ లేదు, సైకోగాళ్లు అంటూ బిగ్‌బాస్‌నే ధిక్కరించాడు. కానీ బిగ్‌బాస్ ఆదేశించాక ఇంకా ఆలోచించాల్సిందేం ఉండదు గనుక హౌస్‌మేట్స్ వెంటనే ఆ రూల్ ఫాలో అయిపోయారు.
రాక్షసుడిలా పృథ్వీ
తర్వాతి రోజు నిఖిల్ ప్రభావతి కోడి దగ్గర ఎర్రగుడ్డు ఉండటం చూశాడు. అదే విషయం తన టీమ్ దగ్గరకు వెళ్లి చెప్పగా వెంటనే వెళ్లి తీసుకోమని సీత తొందరపెట్టింది. ఆమె సూచనతో ఎవరికీ కనబడకుండా ఎగ్ తీసుకొచ్చాడు. అటు సోనియాకు ఏమైందో ఏమో కానీ సడన్‌గా నైనిక మీదకెళ్లి ముద్దులు పెట్టింది. అనంతరం గేమ్ మొదలవగానే పృథ్వీ మళ్లీ రాక్షసుడిగా మారిపోయాడు. ఎటుపడితే అటు తోసేసి, రక్కేసి, లాగేసి, నెట్టేసి చూసేవారినే భయపెట్టించేశాడు.
చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్
అటు కాంతార చీఫ్ అభయ్ మాత్రం మరోసారి తన టీమ్‌కు సపోర్ట్ చేయడం మానేసి ఏం జరిగినా సరే ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించాడు. తనటీమ్ కష్టపడి సాధించిన గుడ్లకు కాపలాగా ఉన్న అభయ్.. తన కళ్లముందే ఎగ్స్ ఎత్తుకుపోతుంటే కూడా పోతే పోనీ అని చూస్తూ ఊరుకుండిపోయాడు. పోయినవాటిని తిరిగి తీసుకొద్దామని యష్మి, ప్రేరణ ప్రయత్నిస్తే కూడా అందుకు అభయ్ ఒప్పుకోలేదు. తన టీమ్ ఓడిపోవడానికి అభయే ప్రత్యక్ష కారకుడయ్యాడు. అతడి నిర్లక్ష్యం వల్ల అవతలి టీమ్ మరింత రెచ్చిపోయారు.
తన్నుకున్న లేడీ కంటెస్టెంట్లు
ఆడాళ్లు అయితే కిందపడి కొట్టుకున్నారు, తన్నుకున్నారు, జుట్టు పీక్కున్నారు. ప్రేరణపై విష్ణుప్రియ, సీత దాడి చేయడంతో ఆమె ఆవేశంలో విష్ణును క్యారెక్టర్‌లెస్ అనేసింది. అటు సోనియా మీద నబీల్ అరవడంతో పృథ్వీ, నిఖిల్ అతడి మీదకు దూసుకెళ్లిపోయారు. చివరగా ఈ రౌండ్‌లో శక్తి టీమ్ దగ్గర 263, కాంతార టీమ్ దగ్గర 25 గుడ్లు మాత్రమే మిగిలాయి. లీడ్‌లో ఉన్న శక్తి టీమ్ కాంతార టీమ్‌లో నుంచి ప్రేరణను గేమ్‌లో నుంచి ఎలిమినేట్ చేసింది. అయితే ఈ రోజు గేమ్‌లో యష్మి, ప్రేరణ శివంగిలా ఫైట్ చేశారని తప్పకుండా చెప్పుకుని తీరాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment