బిగ్‌బాస్‌ అంటే లెక్కలేదా? నిఖిల్‌ అంత చేసినా సోనియా..! | Bigg Boss Telugu 8, Sep 20th Full Episode Review: BB Warns Housemates | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: అభయ్‌ నోటిదురుసు వల్ల అందరికీ నష్టం.. అర్ధరాత్రి బిగ్‌బాస్‌ వార్నింగ్‌

Published Fri, Sep 20 2024 11:19 PM | Last Updated on Sat, Sep 21 2024 8:22 AM

Bigg Boss Telugu 8, Sep 20th Full Episode Review: BB Warns Housemates

బిగ్‌బాస్‌ను ధిక్కరిస్తే ఏమవుతుంది? వీకెండ్‌లో నాగార్జున క్లాస్‌ పీకుతాడు. కానీ ఈసారి అంతవరకు ఆగలేకపోయాడు బిగ్‌బాస్‌. తనమీద కామెడీ హద్దులు దాటడంతో కంటెస్టెంట్లందరికీ వార్నింగ్‌ ఇచ్చాడు. అటు నిఖిల్‌.. టీమ్‌లో అందరినీ పక్కన పెట్టి సోనియాను చీఫ్‌గా గెలిపించాలనుకున్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్‌ 20) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

చీఫ్‌ పదవి పాయే..
నేను ఆడను, మరొకరిని ఆడనివ్వను.. అన్నట్లుంది చీఫ్‌ అభయ్‌ వాలకం. ఇదేం పనికిమాలిన గేమ్‌, బిగ్‌బాస్‌ బయాస్‌డ్‌.. బయట ఇంటర్వ్యూకు వెళ్లినా కూడా అదే మాట చెప్తా.. అని బిగ్‌బాస్‌నే తిట్టాడు. ఇదేదో తేడా కొడుతుందని భావించిన బిగ్‌బాస్‌ గుడ్ల టాస్క్‌ను ముగించేశాడు. ఈ గేమ్‌లో కాంతార టీమ్‌ ఓడిపోవడంతో అభయ్‌ చీఫ్‌ పదవి పోయిందన్నాడు.

మరోసారి చీఫ్‌ రేసులో నిఖిల్‌
శక్తి టీమ్‌ గెలవడంతో ఆ టీమ్‌ లీడర్‌ నిఖిల్‌ మరోసారి చీఫ్‌ పదవి కోసం పోటీపడవచ్చన్నాడు. అలాగే రెడ్‌ ఎగ్‌ ఎవరి దగ్గర ఉంటే వాళ్లు కూడా చీఫ్‌ పోస్ట్‌ కోసం పోటీలో ఉంటారని బిగ్‌బాస్‌ చెప్పాడు. ఆ గుడ్డును ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారనేది నిఖిల్‌ ఆలోచించి తన నిర్ణయం చెప్పాలన్నాడు. అటు కాంతార టీమ్‌ చర్చించుకుని తమలో ముగ్గురిని కంటెండర్లుగా ప్రకటించాలన్నాడు. దీంతో హౌస్‌మేట్స్‌ ఆశ్చర్యపోయారు. 

బిగ్‌బాస్‌నే తీసేయాలట!
ఓడిపోయిన టీమ్‌లో నుంచి ముగ్గురిని సెలక్ట్‌ చేయడమేంటని నోరు తెరిచారు. అభయ్‌ అయితే మరోసారి తన నోటికి పని చెప్పాడు. బిగ్‌బాస్‌కేమైనా క్లారిటీ ఉందా? నోటికేదొస్తే అది చెప్తున్నాడు. అసలు బిగ్‌బాస్‌నే మార్చేయాలి అని అసహనం వ్యక్తం చేశాడు. వీళ్ల నోటిదురుసుకు అడ్డుకట్ట వేయాలని భావించిన బిగ్‌బాస్‌ అర్ధరాత్రి హౌస్‌మేట్స్‌ను గార్డెన్‌ ఏరియాలో నిలబడెట్టాడు. 

ఇప్పుడే వెళ్లిపోండి
గెలిచిన శక్తి టీమ్‌లో నిఖిల్‌ చీఫ్‌ పదవి కోసం ఒకరితో మాత్రమే తలపడాల్సి ఉంటుంది. అది అతడికి లభించిన ప్రయోజనం.. ఓడిన కాంతార టీమ్‌లో ముగ్గురు చీఫ్‌ పదవి కోసం పోట్లాడాల్సి ఉంటుంది. ఇదే బిగ్‌బాస్‌ గేమ్‌ అని క్లారిటీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ రూల్స్‌కు కట్టుబడి ఉంటేనే ఇక్కడ ఉండండి, కాదు కూడదనుకుంటే వెళ్లిపోండి, బిగ్‌బాస్‌కంటే తామే ఎక్కువని ఫీలైతే ఉండాల్సిన అవసరం లేదు అని గేట్లు తెరిచాడు.

సారీ చెప్పమన్న సోనియా
దీంతో సోనియా.. అభయ్‌ను పిలిచి సారీ అయినా చెప్పు అని సలహా ఇచ్చింది. అతడు అందుకు ఒప్పుకోకపోవడంతో హౌస్‌మేట్స్‌ అందరూ కలిసి బిగ్‌బాస్‌కు సారీ చెప్పారు. పైగా తనేం తప్పు చేయలేదని బుకాయించాడు. తన కామెడీని సీరియస్‌గా తీసుకోవద్దని బిగ్‌బాస్‌కే నీతులు చెప్పాడు. ఇదిలా ఉంటే నిఖిల్‌ సిగరెట్‌ తాగినందుకు సోనియా హర్ట్‌ అయింది.. ఎంతోమంది చెప్పినా మానుకోలేదు, ఈమె చెప్తే సడన్‌గా ఎలా మానేస్తానని నిఖిల్‌ తన బాధను అభయ్‌తో చెప్పుకున్నాడు. 

నిఖిల్‌ సుద్దపూస
తన వ్యక్తిగత విషయాల్లో దూరడం నచ్చట్లేదన్నాడు. అటు సోనియా.. అభయ్‌ దగ్గరకు వెళ్లి నిఖిల్‌ సుద్దపూస అని సెటైర్లు వేసింది. తనతో రెండు రోజులదాకా మాట్లాడాలని లేదని పేర్కొంది. అసలతడికి నిర్ణయాలు తీసుకోవడమే సరిగా లేదంది. అలా అన్న కాసేపటికే మళ్లీ నిఖిల్‌ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. సరిగ్గా అదే సమయంలో రెడ్‌ ఎగ్‌ ఎవరికి ఇస్తావని సీత నిఖిల్‌ను అడిగింది. అందుకు యష్మి.. ఆన్సర్‌ అందరికీ తెలిసిందేగా అనేసింది.

ఒక్కరు చేసిన తప్పుకు అందరికీ శిక్ష
ఇక బిగ్‌బాస్‌.. అభయ్‌ తనపై అభ్యంతరకర పదజాలం వాడారని మండిపడ్డాడు. రాజు అలా ప్రవర్తిస్తే ప్రజల నుంచి ఇంకా ఏం ఆశించగలం? అతడు చేసిన పనికి టీమ్‌ సభ్యులందరూ శిక్ష అనుభవించాల్సిందేనంటూ కాంతార టీమ్‌కు చీఫ్‌ పదవి కోసం కంటెండర్‌ అయ్యే అవకాశాన్ని కోల్పోయినట్లు ప్రకటించాడు. అటు అందరూ ఊహించినట్లుగానే నిఖిల్‌ రెడ్‌ ఎగ్‌ను సోనియాకు ఇచ్చాడు. 

మరోసారి చీఫ్‌గా నిఖిల్‌
ఆ ఎగ్‌ తీసుకోమని సలహా ఇచ్చిన తననే పక్కన పెట్టేయడంతో సీత ఏడ్చేసింది. ఆమెను ఓదార్చడానికి నిఖిల్‌ రాగా.. వెళ్లిపో, ప్లీజ్‌ అని బతిమాలింది. ఇక నిఖిల్‌, సోనియాకు నిదానమే ప్రధానం అని టాస్క్‌ ఇవ్వగా ఇందులో నిఖిల్‌ గెలిచి మరోసారి చీఫ్‌గా నిలిచాడు. అయితే అతడిలో మరోసారి చీఫ్‌ అయ్యానన్న సంతోషం కన్నా సోనియా గెలవలేదన్న బాధే ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది.

చదవండి: నటుడితో ప్రేమ.. అమ్మకు అస్సలు ఇష్టం లేదన్న హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement