బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో మొదటివారం నామినేషన్ ప్రక్రియలోనే కన్నీళ్ల వరద పారింది. తాను ఏడుస్తూ పక్కవాళ్లను కూడా ఏడిపించాడు మణికంఠ. అసలేం జరిగిందో, నేటి(సెప్టెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి..
పని చేయట్లేదంటూ..
ఆదిత్య ఓం.. వాలంటీర్‌గా పనులు చేయడం లేదని శేఖర్ బాషాను, తక్కువ పని చేస్తున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ ఇద్దరిలో చీఫ్ యష్మి.. శేఖర్ బాషా నామినేషన్‌కు మద్దతిచ్చి పృథ్వీని సేవ్ చేసింది. సీత.. బేబక్క, ప్రేరణను నామినేట్ చేసింది. వీరిలో బేబక్క నామినేషన్‌ను చీఫ్ నైనిక ఫైనల్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. తర్వాత విష్ణుప్రియ.. బాషా, సోనియాను నామినేట్ చేయగా చీఫ్ నిఖిల్ బాషా నామినేషన్‌నే ఫైనలైజ్ చేసి సోనియాను సేవ్ చేశాడు.
అన్‌ఫిట్ అయితే పోతా..
అనంతరం అభయ్ నవీన్.. నాగమణికంఠను నామినేట్ చేశాడు. ఎవ్వరి ఫ్లాష్‌బ్యాక్ ఎవడికీ అవసరం లేదు. నీకు ఎన్ని సమస్యలున్నా నాకనవసరం. గేమ్‌లో నాకేదైనా నచ్చలేదంటే చెప్పే హక్కు నాకుంది. ఈ గేమ్‌లో ఏం జరిగినా తీసుకోవడానికి రెడీ అనుకునేవాళ్లే హౌస్‌లో ఉండాలి. నీలో ఆ లక్షణం లేదని తేల్చాడు. దీంతో నాగమణికంఠ.. నేను అన్‌ఫిట్ అయితే ఈ వారమే వెళ్లిపోతానని ఫ్రస్టేట్ అయ్యాడు. అనంతరం అభయ్.. బేబక్కను నామినేట్ చేశాడు. పుండు మీద కారం చల్లినట్లు చీఫ్ యష్మి.. నాగమణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది.
మళ్లీ బాధలు చెప్పుకున్న మణి
తర్వాత ప్రేరణ.. నాగమణికంఠ పేరెత్తడంతో అందరూ నాపై ఇలా పడ్డారేంటని బోరుమని ఏడ్చేశాడు. ఏడో తరగతి నుంచి నానాకష్టాలు పడ్డాను. కన్నతండ్రిని పోగొట్టుకున్నా, సవతి తండ్రి చేతిలో అవమానాలు ఎదుర్కొన్నా. అమ్మ చనిపోతే అందరి దగ్గర డబ్బు అడుక్కుని అంత్యక్రియలు చేశాను. నాకు అందరి మీదా నమ్మకం పోయింది. నా కూతురు దూరమైన సమయంలో, చచ్చిపోదామనుకుంటున్న క్షణంలో నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఇది నాకు చాలా అవసరం. అది మీకెవరికీ అర్థం కావడం లేదు. నేనెక్కడా విక్టిమ్ కార్డ్ వాడటం లేదు.
నా జీవితం దగ్గరుండి చూశారా?
నా కర్మ కాలి మొదటి రోజు నిజంగా ఎలిమినేట్ చేస్తున్నారన్న బాధలో మీకు నా గురించి తెలీదు, నేను వెళ్లిపోతున్నానంటూ కోప్పడ్డాను. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని పదేపదే నా మీద పడుతున్నారు. మీరేమైనా నా జీవితం చూశారా? అని అందరినీ నిలదీస్తూనే.. ఎమోషనల్‌గా ఉన్నప్పుడు మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు. మిమ్మల్ని ఏమైనా అనుంటే సారీ.. అని అపరిచితుడిలో రాములా మారిపోయాడు.
ఏడిపించేసిన మణి
నేను గేమ్ గెలవాలనుకున్నాను. కనీసం ఐదు వారాలైనా ఉండాలనుకున్నానంటూ ఏడుస్తూనే మాట్లాడాడు. నాగమణికంఠ పడ్డ బాధలు విన్నాక అతడి కంటే కూడా యష్మినే ఎక్కువ గుక్కపెట్టి ఏడ్చింది. తర్వాత ప్రేరణ.. సోనియాను నామినేట్ చేసింది. ఇద్దరికి చెప్పిన కారణాలు విన్నాక చీఫ్.. నాగమణికంఠను సేవ్ చేసి సోనియాను నామినేట్ చేశాడు.
అందుకే తిరిగావా?
నాగమణికంఠ.. నేను క్యూట్‌గా ఉన్నాను, నాలో ఫెమినిజం ఉందని విష్ణుప్రియ చెప్పిన మాట నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు. పైగా విష్ఱుప్రియ ఏమైనా పదాలు జారుతుందేమోనని మూడురోజులుగా తనతో తిరుగుతున్నానని చెప్పాడు. అంటే ఇన్నిరోజులు ఫ్రెండ్‌గా ఉండలేదా? నన్ను చెక్ చేస్తున్నావా? అని విష్ణుప్రియ ఎమోషనలైంది.
సింపతీ కార్డ్
అనంతరం బాషాను నామినేట్ చేస్తూ తినే పండ్లతో ఆడటం నచ్చలేదన్నాడు. అలాగైతే నువ్వు నిద్రపోతే కుక్క మొరిగిందిగా, అది తప్పు కాదా అని బాషా కౌంటరిచ్చాడు. ప్రతి ఒక్కరికీ ఫ్లాష్‌బ్యాక్ ఉంది, అందరూ అది చెప్పుకుని ఏడవట్లేదు.. నువ్వు ఏదో సింపతీ, రాజకీయం క్రియేట్ చేస్తున్నావని ఇచ్చిపడేశాడు. ఈ వాదనలు విన్న చీఫ్ యష్మి.. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ బాషాను సేవ్ చేశాడు.
నామినేషన్‌లో ఎవరంటే?
తర్వాత పృథ్వీ.. నీకు సీరియస్‌నెస్ లేదంటూ బేబక్కను, సింపతీ కార్డ్ వాడుతున్నావు, రెండు నాలుకలు ఉన్నాయంటూ నాగమణికంఠను నామినేట్ చేశాడు. మొత్తంగా మొదటివారం బేబక్క, సోనియా, శేఖర్ బాషా, విష్ణుప్రియ, పృథ్వీ, నాగమణికంఠలు నామినేట్ అయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కూడా మణికంఠ ఏడుపు ఆపలేదు.
నా చివరి యుద్ధం
డ్యాం గేట్లు ఎత్తినట్లు ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు. నాకు ఏ దిక్కూ లేదు, నా దగ్గర ఒక్క రూపాయి లేదు, రేపు నేను బయటకు వెళ్లాక నన్ను నెగెటివ్ అనుకుంటారు. ఇది నా చివరి యుద్ధం. గేమ్ ఎలా ఆడాలో అర్థం కావట్లేదని కన్నీళ్లు పెట్టుకుంటూనే విగ్ నేలకేసి కొట్టాడు. దీంతో నిఖిల్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు.
నా భార్య నాక్కావాలి
అతడు కన్నీళ్ల టాప్‌ను కట్టేయకపోవడంతో బిగ్‌బాస్ నను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు. అక్కడ.. నా భార్య నాక్కావాలి, అత్తామామ దగ్గర నాకు గౌరవం కావాలి. నా సవతి తండ్రి నాక్కావాలి. నా పాప నాకు కావాలి. నాకు మనుషులు కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను.. నాపై నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నా మైండ్ సెట్ మార్చుకోవాలనుకున్నాను. కానీ నా వల్ల కావట్లేదంటూ మళ్లీ విలపించాడు. దీంతో బిగ్‌బాస్.. నిన్ను నువ్వు నమ్ము, ధైర్యాన్ని కోల్పోకు అని నాలుగు మంచి మాటలు చెప్పి పంపించేశాడు.
Comments
Please login to add a commentAdd a comment