థియేటర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు.. ఓటీటీ అంటే థ్రిల్లర్ మూవీస్ అనేది ప్రస్తుతం ట్రెండ్. అందుకు తగ్గట్లే డిఫరెంట్ కథలతో తీస్తున్న థ్రిల్లర్స్.. భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అలా కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 'బ్లాక్'. అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)
కథేంటి?
వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే మూవీస్ చూద్దామనుకునే వాళ్లకు 'బ్లాక్' నచ్చేస్తుంది. 1964లో సినిమా ఓపెన్ అవుతుంది. తన ఫ్రెండ్, అతడి ప్రేయసికి మనోహర్ (వివేక్ ప్రసన్న).. బీచ్ దగ్గర్లోని తన విల్లాలో ఉంచి, తర్వాతి రోజు ఉదయం పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ అనుకోని కొన్ని సంఘటనల వల్ల వాళ్లిద్దరినీ ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే స్టోరీ 60 ఏళ్ల తర్వాత అంటే ప్రస్తుతానికి వస్తుంది.
వసంత్, ఆరణ్య.. వాళ్లిద్దరి ప్రవర్తన, మనస్తత్వాలు ఇలా సీన్స్ వెళ్తుంటాయి. కాకపోతే ఇవి రొటీన్‌గా ఉంటాయి. ఎప్పుడైతే వీళ్లిద్దరూ విల్లాలోకి అడుగుపెడతారో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. తమలాంటి ఇద్దరు వ్యకులు వీళ్లకు కనిపించడంతో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. అలా హారర్, సూపర్ నేచురల్ ఎలిమెంట్ ఏదో ఉందనే ఉత్కంఠ కలుగుతుంది. చీకటి ప్రదేశం కారణంగా ప్రతిసారీ తాము వివిధ కాలాల్లోకి (టైమ్ లైన్) ముందుకు వెనక్కి వెళుతున్నామని వసంత్ తెలుసుకోవడం, చీకటి ప్రదేశం కారణంగానే వసంత్-ఆర్యం ఒకరికొకరు దూరమవడం.. చివరకు ఎలా కలుసుకున్నారనేది సినిమా.
(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)
సినిమా చూస్తున్నంతసేపు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కాకపోతే అలా జరగడానికి వెనకున్న కారణాన్ని బయటపెట్టే సీన్ మాత్రం పేలవంగా ఉంటుంది. ఏదో ఫిజిక్స్ క్లాస్ చెబుతున్నట్లు వేగంగా చూపించేశారు. దీంతో సగటు ప్రేక్షకుడికి సరిగా అర్థం కాదు. క్లైమాక్స్ కూడా ఏదో హడావుడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా రెండు గంటల్లోపే ఉండటం ప్లస్ పాయింట్.
ఎవరెలా చేశారు?
సినిమాలో జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. వీళ్లిద్దరూ ఆయా పాత్రల్లో ఆకట్టుకున్నారు. వాస్తవానికి, ఊహలకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా జీవా వేరియషన్స్ చూపించాడు. వివేక్ ప్రసన్నతో పాటు మిగిలిన వాళ్లది అతిథి పాత్రలే. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ కేజీ సుబ్రమణి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. కాకపోతే స్క్రిప్ట్‌లో లాజిక్స్ సరిగా ఎష్టాబ్లిష్ చేసుంటే బాగుండేది అనిపించింది. శామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్. కొన్ని సీన్లను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. మిగిలిన డిపార్ట్‌మెంట్స్ తమ వంతు న్యాయం చేశారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఓటీటీలో థ్రిల్లర్ మూవీ ఏదైనా చూద్దామనుకుంటే 'బ్లాక్' ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి తమిళ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ ఉన్నాయి.
-చందు డొంకాన
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లతో బయటకొచ్చిన శోభా శెట్టి)
Comments
Please login to add a commentAdd a comment