'స్టార్', 'దాదా' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు కవిన్. ఇతడు బిచ్చగాడు పాత్రలో నటించిన మూవీ 'బ్లడీ బెగ్గర్'. దీపావళి సందర్భంగా తమిళంలో రిలీజైంది. వారం తర్వాత అంటే ఇప్పుడు (నవంబర్ 7) తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు.. అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). వచ్చిన డబ్బులతో లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఓ రోజు దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్లతో పాటు ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా దొంగచాటుగా బంగ్లాలోకి వెళ్తాడు. కాసేపటివరకు బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బంగ్లా యజమానులు బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ?
(ఇదీ చదవండి: Amaran Review: ‘అమరన్’ మూవీ రివ్యూ)
ఎలా ఉందంటే?
సినిమాల్లో ఏదైనా పాత్ర చనిపోతే మనం బాధపడతాం. అది ఎప్పుడూ జరిగేదే. కానీ ఓ పాత్ర చనిపోయినప్పుడు కూడా మనకు నవ్వొచ్చింది అంటే అది డార్క్ కామెడీ సినిమా అని అర్థం. 'బ్లడీ బెగ్గర్' కూడా అలాంటి బ్లాక్ లేదా డార్క్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు.
ఓ పిల్లాడిని.. బర్త్ డే బంప్స్ పేరుతో మరో నలుగురు పిల్లలు కొట్టి చంపే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే బిచ్చగాడిని చూపిస్తారు. మాయమాటలు చెప్పి జనాల్ని ఎలా మోసం చేస్తున్నాడు? వచ్చిన డబ్బుతో జాలీగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనేది చూపించారు. ఈ బిచ్చగాడు.. ఓ పెద్ద భవంతిలోకి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది.
కొన్నాళ్ల క్రితం చనిపోయిన చంద్రబోస్ అనే స్టార్ హీరోది ఆ బంగ్లా. ఈయనకు కోట్ల ఆస్తి ఉంటుంది. నలుగురు పిల్లలు. డబ్బు, ఈగోలకు పోయి చంపడానికైనా సరే వెనకాడరు. ఆస్తి దక్కుతుందని బంగ్లాకు వచ్చిన వీళ్లకు.. తండ్రి తన సవతి కొడుకు పేరు మీద ఆస్తి అంతా రాసేశారని తెలిసి షాకవుతారు. ఆ సవతి కొడుకుని అప్పటికే లాయర్ చంపేసుంటాడు. వాడి స్థానంలో బిచ్చగాడిని ఇరికిస్తారు. ఆ తర్వాత డబ్బు కోసం ఒకరిని ఒకరు ఎలా చంపుకొన్నారనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)
రెగ్యులర్, రొటీన్ సినిమాలతో పోలిస్తే ఇదో డిఫరెంట్ కథ. బిచ్చగాడి చేతిలో డబ్బునోళ్లు కుక్క చావు చావడం అనే కాన్సెప్టే వింతగా ఉంటుంది. ఒక్కో పాత్ర తమ తోటి వాళ్లనే దారుణంగా చంపేస్తుంటారు. కాకపోతే ఆ సీన్స్‌లో మనం భయపడాల్సింది పోయి నవ్వుతాం. అంత వెరైటీగా ఉంటాయి. బిచ్చగాడు.. బంగ్లాలోకి ఎంటర్ అయిన తర్వాత కాసేపు బోర్ కొడుతుంది. కానీ సెకండాఫ్ మొదలైన తర్వాత మాత్రం ఊహించని ట్విస్టులు.. ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తాయి.
భారీకాయంతో ఉండే మహిళ, జావెలిన్ త్రో విసిరే భర్త, వీళ్లకు పుట్టిన పిల్లాడు.. ఈ ముగ్గురు ఒక్కో వ్యక్తుల్ని చంపే సీన్స్ ఉంటాయి. ఇవైతే సర్‌ప్రైజ్ చేస్తాయి. ప్రారంభం నుంచి చూపించిన సన్నివేశాలు, వస్తువులు, ఉండే మనుషులు.. చెప్పాలంటే ప్రతి చిన్న పాయింట్‌ని దర్శకుడు మొదలుపెట్టిన తీరు.. ముగించిన విధానం అరె భలే తీశాడ్రా అనిపిస్తుంది.
ఎవరెలా చేశాడు?
బిచ్చగాడి పాత్రలో కనిపించిన కవిన్ అదరగొట్టేశాడు. ప్రారంభంలో పది నిమిషాల్లోనే బిచ్చగాడు పాత్ర రూపు మారుతుంది. మరికాసేపు బిచ్చగాడి సీన్స్ ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. అంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. చనిపోయిన నటుడి కొడుకు-కూతుళ్లు, మనవడు-మనవరాళ్లుగా చేసిన పాత్రధారులు ఎవరికి వాళ్లు అదరగొట్టేశారు. కన్నింగ్ లాయర్‌గా చేసిన సునీల్ సుకంద అయితే నచ్చేస్తాడు.
టెక్నికల్ విషయాలకొస్తే దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తీసుకున్న పాయింట్ డిఫరెంట్. దాన్ని ప్రెజంట్ చేసిన విధానం అంతే డిఫరెంట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రఫీ-ఎడిటింగ్ బాగున్నాయి. సినిమా అంతా బంగ్లాలోనే జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. డార్క్ కామెడీ జానర్ నచ్చేవాళ్లకు మాత్రం ఎక్కుతుంది.
-చందు డొంకాన
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?)
Comments
Please login to add a commentAdd a comment