విలక్షణ నటుడు సంజీవ్ కుమార్‌కు కెరీర్ కలిసొచ్చినట్టుగా ప్రేమ కలిసిరాలేదు. డ్రీమ్‌గర్ల్ హేమమాలిని మీద మనసు పారేసుకున్నాడు.. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని ఆరాటపడ్డాడు.. ఆమె కోసం పరితపించాడు.. ఒంటరితనాన్ని తోడెంచుకున్నాడు...
దాదాపు ముప్పై ఏళ్లు సినీ రంగంలో ఉన్నా లౌక్యం ఒంటబట్టలేదు సంజీవ్ కుమార్‌కు. ఉన్నదున్నట్టు మాట్లాడ్డం అతని గుణం. వచ్చిన కొత్తలోనే ఆనాటికే పేరు ప్రఖ్యాతులున్న నటి నూతన్ (శోభనా సమర్థ్ కూతురు, తనూజ సోదరి, బాలీవుడ్ నటుడు మొహనీశ్ బెహెల్ తల్లి, కాజోల్‌కు పెద్దమ్మ)ను ఇష్టపడ్డాడు. షూటింగ్ సెట్‌లోనే అందరి ముందు నూతన్‌కు ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. అప్పటికే వివాహిత అయిన నూతన్‌కు సంజీవ్ కుమార్‌ది పిల్లచేష్టలా తోచింది. కోపంతో అతని చెంప చెళ్లుమనిపించింది. ఆ దెబ్బతో సంజీవ్ కుమార్ జీవితంలో ఎప్పుడూ నూతన్‌కు ఎదురు పడలేదు. (ఆ రెండు ప్రశ్నలకు రియా సమాధానం?)
జితేంద్ర మధ్యవర్తిత్వం..
‘సీతా ఔర్ గీతా’ షూటింగ్ రోజులవి. తొలి రోజే సంజీవ్ కుమార్ మదిలో స్థిరపడిపోయింది హేమమాలిని. భౌతికంగా షూటింగ్‌లో ఉంటున్నాడు తప్ప అతని డేట్స్ అన్నీ ఆమె తలపులతోనే నిండిపోయాయి. పెదవి విప్పి చెప్పాలంటే భయం. మొదటిసారి ఎదురైన అనుభవం రిపీట్ అయ్యి, రెండో చెంపా చెళ్లుమంటుందేమోనని. అందుకే తనకు, హేమమాలినికీ సన్నిహితుడైన జితేంద్రతో చెప్పాడు తన ఫీలింగ్స్‌ని.. ఆమెకు చేరవేయమని. ప్రేమలో మధ్యవర్తిత్వం కూడదన్న ఎరుక లేక. అయితే సంజీవ్ కుమార్ ప్రేమకు మెసెంజర్‌గా వెళ్లి తాను హేమను ఇష్టపడ్డం మొదలుపెట్టాడు ఆ సరికే శోభ సిప్పీతో డేటింగ్‌లో ఉన్న జితేంద్ర. ఓ వైపు ‘సీతా ఔర్ గీతా’ పూర్తి కావస్తున్నా హేమ దగ్గర జితేంద్ర తన జిక్ర్ తేలకపోయేసరికి తనే మనసులో మాటను చెప్పేయలనే నిర్ణయానికి వచ్చేశాడు సంజీవ్ కుమార్.
ఓ రోజు చెప్పేశాడు కూడా.. ‘హేమాజీ! మీరంటే నాకిష్టం. మీకూ ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని. ‘ఊ.. సరే’ అంటూ సమాధానమిచ్చింది హేమమాలిని. సంజీవ్ కుమార్ సంతోషానికి అవధుల్లేవు. అదెన్నో రోజులు నిలవలేదు. ఈ విషయం హేమమాలిని వాళ్ల అమ్మకు తెలిసి ‘కుమార్‌తో నీ పెళ్లి కుదరదు’ అంటూ హుకుం జారీ చేసింది. ఆ మాటకూ తలొగ్గి సంజీవ్ కుమార్‌కు ‘నో’ చెప్పింది హేమమాలిని. ఇది తెలిసి .. ‘ఐ లవ్ యూ’ అంటూ హేమ ముందుకొచ్చాడు జితేంద్ర... శోభ సిప్పీతో ఉన్న సంబంధాన్ని దాచి. అయితే ఆ నిజాన్ని శోభ సిప్పీనే బయట పెట్టింది హేమమాలిని దగ్గర. ఊహించని ఈ పరిణామానికి కాస్త భంగపడ్డా కోలుకుంది హేమ. కాని.. సంజీవ్ కుమారే కోలుకోలేకపోయాడు. మందును మచ్చిక చేసుకున్నాడు.
1974– 75..
‘షోలే’ స్క్రిప్ట్ పట్టుకుని సంజీవ్ కుమార్ దగ్గరకు వెళ్లాడు రమేశ్ సిప్పీ. ‘వీరు’ పాత్రను ఆఫర్ చేశాడు. అన్యమనస్కంగా అటూఇటూ కదిలాడు కుమార్. వీరు జత బసంతిగా హేమమాలిని ఓకే అయినట్టు చెవినేశాడు. ఆమెకు దగ్గర కావడానికి దీన్ని ఇంకో చాన్స్‌గా ఉపయోగించుకోవచ్చంటూ కుమార్‌లో ఆశ పుట్టించాడు సిప్పీ. పాజిటివ్‌గా కదిలాడు కుమార్. అయితే ఆ సమయానికి ధర్మేంద్ర .. హేమమాలిని చేయి అందుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. షోలే స్క్రిప్ట్ పట్టుకుని ధర్మేంద్ర దగ్గరకూ వెళ్లాడు సిప్పీ. ‘ఠాకూర్’ క్యారెక్టర్‌కు మీరైతే బాగుంటుంది’ అంటూ. ఒప్పుకున్నాడు ధర్మేంద్ర. తర్వాత ‘వీరు’ సంజీవ్ కుమార్ వశమైందని తెలిసి, ఆ పాత్ర ఇస్తేనే ‘షోలే’ చేస్తాను లేకుంటే లేదని సిప్పీకి స్పష్టం చేశాడు ధర్మేంద్ర... కుమార్.. హేమను ఇష్టపడుతున్నాడనే స్పృహాతో. మళ్లీ కుమార్‌ను కలిసి జరిగింది వివరించి ‘హేమను కన్విన్స్ చేయడానికి కావల్సింది ఇంకొక్క అవకాశమే కదా ఠాకూర్ రోల్ తీసుకో’ అని సముదాయించాడు సిప్పీ.
‘కానీయ్’ అన్నట్టుగా తలాడించాడు కుమార్. షూటింగ్ ప్రారంభమైంది. కుమార్ ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. హేమ దగ్గర తన ప్రేమను ప్రస్తావించాడు మళ్లీ. ‘కాదన్నాను కదా’ అంది ఆమె. ఇదంతా ధర్మేంద్రకు చేరింది. ఆ సినిమాలో ఠాకూర్, బసంతిల మధ్య ఒక్క సీన్ కూడా ఉండరాదని శాసించాడు స్టార్ హోదాలో ఉన్న అతను. అందుకే ‘షోలే’లో సంజీవ్ కుమార్, హేమమాలినిల మధ్య ఒక్క సీన్ కూడా ఉండదు. రెండోసారీ హేమమాలినితో ‘నో ’ అనిపించుకున్నాక కుంగిపోయాడు సంజీవ్ కుమార్. ఒకింత డిప్రెషన్‌లోకీ వెళ్లాడు. ఆ షాక్ వల్లే అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందనీ అంటారు సినీ విమర్శకులు.
సంజీవ్ కుమార్ నవ్వుకి, నటనకు పడిపోయిన నటీమణులెంతమందో. అతను భోజన ప్రియుడని.. అతనికిష్టమైన వంటలను స్వయంగా వండి, షూటింగ్ స్పాట్స్‌కు తెచ్చిస్తూ అతని మీద తమకున్న ఇష్టాన్ని ప్రకటించుకున్నారు. పెళ్లి చేసుకోమని కోరారు. అందరికీ అతని నవ్వే సమాధానమైంది. గుండె మాత్రం హేమ ప్రేమ కోసం తపిస్తూ.. షోలే (జ్వాల)లా రగులుతూనే ఉండింది. దిగులు ఇంట్లోని సంజీవ్ కుమార్‌కు ఆ సమయంలో దొరికిన సాంత్వన సులక్షణా పండిట్.
Comments
Please login to add a commentAdd a comment