
తమిళసినిమా: హీరోగా, కమెడియన్‌గా వరుస పెట్టి చిత్రాలు చేస్తున్న నటుడు యోగిబాబు. తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి లక్కీమ్యాన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో యోగిబాబు, వీర, రాచర్, రబేకా, అబ్దుల్ లీ, ఆర్‌ఎస్ శివాజీ, అమిత్ భార్గవ్, సాత్విక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా థింక్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ వేణుగోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సందీప్ కే విజయ్ చాయాగ్రహణం, సాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ.. ఇది సమాజంలో జరుగుతున్న ఒక ప్రధాన సమస్యను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. అదే విధంగా కమర్షియల్ అంశాలతో ఫీల్‌గుడ్ మూవీగా ఉంటుందని చెప్పారు. అదృష్టవంతుడైన ఒక యువకుడు జీవితంలో అది ఎంతవరకు ఉంటుంది, దానిని నమ్ముకున్న అతని గమ్యం ఎటువైపు సాగుతుంది అన్న ఆసక్తికరమైన అంశాలతో ఉంటుందన్నారు.
ఈ పాత్రకు ప్రతిభావంతుడైన నటుడు అవసరమయ్యారని దీంతో నటుడు యోగిబాబు కరెక్ట్‌గా నప్పుతారని భావించి ఆయన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. చిత్రంలో ఆయనకు స్థాయికి తగ్గట్లుగా వినోదం ఉంటుందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. కాగా చిత్రం పస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేసినట్లు దర్శకుడు తెలిపారు. త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.