ఆర్‌జీవీ దిశకు వరుస ఎదురుదెబ్బలు | Disha Accused Family members Approach HC On RGV Movie | Sakshi
Sakshi News home page

విలన్స్‌గా చూపెడుతున్నారు మూవీని నిలిపివేయండి

Published Mon, Nov 2 2020 1:12 PM | Last Updated on Mon, Nov 2 2020 4:57 PM

Disha Accused Family members Approach HC On RGV Movie - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, హత్య ఘటనపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నిర్మిస్తున్న చిత్రానికి వరుసగా అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. దిశ హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ఇదివరకే హైకోర్టును ఆశ్రయించారు. సినిమాను నిలిపివేసేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్‌ బోర్డును ఆదేశించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉన్న క్రమంలోనే మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ చిత్రాన్ని నిలిపి వెయ్యాలని కోరుతూ దిశ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులచే ఎన్‌కౌంటర్‌కు గురైన జోళ్లు శివ, జోళ్ళు నవీన్, చెన్నకేశవులు, హైమ్మద్ ఆరీఫ్ కుటుంబ సభ్యులు సోమవారం హైకోర్టుకు చేరుకున్నారు.

ఈ చిత్రంలో తమ వాళ్ళను విలన్స్‌గా చూపెడుతూ.. చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్ని కమిటీకి ఫిర్యాదు చేశారు. దీని వల్ల నిందితుల కుటుంబ సభ్యుల హక్కులకు భంగం కలుగుతోందని వాపోయారు. కుటుంబ సభ్యులతో పాటు పెరుగుతున్న పిల్లల మీద ఈ చిత్రం తీవ్ర ప్రభావం పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చనిపోయిన వారిపై చిత్రాన్ని తీసి తమను మానసికంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ఎంక్వయిరీ కొనసాగుతుంటే దిశ కథను ఎలా తెరకెక్కిస్తారని ఫిర్యాదులో ప్రశ్నించారు. రామ్ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వెంటనే నిలిపి వెయ్యాలని కమిషన్‌ను కోరారు. నిందితుల తరుఫున న్యాయవాదుల సమక్షంలో కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే మూవీ ప్రారంభం దశలో వివాదాలు చుట్టుముట్టడంతో దిశ చిత్రం అసలు తెరపైకి వస్తుందాలేదా అనేది సందేహంగా మారింది.

కాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో గతేడాది నవంబరు 27న వెటర్నరీ వైద్యురాలిపై మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్‌, జొల్లు శివ, చెన్నకేశవులు అనే నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెపై పెట్రోలు పోసి దారుణంగా హతమార్చిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా వారు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో.. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కమిషన్‌ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement