‘‘నేనెంతో ఆత్మగౌరవంతో ఈ సినిమాని రూపొందించాను. కత్తెర లేని వెర్షన్‌నే రిలీజ్ చేయాలని నిశ్చయించుకున్నాను. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. అన్‌కట్ వెర్షన్‌నే విడుదల చేస్తాను’’ అని కంగనా రనౌత్ అన్నారు. కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. గత ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.
ఈ నెల 6న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ మాట్లాడుతూ– ‘‘నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు. ఇది ఘోరమైన పరిస్థితి. మన దేశం విషయంలో చాలా నిరాశగా ఉన్నాను. ఓటీటీలో హింస, అశ్లీలం వంటివి చూపించినా అభ్యంతరం చెప్పరు. ఓటీటీకి అంత స్వేచ్ఛ ఉంది.
నా సినిమా విషయంలో ఇందిరా గాంధీ హత్యను చూపించకూడదనీ, భింద్రన్‌వాలేను చూపించవద్దనీ, పంజాబ్ అల్లర్లను చూపించవద్దనే ఒత్తిడి ఉంది. ఇవేవీ చూపించొద్దంటే ఇక చూపించడానికి ఏం మిగిలి ఉంటుందో? కొన్ని సినిమాలు రూపొందించడానికి కొందరికి మాత్రమే సెన్సార్‌షిప్ ఉంటుంది’’ అని ఘాటుగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment