Muttiah Muralitharan: నా జీవితమే సినిమాలా ఉంటుంది | Exclusive Interview With Cricketer Muttiah Muralitharan On 800 Movie | Sakshi
Sakshi News home page

Muttiah Muralitharan: నా జీవితమే సినిమాలా ఉంటుంది

Published Thu, Sep 28 2023 12:42 AM | Last Updated on Thu, Sep 28 2023 12:42 AM

Exclusive Interview With Cricketer Muttiah Muralitharan On 800 Movie - Sakshi

‘‘నా బయోపిక్‌గా ‘800’ అనుకున్నప్పుడు స్క్రిప్ట్‌ నాలుగైదుసార్లు చదివా. ఇందులో ఎటువంటి మసాలా ఉండకూడదనే విషయాన్ని దర్శక–నిర్మాతలకు ముందుగానే చెప్పాను. నిజమైన కథ లేకపోతే అది బయోపిక్‌ కాదు. నా జీవితమే సినిమాలా ఉంటుంది. నా జీవితంలో ఎత్తుపల్లాలు ఎలా అయితే ఉన్నాయో.. ‘800’ విడుదల వెనక అలాగే ఎత్తుపల్లాలు ఉన్నాయి’’ అని శ్రీలంక  ప్రముఖ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ అన్నారు.

ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్‌ మిట్టల్‌ నటించారు. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ నిర్మించింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో అక్టోబర్‌ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ముత్తయ్య మురళీధరన్‌ విలేకరులతో పంచుకున్న విశేషాలు.

► మీ బయోపిక్‌ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది?  
నా జీవితాన్ని సినిమాగా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీలంక ప్రజలకు సహాయం చేయడం కోసం 20 ఏళ్ల క్రితం ఓ ఫౌండేషన్‌ స్థాపించి, ఎంతో మందికి సాయం అందించాం. శ్రీలంకలోని తమిళ ప్రజలకు సాయం చేయడానికి దర్శకుడు వెంకట్‌ ప్రభు 2008లో వచ్చారు. ఆయనతో పాటు ‘800’ చిత్రదర్శకుడు శ్రీపతి, ఇంకో ఇద్దరు ఉన్నారు. నా వైఫ్‌ మదిమలర్, వెంకట్‌ ప్రభు చిన్ననాటి స్నేహితులు కావడంతో మమ్మల్ని కలిశారు. నా ట్రోఫీలు, సాధించిన ఘనతలు చూసి నా బయోపిక్‌ తీద్దామంటే ముందు వద్దన్నాను.. ఆ తర్వాత సరే అన్నాను. అప్పుడు శ్రీపతిని కథ రాయమని వెంకట్‌ ప్రభు చెప్పారు.

► బయోపిక్‌ అంటే ఫిక్షన్‌ జోడిస్తారు కదా..
నో ఫిక్షన్‌. ఈ సినిమాలో క్రికెట్‌ 20 శాతమే ఉంటుంది. మిగతా 80 శాతం నా జీవితం ఉంటుంది. నా జర్నీ, నేను ఇన్ని ఘనతలు సాధించిన క్రమంలో నా కుటుంబం, దేశం ఎదుర్కొన్న పరిస్థితులు ‘800’లో చూపించాం. నా బాల్యం, సెలెక్టర్లు నన్ను ఎందుకు ఎంపిక చేశారు వంటివి ఎవరికీ తెలియవు. ఆ విషయాలు సినిమాలో ఉంటాయి.  

► ‘800’ సినిమా రషెస్‌ చూశారా? మీ పాత్రకు మధుర్‌ మిట్టల్‌ ఎంత వరకు న్యాయం చేశారు?  
 రషెస్‌ కంటే మూవీ చూడాలనుకున్నాను. అందుకే చూడలేదు. నేను పెద్ద సినిమా అభిమానిని. ఇండియన్‌ సినిమాలను మిస్‌ కాను. మధుర్‌ మిట్టల్‌ని రెండుసార్లు కలిశా. ‘800’ టీజర్, ట్రైలర్‌ చూశాను. నాలాగా, లుక్స్‌ పరంగా 70 శాతం మ్యాచ్‌ అయ్యాడు.

► ‘800’ షూటింగ్‌కి వెళ్లలేదా?   
ఒక్కసారి మాత్రమే వెళ్లాను. సినిమా నిర్మాణం గురించి నాకేమీ తెలియదు. అది కష్టమైన కళ. కొన్నిసార్లు నిర్మాతలను చూస్తే బాధగా ఉంటుంది. నటీనటులతో పాటు అందరికీ డబ్బులు ఇస్తారు. ఒకవేళ సినిమా ఆడకపోతే నిర్మాతల డబ్బులే పోతాయి కదా.

► సినిమా హిట్‌ కావచ్చు, ఫ్లాప్‌ అవ్వొచ్చు. అందుకే చాలామంది క్రికెటర్లు తమ బయోపిక్‌ తీయాలని కోరుకోరు..  
సినిమా విజయంలో చాలా అంశాలు ఉంటాయి. సినిమా ఫ్లాప్‌ అయితే నా లెగసీ ఏమీ పడిపోదు. నా లెగసీ క్రికెట్‌. నిజంగా జరిగిన కథను ప్రజలకు చెప్పాలని మేం చేసిన ప్రయత్నం ‘800’. అది కొందరికి నచ్చవచ్చు.. మరికొందరికి నచ్చకపోవచ్చు. ఇదొక మంచి సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.  

► శ్రీలంకలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారా?
ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. శ్రీలంకన్‌ సింహళ భాషలోనూ రిలీజ్‌ చేస్తున్నాం.  

► తెలుగు సినిమాలు చూస్తారా?
శ్రీలంకలో తమిళ, హిందీ చిత్రాలు రిలీజవుతాయి. ఆ భాషల్లో డబ్బింగ్‌ చేసిన తెలుగు సినిమాలు చూస్తా. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప’ సినిమాలను  హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయడంతో చూశా. శ్రీలంకలో బాలీవుడ్‌ మూవీస్‌ ఫేమస్‌. ఇప్పుడు తెలుగు సినిమా టాప్‌ పొజిషన్‌కు చేరుకుంది.  

► మీకు ఇష్టమైన తెలుగు నటుడు ఎవరు?
ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో సూపర్‌ హీరోస్, స్టార్‌ హీరోస్‌ ఎక్కువ మంది ఉన్నారు. నేను నాని సినిమాలు ఎక్కువ చూశా. ‘ఈగ’, ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రాలు బాగున్నాయి.

► మీ బయోపిక్‌ విడుదలవుతోంది. టెన్షన్‌ ఏమైనా?  
ఎందుకు టెన్షన్‌ పడాలి? నేను వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడుతుంటే టెన్షన్‌ పడాలి (నవ్వుతూ).   

► త్వరలో వరల్డ్‌ కప్‌ మొదలవుతోంది. మీ ఫేవరేట్‌ టీమ్‌?
శ్రీలంక మాత్రమే నా ఫేవరెట్‌. అయితే ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement