
మనసు ఉంటే మార్గం ఉండడమే కాదు... ఆ మార్గం దగ్గరికి తీసుకెళ్లడానికి మాంచి బైక్ కూడా ఉంటుంది! ఈ బైక్‌పై ఆ మార్గంలో దూసుకువెళితే ఎన్నో కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఎన్నో విద్యలు, విజయాలు పలకరించి స్వాగతిస్తాయి....
‘జాతిరత్నాలు’ సినిమాతో మనకు సుపరిచితం అయింది ఫరియా అబ్దుల్లా... అదేనండీ చిట్టి!
విశేషం ఏమిటంటే మన చిట్టి ఎన్నో విద్యలలో గట్టి ప్రతిభ ప్రదర్శిస్తోంది. స్కూల్‌రోజుల్లోనే డ్యాన్స్, పెయింటింగ్ నేర్చుకుంది.
హైదరాబాద్, బంజారాహిల్స్‌లో పెరిగిన ఫరియాకు, పదవ తరగతి తరువాత ‘హోమ్ స్కూలింగ్’ పుణ్యమా అని బోలెడు స్వేచ్ఛ లభించింది. ఎందరో గురువుల దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకునే అవకాశం వచ్చింది. పెయింటింగ్ క్లాసుల కోసం కాచిగూడ, లిటరేచర్ క్లాసుల కోసం లింగంపల్లి వెళ్లేది.
ఆ సమయంలోనే నాటకరంగంపై ఆసక్తి కలిగింది.
‘నిషుంబిత’ ‘సమహార’... మొదలైన థియేటర్ గ్రూప్స్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నటించడం మాత్రమే కాదు నాటకం రచించడం, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడం చేసింది.
ఇంట్లో హిందీ, ఉర్దూ మాట్లాడతారు. తాను తెలుగు మాట్లాడుతుంది. ఇంగ్లీష్‌తో కలిపితే ఇప్పటి వరకు తనకు నాలుగు భాషలు వచ్చు.
‘కవిత్వం ఒక తీరనిదాహం’ అంటాడు మహాకవి.
నేర్చుకోవాలనే ‘తపన’ కూడా తీరని దాహం లాంటిదే.
ఆ దాహం ఎన్నో విద్యలను మనకు పరిచయం చేస్తుంది... పదిమంది గొప్పగా మాట్లాడుకునేలా చేస్తుంది అని చెప్పడానికి ఫరియా అబ్దుల్లాలాంటి వారు ఉదాహరణగా నిలుస్తారు. ఇతరులకు స్ఫూర్తి ఇస్తారు. (క్లిక్: ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమైన పూరీ జగన్నాథ్ కూతురు!)