సాక్షి, వెబ్‌డెస్క్: బహుముఖ ప్రజ్ఞాశాలి కత్తి మహశ్ శనివారం కన్నుమూశారు. గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఓ చిన్న పల్లెటూరి నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న కత్తి మహేశ్ జీవిత విశేషాలపై ఓ లుక్..
వ్యక్తిగత జీవితం :
కత్తి మహేశ్‌కుమార్ అలియాస్ కత్తి మహేశ్ ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని పీలేరు పట్టణం దగ్గర ఎల్లమంద అనే గ్రామంలో ఓబులేసు, సరోజమ్మ దంపతులకు 1977లో జన్మించారు. తండ్రి అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్సన్ ఆఫీసరుగా పనిచేసేవారు. మహేశ్‌కు ఓ అన్న, చెల్లి ఉన్నారు. పీలేరు, హర్యానా, అనంతపురంలలో ప్రాథమిక విద్య, మైసూరులో డిగ్రీ.. హైదరాబాద్‌లోని ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. చాటింగ్ ద్వారా పరిచయం అయిన సోనాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికో బాబు ఉన్నాడు.
సినిమా కెరీర్ :
కత్తి మహేశ్‌కు చిన్నప్పటినుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉండేది. మదనపల్లె, తిరుపతిలో ఎక్కువగా సినిమాలు చూస్తుండేవారు. 50 రోజుల వేసవి సెలవుల్లో 50 సినిమాలు చూసేవారంటే సినిమా అంటే ఎంతిష్టమో అర్థం చేసుకోవచ్చు. దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ‘ఊరి చివరి ఇళ్లు’ ఆధారంగా ‘ఎడారి వర్షం’ అనే షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించారు. 2014లో మిణుగురులు సినిమాకు కో రైటర్‌గా పనిచేశారు. అదే సంవత్సరంలో వచ్చిన కామెడీ సినిమా ‘హృదయ కాలేయం’లో పోలీస్ పాత్రను పోషించారు. 2015లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘పెసరట్టు’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్‌గోపాల్ వర్మ ‘‘ స్లోక్యామ్’’ టెక్నాలజీని వాడారు. నేనే రాజు నేను మంత్రి, కొబ్బరి మట్ట, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, క్రాక్ సినిమాల్లో నటించారు. 2017లో బిగ్‌బాస్ సీజన్ వన్‌లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.
సేవా కార్యక్రమాలు :
కత్తి మహేశ్ యూనిసెఫ్, వరల్డ్ బ్యాంక్, సేవ్ ది చిల్డ్రన్, క్లింటన్ ఫౌండేషన్‌లతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కాంట్రవర్సీలపై కత్తి మహేశ్ సమాధానం..
ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంట్రవర్సీలపై స్పందిస్తూ. ‘‘ కాంట్రవర్సీలతో.. కామెంట్లతో ఎంజాయ్ చేసేది ఏమీ ఉండదు. అనవసరపు అటెన్షన్, ఇది మనకు అవసరమా.. మన పనులన్నీ మానుకుని వాటిపై స్పందిస్తూ ఉండటం ఎంత చికాకో అర్థం కావట్లేదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment