92 ఏళ్ల తొలి తెలుగు టాకీ సినిమా.. బడ్జెట్‌ ఎంతో తెలుసా? | First Telugu Talkie Movie Bhaktha Prahladha Completes 92 Years Today | Sakshi
Sakshi News home page

First Telugu Talkie Movie: తొలి తెలుగు సినిమాకు 92 ఏళ్లు.. హీరోయిన్‌గా ఎవరు చేశారంటే?

Published Tue, Feb 6 2024 3:54 PM | Last Updated on Tue, Feb 6 2024 4:07 PM

First Telugu Talkie Movie Bhaktha Prahladha Completes 92 Years Today - Sakshi

ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చరిత్రాత్మక సంఘటన. తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి సరిగ్గా 92 ఏళ్లు పూర్తయ్యాయి. అంతకు ముందు సగం తెలుగు, సగం తమిళంతో 1931 అక్టోబర్‌ 31న తొలి దక్షిణ  భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్‌’ వచ్చింది. ఆ పైన పూర్తిగా తెలుగు మాటలు, పాటలతో ‘భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న విడుదలై సంచలనం సృష్టించింది. అందుకే ఫిబ్రవరి 6న మొదటి పూర్తి తెలుగు టాకీ ఆవిర్భావ సంబురాలు జరుపుకుంటారు.

గతంలో ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదల అయినట్టు ప్రచారం జరిగింది. కాని సీనియర్‌ జర్నలిస్టు డా.రెంటాల జయదేవ ఎన్నో యేళ్లు ఊరూరా తిరిగి, ఎంతో పరిశోధించి, సాక్ష్యాలు సేకరించి, ఈ సినిమా 1932 జనవరి 21న బొంబాయిలో సెన్సారై, ఫిబ్రవరి 6న అక్కడే తొలిసారి విడుదలై నట్లు ఆధారాలతో నిరూపించారు. ఆ విధంగా 1932 ఫిబ్రవరి 6న బొంబాయి శ్రీకృష్ణా సినిమా థియేటర్‌లో విడుదలైన తర్వాత, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు రిలీజై విజయవంతంగా ఆడింది. 1932 ఏప్రిల్‌ 2న మద్రాసులోని ‘నేషనల్‌ పిక్చర్‌ ప్యాలెస్‌’లో విడుదల చేశారు. ఈ చిత్ర దర్శకుడు హెచ్‌ఎమ్‌ రెడ్డి. సురభి కళాకారులు సహా పలువురిని బొంబాయి తీసుకెళ్లి అక్కడ స్టూడియోలో 20 రోజుల్లో షూటింగ్‌ పూర్తిచేశారు. తొలి తమిళ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్‌ఎం రెడ్డి కూడా తెలుగు వారే కావడం విశేషం.

ఆ రోజుల్లో ఈ చిత్ర నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు.. దాదాపు 20 వేల రూపాయలు. ఈ సినిమా సహజంగానే అనేక రికార్డులు నమోదు చేసుకుంది. ఇందులో లీలావతిగా నటించిన సురభి కమలాబాయి తొలి తెలుగు తెర ‘కథానాయిక’ గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్ర నిర్మాణానికి ప్రధాన కారకులు పూర్ణా మంగరాజు. ఆంధ్రాలో తొలి సినీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ‘క్వాలిటీ పిక్చర్స్‌’ వ్యవస్థాపకుడు. ఈ చిత్ర గీత రచయిత ‘చందాల కేశవదాసు’. ఆ విధంగా తొలి పూర్తి తెలుగు సినిమా తయారై సంచలనం సృష్టించింది. 

అయితే దురదృష్టవశాత్తూ ఈ ఫిల్మ్‌ ప్రింట్‌ ఇప్పుడు లభ్యం కావడం లేదు. నిజానికి, టాకీలు రావడానికి చాలాకాలం ముందే మూకీల కాలం నుంచి మన సినీ పితామహులు రఘుపతి వెంకయ్య నాయుడు వంటివారెందరో మన గడ్డపై సినిమా నిలదొక్కు కొని, అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. అప్పట్లోనే  తన కుమారుడు ప్రకాశ్‌ని విదేశాలకు పంపి ప్రత్యేక సాంకేతిక శిక్షణనిప్పించి, సినిమాలు తీసి తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేశారు వెంకయ్య.  

ఇలాంటి వారి గురించి ముందు తరాల వారికి తెలియజేసే కార్యక్రమాలను సినిమా పెద్దలు, ఫిల్మ్‌ ఛాంబర్‌ లాంటి సంస్థలు, పాలకులు నిర్వహించాలి. తెలుగు సినిమా ఆవిర్భావ రోజును ఒక ఉత్సవంగా నిర్వహించి... భావి తరాలకు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే పాత చిత్రాలు అన్నీ సేకరించి ఒక సినీ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఇటువంటిది దేశంలో మహారాష్ట్రలోని పుణేలో మాత్రమే ఉంది. ప్రపంచ ఉత్తమ చిత్రాలు ప్రదర్శిస్తున్న వైజాగ్‌ ఫిలిం సొసైటీ  ‘తెలుగు టాకీ సినిమా ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా ఫిబ్రవరి 6 నుండి 8 వరకు క్లాసిక్‌ చిత్రాలు ప్రదర్శిస్తోంది. అంతే కాకుండా ఉచిత ఫిల్మ్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement