Kapil Dev Sarika Break Up Story In Telugu: సారికతో కపిల్‌దేవ్‌ బ్రేకప్‌ లవ్‌స్టోరీ - Sakshi
Sakshi News home page

Kapil Dev: సినిమా స్టైల్‌లో లవ్‌ ప్రపోజ్‌ చేసిన కపిల్‌

Published Sun, Sep 26 2021 8:02 AM | Last Updated on Sun, Sep 26 2021 11:19 AM

Former Inidan Captain Kapil Dev-Sarika Breakup Love Story - Sakshi

ఇద్దరు సెలబ్రిటీలు కలిస్తే భలే ముచ్చటగా ఉంటుంది.. అందునా భిన్నరంగాలకు చెందిన ఇద్దరు. అలా కలసిన వాళ్లే క్రికెట్‌ స్టార్‌.. హర్యానా హరికేన్‌ కపిల్‌దేవ్‌.., ఫిల్మ్‌స్టార్‌.. బాలీవుడ్‌ బ్యూటీ సారిక. వీళ్లిద్దరూ ములాఖాత్‌ అయ్యేలా చేసింది వెటరన్‌ స్టార్‌ మనోజ్‌ కుమార్‌ భార్య. ఒక పార్టీలో సారికను కపిల్‌దేవ్‌కు పరిచయం చేసింది. అలా మొదలైంది ఆ ఇద్దరి మధ్య స్నేహం. విరామ సమయాల్లో కలుసుకోవడమూ స్టార్ట్‌ చేశారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. బంధంగా ఇమిడేందుకూ సిద్ధపడింది. ఆ టైమ్‌లో వీళ్ల లవ్‌ స్టోరీ హల్‌చల్‌ కూడా చేసింది.

సారిక ముందే రోమీతో ప్రేమాయణం
కపిల్‌దేవ్, సారిక పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలనూ మోసింది మీడియా. నిజమే అన్నట్టుగా సారికను తన ఊరికి తీసుకెళ్లాడు కపిల్‌. తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. ఇంకేం.. ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం అన్నంతగా కుతూహలం రేగింది ఇరువురి అభిమానుల్లో. కానీ.. కపిల్‌ బ్రేక్‌ చేసుకున్నాడు ఆ బంధాన్ని. కారణం.. సారికకు అతనికి స్పర్థలు రావడం కాదు. రోమీతో స్పర్థలు సర్దుకోవడం. అవును..సారిక.. కపిల్‌ జీవితంలోకి రాకముందే రోమీతో అతనికి ప్రేమాయణం ఉంది. రోమీ భాటియాను కపిల్‌కు పరిచయం చేసింది అతని అత్యంత ఆప్తమిత్రుడు సునీల్‌ భాటియా.


సారికకు సారీ చెప్పీ రోమీతో లవ్‌
తొలి చూపులోనే రోమీతో ప్రేమలో పడిపోయాడు కపిల్‌. ఆమె చురుకుదనం అతన్ని కట్టిపడేసింది. ఆ ప్రేమ అలా సాగుతుండగా.. స్పర్థలు వచ్చాయి. దానికి కారణం.. సారికతో పరిచయం సన్నిహితంగా మెలిగేంత స్నేహంగా మారడమే అంటుంది హిందుస్థాన్‌ టైమ్స్‌లో వచ్చిన ఓ కథనం. అందువల్లే రోమీ మనసు నొచ్చుకొని సైలెంట్‌గా ..కపిల్‌కు దూరంగా ఉండిపోయిందనీ అంటారు కపిల్, రోమీ దోస్తులు కూడా. కాదు.. కపిల్‌ ప్రపోజ్‌ చేస్తే ఏమీ చెప్పకుండా మిన్నకుండిపోయింది.

ఆ మౌనాన్ని కపిల్‌ అపార్థం చేసుకుని సారికకు దగ్గరయ్యాడనీ చెప్తారు కపిల్‌ మిత్రులు. సారికతో కపిల్‌ పెళ్లి అనే వార్తలు వినే రోమీ మళ్లీ కపిల్‌ను చేరుకుందనీ అంటారు. రోమీని మరచిపోలేని కపిల్‌ అందుకే వెంటనే సారికకు సారీ చెప్పేసి రోమీ చేయి అందుకున్నాడు.. అని వివరణ ఇస్తారు. 

కమల్‌ హాసన్‌తో ప్రేమలో పడ్డ సారిక
ఏమైనా ఈ మొత్తం వ్యవహారం సారికను షాక్‌కి గురిచేసింది. జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. కమల్‌ హాసన్‌ స్నేహంతో త్వరగానే అందులోంచి బయటపడింది. అదే సమయంలో కమల్‌తో ప్రేమలోనూ పడింది సారిక. మళ్లీ రోమీ, కపిల్‌ ప్రేమ కథకు వస్తే.. పెళ్లి ప్రపోజల్‌ను ఈసారి కొంచెం సినిమా స్టయిల్‌లో రోమీ ముందు ఉంచాడట కపిల్‌. ఎలాగంటే.. ఒకసారి ఇద్దరూ కలసి రైల్లో ప్రయాణిస్తున్నారు (బహుశా ముంబై నుంచి కావచ్చు).

సినిమా స్టైల్‌లో లవ్‌ ప్రపోజ్‌ చేసిన కపిల్‌దేవ్‌
రైలు ఒక అందమైన ప్రదేశానికి రాగానే.. కపిల్‌ వెంటనే సీట్లోంచి లేచి.. రోమీ ముందు మోకాళ్ల మీద వంగి.. కిటికీలోంచి ఆ ప్రదేశాన్ని చూపిస్తూ ‘ఈ బ్యూటిఫుల్‌ ప్లేస్‌ను ఫొటో తీయగలవా డియర్‌.. భవిష్యత్‌లో మన పిల్లలకు ఈ ఫొటోస్‌ చూపిస్తూ మన ఈ ప్రయాణాన్ని అందమైన జ్ఞాపకంగా వాళ్లతో పంచుకోవచ్చు!’ అంటూ!  ఆ మాట విన్న రోమీ సిగ్గు పడిపోయిందట..

పెళ్లికి ఓకే చెప్పేసిందట. అలా కపిల్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్త రోమీ భాటియాను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. పెళ్లి కాకముందు తండ్రి వ్యాపారాలు చూసుకున్న రోమీ పెళ్లయ్యాక కపిల్‌దేవ్‌కున్న హోటల్‌ వ్యాపారాలనూ సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. మొత్తం ఇండియన్‌ సెలబ్రిటీస్‌లోనే అన్యోన్యమైన జంటగా పేరు కపిల్, రోమీ దంపతులకు. 

- ఎస్సార్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement