‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ | Sakshi
Sakshi News home page

Gam Gam Ganesha Review: ‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ

Published Fri, May 31 2024 4:43 PM

Gam Gam Ganesha Movie Review And Rating In Telugu

టైటిల్‌: గం..గం..గణేశా 
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.
నిర్మాణ సంస్థ:హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు:కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
రచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి 
సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
విడుదల తేది: మే 31, 2024

‘బేబీ’లాంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ మూవీపై హైప్‌ని క్రియేట్‌ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా భారీగా చేయడంతో ‘గం..గం..గణేశా’పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాలతో నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ కామెడీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
హైదరాబాద్‌కు గణేష్‌(ఆనంద్‌ దేవరకొండ) ఓ అనాథ. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయేల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటాడు. అదే ఏరియాలో ఓ షాపులో పని చేసే శృతి(నయన్‌ సారిక)తో పీకల్లోతూ ప్రేమలో ఉంటాడు. అయితే శ్రుతి మాత్రం డబ్బుకు ఆశపడి ఆ షాపు ఓనర్‌ కొడుకుతో పెళ్లికి రెడీ అయిపోతుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో హర్ట్‌ అయిన గణేష్‌..ఎలాగైన భారీగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో స్నేహితుడు శంకర్‌తో కలిసి రూ. 7 కోట్లు విలువ చేసే డైమండ్‌ను దొంగిలిస్తాడు. ఆ డైమండ్‌ కోసం అరుణ్‌ (ప్రిన్స్‌ యావర్‌) గ్యాంగ్‌ గణేష్‌ వెంటపడుతుంది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ డైమంగ్‌ ఓ గణేశ్‌ విగ్రహంలోకి చేరుతుంది. ఆ విగ్రహం కర్నూలు జిల్లాకు చెందిన రాజావారు(సత్యం రాజేశ్‌)కొనుగోలు చేసి తన గ్రామానికి తీసుకెళ్తాడు.

 ఆ తర్వాత ఏం జరిగింది? వినాయకుడి విగ్రహంలో పడిపోయిన డైమండ్‌ కోసం గణేష్‌ ఏం చేశాడు? ఆ విగ్రహాన్ని దొంగిలించేందుకు రుద్రా(కృష్ణ చైతన్య) గ్యాంగ్‌ ఎందుకు ప్రయత్నించింది? ముంబైలో చాలా విగ్రహాలు ఉన్నప్పటికీ.. రాజావారు ప్రత్యేకంగా ఆ విగ్రహాన్నే ఎందుకు కొనుగోలు చేశాడు? ఈ విగ్రహానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకుంటున్న కిషోర్‌ రెడ్డి(రాజ్‌ అర్జున్‌)కి ఉన్న సంబంధం ఏంటి? ఆర్గాన్‌ డేవిడ్‌(వెన్నెల కిశోర్‌) కారణంగా రుద్రా గ్యాంగ్‌తో పాటు గణేష్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆ విగ్రహం ఎవరికి దక్కింది? అందులో పడిపోయిన డైమాండ్‌ చివరకు ఎవరికి దక్కింది? గణేష్‌ లైఫ్‌లోకి కృష్ణవేణి(ప్రగతి శ్రీవాస్తవ)ఎలా వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.
ప్రతి మనిషిలోనూ  భయం, అత్యాశ, కుట్ర అనే మూడు లక్షణాలు ఉంటాయి. ఇవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ‘గం..గం..గణేశా’ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇలాంటి క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. కానీ డిఫరెంట్‌ కామెడీతో పాటు క్రిస్పీ ఎడిటింగ్‌తో హిలేరిస్‌గా కథనాన్ని సాగించాడు. కథ మొత్తం వినాయకుడి విగ్రహం చుట్టే తిరుగుతుంది. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ సింపుల్‌గానే ఉన్నా ఎంటర్‌టైన్‌ చేస్తాయి.

హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా కథ ఆ తర్వాత కర్నూల్ కు షిప్ట్ అవుతుంది. సినిమా ప్రారంభంలో వచ్చే హీరో లవ్‌ ట్రాక్‌ అంతగా ఆకట్టుకోదు. డైమాండ్‌ దొంగిలించాలని హీరో ఫిక్సయ్యాక..కథలో వేగం పుంజుకుంటుంది. ఒకవైపు కిశోర్‌ రెడ్డి ట్రాక్‌.. మరోవైపు గణేష్‌ ట్రాక్‌ రెండింటిని సమాంతరంగా నడిపిస్తూ ఎక్కడా బోర్‌ కొట్టకుండా కథనాన్ని సాగించాడు.  

డైమండ్‌ వినాయకుడి విగ్రహంలోకి చేరడం..దాన్ని కిశోర్‌ రాజకీయ ప్రత్యర్థి గ్రామమైన రాజావారి పల్లెకు తీసుకెళ్లడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథంతా విగ్రహం చుట్టే తిరగడంతో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే విగ్రహం కొట్టేసేందుకు రుద్రా గ్యాంగ్‌, డైమండ్‌ను తీసుకెళ్లడం కోసం హీరో చేసే ప్రయత్నాలు అంతగా ఎంటర్‌టైన్‌ చేయవు. 

మతిభ్రమించిన డాక్టర్‌ ఆర్గాన్‌ డైమండ్‌గా వెన్నెల కిశోర్‌ పండించే కామెడీ మాత్రం సినిమాకు ప్లస్‌ అయింది. అతను తెరపై కనిపించిన ప్రతి సారి థియేటర్లలో నవ్వులు పూశాయి. అదేసమయంలో అరుణ్‌ గ్యాంగ్‌కు సంబంధించిన సన్నివేశాలు.. నీలవేణితో గణేష్‌ నడిపే లవ్‌ట్రాక్‌ కథకు అనవసరంగా జోడించినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో స్వామిజీ(రంజగన్‌)ఇచ్చే ట్విస్ట్‌ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. సినిమా ముగింపు మాత్రం దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులను నెగెటివ్‌ క్లైమాక్స్‌ని ఒప్పుకోరని అలా ముగించాడేమో. చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే.. ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేని ఈ ‍క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు.  

ఎవరెలా చేశారంటే.. 
ఆనంద్ దేవరకొండ ఇప్పటిదాకా బాయ్ నెక్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. ఈ చిత్రంలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. గ్రే షేడ్స్ ఉన్న గణేష్‌ పాత్రలో ఆనంద్‌ ఒదిగిపోయాడు. డ్యాన్స్‌తో పాటు కామెడీ కూడా బాగా పండించాడు. తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఇక జబర్థస్త్‌ ఫేం ఇమ్మాన్యుయేల్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. హీరో స్నేహితుడు శంకర్‌గా ఆయన చక్కగా నటించాడు. తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు.  ఇక హీరోయిన్లుగా నటించిన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక ఇద్దరు తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా..ఉన్నంతలో చక్కగా నటించారు. మతిభ్రమించిన డాక్టర్‌ ఆర్గాన్‌ డేవిడ్‌గా వెన్నెల కిశోర్‌ పండించిన కామెడీ సినిమాకు ప్లస్‌ అయింది. ఆ పాత్రకు మరిన్ని సన్నివేశాలు ఉంటే బాగుండేది. కిశోర్‌ రెడ్డిగా రాజ్‌ అర్జున్‌, రుద్రాగా కృష్ణ చైతన్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. చేతన్‌ భరద్వాజ్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్‌ సినిమాకు ప్లస్‌ అయింది. సన్నివేశాలను చాలా క్రిస్పిగా కట్‌ చేశాడు.  స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌

Rating:
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement