‘‘నిజాయతీగా పని చేసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లాంటి మంచి సినిమా తీశాం. అందుకే ఈ మూవీపై చాలా నమ్మకంగా ఉన్నాం. అందరూ కుటుంబంతో కలిసి రావొచ్చు. సినిమా చూశాక రెండు మూడు రోజుల పాటు ప్రేక్షకుల మనసుల్లోనే ఉంటుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఐదేళ్ల క్రితం మార్చి 31వ తేదీనే నా ‘ఫలక్‌నుమా దాస్’ రిలీజ్ అయ్యింది. నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆ సినిమా.. ఆదరించిన ప్రేక్షకులే. నా కెరీర్ ఆరంభంలో ‘ఇలాంటి యాటిట్యూడ్ ఇండస్ట్రీలో పనికి రాదు.. తొక్కేస్తారు.. పంపించేస్తారు’ అన్నారు. అయినా నా క్యారెక్టర్ మార్చుకోలేదు. ఐదేళ్లుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ఇండస్ట్రీకి, దర్శక–నిర్మాతలకు, ముఖ్యంగా నా ఫ్యాన్స్‌కి థ్యాంక్స్. ఇప్పటికే ఐదేళ్లు గడిచిపోయాయి.
మరో ఐదేళ్లు ఫైనల్.. కాల్చిపడేస్తా మొత్తం. రత్నలాంటి పాత్ర చేయాలన్నది నా కల. అలాంటి కథతో వచ్చిన కృష్ణ చైతన్యకి థ్యాంక్స్. నేను ఇప్పటి వరకూ పనిచేసిన నిర్మాతల్లో నాగవంశీ బెస్ట్’’ అన్నారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ– ‘‘మా అమ్మానాన్నల ఆశీస్సుల వల్లే ఇక్కడ ఉన్నాను. మా గురువు త్రివిక్రమ్‌గారే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి మూలం. ఆయన వల్లే ఈ సినిమా మొదలైంది. నన్ను నమ్మి ఈ సినిమా తీసిన నిర్మాతలు చినబాబు, నాగవంశీ, సాయి సౌజన్యగార్లకు కృతజ్ఞతలు. బుజ్జిగా నేహాశెట్టి, రత్నమాలగా అంజలి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.
విశ్వక్ సేన్ అద్భుతంగా నటించాడు. తను చేసిన రత్న పాత్ర ప్రేక్షకుల్ని నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. భయపెడుతుంది’’ అన్నారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 31 తర్వాత విశ్వక్ సేన్ గురించి మాట్లాడుకుంటే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి ముందు, తర్వాత అని మాట్లాడు కుంటారు. నట విశ్వరూపం చూపించాడు. సినిమా చూశాక నిజంగా కృష్ణ చైతన్య తీశాడా? అనిపించింది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఇంటెన్స్ మూవీ రాలేదు’’ అన్నారు. నటి నేహా శెట్టి, నటులు మధునందన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment