టైటిల్ : ది ఘోస్ట్
నటీ నటులు : నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనికా సురేంద్రన్ తదితరులు
బ్యానర్ : శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్
నిర్మాత : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
సంగీతం : మార్క్ కే రాబిన్
సినిమాటోగ్రఫర్ : ముఖేష్
విడుదల తేది : అక్టోబర్ 5, 2022
టాలీవుడ్ కింగ్ నాగార్జున, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. ఈ మూవీ దసరా కానుకగా.. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలే టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయి? ఆడియెన్స్‌ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
ది ఘోస్ట్ కథ ఏంటంటే..
విక్రమ్ (నాగార్జున) ఓ అనాథ. కల్నల్ నాగేంద్ర నాయుడు విక్రమ్‌ను చేరదీస్తాడు. నాగేంద్ర నాయుడు కూతురు అనుపమ (గుల్ పనాగ్), విక్రమ్ అక్కాతమ్ముడిలా కలిసి మెలిసి ఉంటారు. అయితే అనుపమ మాత్రం తనకు నచ్చిన వాడైన అశోక్ నాయర్‌ను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. 20 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉంటుంది. అనుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను విక్రమ్‌కి అప్పగించి కన్నుమూస్తాడు నాగేంద్ర నాయుడు. 20 ఏళ్ల పాటుగా దూరంగా ఉన్న అనుపమ తన బిడ్డ అదితి (అనికా సురేంద్రన్) ఆపదలో ఉందని విక్రమ్‌కు కాల్ చేస్తుంది. తన సమస్యను వివరిస్తుంది.
అసలు అనుపమకు వచ్చిన సమస్య ఏంటి? అదితిని చంపేందుకు ప్రయత్నం చేసిన వారు ఎవరు? విక్రమ్ ది ఘోస్ట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు ఘోస్ట్ వెనుకున ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో ప్రియ(సోనాల్ చౌహాన్) పాత్ర ఏంటి? చివరకు అదితిని విక్రమ్ కాపాడాడా? అన్నదే కథ.
ఎవరెలా నటించారంటే..
నాగార్జున ఇప్పటి వరకు అన్ని రకాల పాత్రలను పోషించారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని రకాల కారెక్టర్లలో కనిపించారు. ఇక ఘోస్ట్‌లో అయితే మరింత స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ కొత్తగా కనిపించాడు. విక్రమ్, ఘోస్ట్ ఇలా రెండు రకాలుగా మెప్పించేశారు. సోనాల్ చౌహాన్ చేసిన స్టంట్స్ అదిరిపోయాయి. అయితే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. అనుపమ పాత్ర, అదితి పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ లభించింది. శ్రీకాంత్ అయ్యర్, రవి వర్మ వంటి వారు తమ స్టైల్లో నటించేశారు.
ఎలా ఉందంటే..
కిడ్నాపింగ్స్, ఎక్స్‌టార్షన్స్, బ్లాక్ మెయిల్స్ నేపథ్యంలో ఈ కథను రాసుకున్నాడు ప్రవీణ్ సత్తారు. ఇక ఇందులో ఫ్యామిలీ డ్రామాను ఇరికించడంతో కొత్తదనం వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్ చూపించాడు దర్శకుడు. ప్రవీణ్ సత్తారు సినిమాల్లో మేకింగ్ బాగుంటుందని అందరికీ తెలిసిందే. ది ఘోస్ట్ చిత్రంలోనూ ప్రవీణ్ సత్తారు మార్క్ కనిపించింది. కథనం ఎక్కడా కూడా స్లోగా అనిపించదు.
అసలు కథ ప్రారంభించేందుకు కొద్దిగా సమయాన్ని తీసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ కథ ట్రాక్ ఎక్కిన తరువాత.. పరుగులు పెడుతుంది. విక్రమ్.. ఘోస్ట్ అని రివీల్ చేసే సీన్, ఇంటర్వెల్ అదిరిపోతుంది. అయితే సెకండాఫ్‌లో ఘోస్ట్ ఫ్లాష్ బ్యాక్‌ను మాత్రం అంత ఎఫెక్టివ్‌గా చూపించినట్టు అనిపించదు. ద్వితీయార్థం మాత్రం కాస్త గాడితప్పినట్టు కనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. ప్రథమార్థంలో ఉన్న ఇంట్రెస్ట్ సెకండాఫ్‌కు వచ్చే సరికి ఉండదనిపిస్తుంది. ఇక సాంకేతిక చూస్తే.. మార్క్ కే రాబిన్ ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు, మాటలు అంతగా గుర్తుండవు. ముఖేష్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment