టైటిల్: నా సామిరంగ
నటీనటులు: నాగార్జున అక్కినేని,అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, నాజర్, రావు రమేష్ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
దర్శకత్వం: విజయ్ బిన్ని
కథ: ప్రసన్నకుమార్ బెజవాడ
సంగీతం: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరధి
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
విడుదల తేది: జనవరి 14, 2024
‘నా సామిరంగ’ కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1963-88 మధ్య కాలంలో జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని అంబాజీపేట గ్రామానికి చెందిన కిష్టయ్య(నాగార్జున), అంజి(అల్లరి నరేష్) ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. అంజి వాళ్ల అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో.. కిష్టయ్యనే అన్ని తానై పెంచుతాడు. ఒక్కసారి సహాయం చేశాడని ఆ ఊరి పెద్దాయన(నాజర్)దగ్గరే పనిచేస్తుంటాడు. వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు(రావు రమేష్) కూతురు వరాలు(ఆషికా రంగనాథ్) అంటే కిష్టయ్యకు చిన్నప్పటి నుంచి ఇష్టం. వరాలుకు కూడా కిష్టయ్య అంటే ఇష్టమే కానీ.. పదేళ్ల కిందట(1978) జరిగిన ఓ ఘటన కారణంగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది.
ఈ మధ్యలో అంజికి అదే గ్రామానికి చెందిన అనాథ అమ్మాయి(మిర్నా మీనన్)తో పెళ్లి జరిగి, పాప కూడా పుడుతుంది. ఇదిలా ఉంటే అంబాజీపేటకు చెందిన భాస్కర్(రాజ్ తరుణ్)..పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురు(రుక్సార్)తో ప్రేమలో పడతాడు. పండగవేళ గోడ దూకి ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి వెళ్లి దొరికిపోతాడు. ప్రెసిడెంట్ మనుషులు భాస్కర్‌ని చంపేందుకు ప్రయత్నించగా.. కిష్టయ్య కాపాడుతాడు. అంతేకాదు పెద్దాయన ఆజ్ఞ మేరకు పండగ జరిగేవరకు భాస్కర్‌కు ఎలాంటి హనీ కలగకుండా చూసుకుంటాడు. కట్ చేస్తే..దుబాయ్ నుంచి తిరిగొచ్చిన పెద్దాయన చిన్న కుమారుడు దాసు(డాన్సింగ్ రోజ్) కిష్టయ్య, అంజిని చంపేందుకు కుట్రలు పన్నుతాడు. దాసుతో పక్క ఊరి ప్రెసిడెంట్ కూడా చేతులు కలుపుతాడు.అసలు దాసు అంజి, కిష్టయ్యను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? పదేళ్లుగా వరాలు ఎందుకు ఒంటరిగా ఉంటుంది? పదేళ్ల క్రితం ఏం జరిగింది? పెద్దాయనకి ఇచ్చిన మాట ప్రకారం పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురితో భాస్కర్ పెళ్లిని కిష్టయ్య జరిపించాడా లేదా? చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న కిష్టయ్య కోసం అంజి చేసిన త్యాగమేంటి? అన్నం పెట్టి చేరదీసిన పెద్దాయన కొడుకునే కిష్టయ్య ఎందుకు చంపాల్సి వచ్చింది? వరాలు, కిష్టయ్యల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
కొన్ని సినిమాల కథ పాతదైన.. తెరపై చూస్తే బోర్ కొట్టదు. తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా.. అది తెరపై కనిస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటి సినిమానే నా సామిరంగ. కథలో ఎలాంటి కొత్తదనం లేకున్నా.. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని కమర్శియల్ అంశాలను జోడించి సంక్రాంతి పండక్కి కావాల్సిన సినిమాగా తీర్చిదిద్డాడు దర్శకుడు విజయ్ బిన్నీ.
(చదవండి: ‘సైంధవ్’మూవీ రివ్యూ)
వాస్తవానికి ఇది పొరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్. ఆ సినిమా చూసిన వారికి తప్పా.. మిగతావారందరికి ఇది అచ్చమైన తెలుగు సినిమానే అనిపిస్తుంది. ఎక్కడ పాట పెడితే ఊపొస్తుంది.. ఎక్కడ యాక్షన్ సీన్ పెడితే విజిల్స్ పడతాయి.. ఎలాంటి కామెడీ సీన్స్ పెడితే నవ్వులు పూస్తాయి? ఇలాంటి కమర్షియల్ కొలతలు అన్ని వేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అలా ఒది గొప్ప కథ.. అద్భుతంగా తీర్చి దిద్దారని చెప్పలేం కానీ.. సంక్రాంతి పండక్కి కావాల్సిన సినిమా అని చెప్పొచు.
కిష్టయ్య, అంజిల బాల్యం సన్నివేశాలతో చాలా ఎమోషనల్‌గా సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ వెంటనే పాతికేళ్ల ముందు అంటే 1963 నుంచి 1988కి వెళ్తుంది. భారీ ఫైట్ సీన్‌తో నాగార్జున ఎంట్రీ.. తర్వాత భాస్కర్ (రాజ్ తరుణ్) లవ్‌స్టోరీతో సినిమా ఓ మాదిరిగా సాగుతుంది. ఇక కిష్టయ్య, వరాలు లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక.. ప్రేక్షకుడు కథలో లీనమై పోతాడు. వరాలు, కిష్టయ్య మధ్య జరిగే సంభాషణలు , ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. సంక్రాంతి పండక్కి ముడిపెడుతూ.. కథనాన్ని నడిపించారు. ఒక ఎమోషనల్ పాయింట్‌తో ఇంటర్వెల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
(చదవండి: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ)
ఇక సెకండాఫ్‌లో కథనం రొటీన్‌గా సాగుతుంది. కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. వరాలు, అంజి పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక క్లైమాక్స్ ఊహకందేలా, సింపుల్‌గా ఉంటుంది. రెగ్యులర్ రొటీన్ సినిమానే అయినా.. సంకాంత్రి వేళ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే..
కిష్టయ్య పాత్రలో నాగార్జున కుమ్మేశాడు. రొటీన్ కథే అయినా.. నాగార్జున ఎనర్జీటిక్ యాక్టింగ్‌తో బోర్ కొట్టకుండా కథనం సాగుతుంది. యాక్షన్ తో ఎమోషనల్ సన్నివేశాలలోనూ చక్కగా నటించాడు. ఇక నాగార్జున తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర నరేశ్‌ది. అంజి పాత్రలో నరేశ్ పరకాయ ప్రవేశం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ.. మరికొన్ని చోట్ల ఏడిపించాడు. తెరపై నాగార్జున, నరేశ్‌ల బ్రో కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకు ప్లస్ అయింది. వరాలు పాత్రలో ఆమె ఒదిగిపోయింది. భాస్కర్‌గా రాజ్‌తరుణ్ ఉన్నంతలో చక్కగా నటించాడు. నాజర్, మిర్నా, రుక్సర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
(చదవండి: హను-మాన్ రివ్యూ)
సాంకేతిక విషయాలకొస్తే.. కీరవాణి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలు ప్రాణం పోశాడు. పాటలు కూడా కథలో భాగంగానే వస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment