‘‘నా సామిరంగ’ సినిమా కథలోని ప్రేమ, స్నేహం, త్యాగం, ద్వేషం వంటి నాలుగు అంశాలు నాకు బాగా నచ్చాయి. కథలో ఇవే మూల స్తంభాలు. భోగి, మకర సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజుల సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు హీరో నాగార్జున. ఆయన హీరోగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘నా సామిరంగ’.
విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రధారులు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా రేపు (ఆదివారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు.
► ‘నా సామిరంగ’ సినిమా షూటింగ్ 72 రోజులు జరిగితే నా భాగం 60 రోజుల్లో పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ పనులకు 5 నెలలు పట్టింది. సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకుంటే తప్పులు ఎక్కువ అవుతాయి. ప్రీప్రోడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటే ఎవరికైనా ఇంత వేగంగా పూర్తి చేయడం సాధ్యపడుతుంది. పైగా కీరవాణిగారు షూటింగ్‌కి ముందే మూడు పాటలు, ఫైట్ సీక్వెన్స్‌కి నేపథ్య సంగీతం చేశారు. ఇంత వేగంగా, భారీ బడ్జెట్‌లో సినిమా చేశామంటే దానికి కీరవాణిగారు ఒక కారణం. ఇందులోని ఏడు పాటలూ అద్భుతంగా ఉంటాయి.
► మనకి సంక్రాంతి పెద్ద పండగ. పైగా ఇది 1980 నేపథ్యంలో జరిగే కథ. తెలుగు తెరపై తొలిసారి సంక్రాంతి ప్రభల తీర్థం నేపథ్యాన్ని తీసుకొస్తున్నాం. ఇది పేరుకే మలయాళ రీమేక్. తెలుగు ప్రేక్షకులకు తగినట్లు కథలో మార్పులు, చేర్పులు చేశారు. ఈ క్రెడిట్ దర్శకుడు విజయ్ బిన్నీకి, రచయిత ప్రసన్నకుమార్ బెజవాడకి దక్కుతుంది. విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేసిన పాటలు చూశాను. పాటలోనే కథని చెప్పే నేర్పు తనలో ఉంది. స్పష్టత ఉన్న దర్శకుడు.. చెప్పింది చెప్పినట్టు తీశాడు.
► ఈ సినిమాలో నా ఊతపదం నా సామిరంగ. సినిమా మొత్తం 2 గంటల 35 నిమిషాలు వచ్చింది. అందులో 15 నిమిషాలు కట్ చేయడానికి కష్టపడ్డాం.. ఎందుకంటే ప్రతి సీన్ ముఖ్యమైనదిగానే కనిపించింది. నా ప్రతి సినిమానీ ఎడిటింగ్ జరిగాక చూస్తా. అవసరం అనుకుంటే సలహా ఇస్తాను.. కావాలని మార్పులు చెప్పను. అలా చెబితే వాళ్ల క్రియేటివిటీని తక్కువ చేసినట్లవుతుంది. కథకు అవసరం కాబట్టి ఈ మూవీలో చాలా రోజుల తర్వాత మాస్ లుక్‌లో కనిపించాను.
► ఈ చిత్రంలో కిష్టయ్య పాత్రలో కనిపిస్తాను. సినిమాలో నాకు, ఆషికాకి మధ్య 12 ఏళ్ల నుంచి ఒక ప్రేమకథ నడుస్తుంది. చాలా వైవిధ్యమైన ప్రేమకథ ఇది. ఈ మూవీలో సోదర భావం ఉన్న పాత్రకు ‘అల్లరి’ నరేశ్ సరిపోతాడనిపించి తీసుకున్నాం. రాజ్ తరుణ్‌ది కీలకమైన పాత్రే. అలాగే మిర్నా, రుక్సార్‌ల పాత్రలూ బాగుంటాయి.
► సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండటంతో మేం అనుకున్నన్ని థియేటర్లు దొరకలేదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ అప్పుడూ ఇదే సమస్య. ఆ సినిమాను 300 థియేటర్లలో విడుదల చేశాం. ఇప్పుడు ‘నా సామిరంగ’ కూడా 300 థియేటర్లలో విడుదలవుతోంది.
► నా నూరవ సినిమా స్టార్ హీరోతో కలిసి మల్టీస్టారర్‌గా చేయాలనే ఆలోచన లేదు. కెరీర్‌లోని మైలురాయి సినిమాలు స్టార్ హీరోలతో కలిసి చేయాలనుకుని ఉంటే నా నుంచి ‘శివ, అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా’ వంటి సినిమాలు వచ్చేవి కావు. వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయి. రొటీన్‌గా ఉండటంతో చేయడం లేదు. నాగచైతన్యకి వచ్చిన ‘దూత’ లాంటి కథ కుదిరితే చేస్తాను.
నేను, నాగచైతన్య, అఖిల్ కలిసి మల్టీస్టారర్ చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. నేను, మహేశ్‌బాబు కలసి నటించి, నాగేశ్వరరావు–కృష్ణగార్ల వారసత్వాన్ని కొనసాగించాలని గతంలో ట్వీట్ చేశాను. రాజమౌళిగారి సినిమాని మహేశ్ పూర్తి చేశాక దాని గురించి ఆలోచించాలి (నవ్వుతూ) ∙నా తర్వాతి సినిమా శేఖర్ కమ్ములగారి దర్శకత్వంలో ఉంటుంది. తమిళ డైరెక్టర్ నవీన్‌తో ఓ సినిమా ఉంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక ‘బ్రహ్మస్త్ర 2’ మొదలు పెట్టే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment