కిష్టయ్య వస్తున్నాడు... బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు: నాగార్జున | Sakshi
Sakshi News home page

Naa Saami Ranga: కిష్టయ్య వస్తున్నాడు... బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు: నాగార్జున

Published Thu, Jan 11 2024 10:03 AM

Nagarjuna Akkineni Talk About Naa Saami Ranga Movie At Pre Release Event - Sakshi

‘‘టీవీలు రాగానే సినిమాలు చూడరు అన్నారు. ఫోన్‌ వచ్చినప్పుడు, సీడీ–డీవీడీలు వచ్చినప్పుడు సినిమాలు చూడరు అన్నారు.. చూస్తూనే ఉన్నారు ఆడియన్స్‌. ఈ మధ్య ఓటీటీ వచ్చింది. అయినా సినిమాలు చూస్తూనే ఉన్నారు. కోవిడ్‌ తర్వాత కూడా సినిమాలు చూస్తున్నారు. పండగ రోజున సినిమాలు చూడటం అనేది మన ఆనవాయితీ. ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు సినిమాలు వచ్చినా ప్రేక్షకులు చూస్తారు. మన తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండగ’’ అని నాగార్జున అన్నారు.

నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ‘అల్లరి’ నరేశ్, రాజ్‌ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్‌ , రుక్సార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’, ‘హను–మాన్‌ ’గా వస్తున్న తేజకు, 75వ సినిమాతో ‘సైంధవ్‌’గా వస్తున్న మా వెంకీకి ఆల్‌ ది బెస్ట్‌. మేం ‘నా సామిరంగ’తో వస్తున్నాం. మేం ఇచ్చే సినిమా మీకు నచ్చితే ఎలా ఆదరిస్తారో సంక్రాంతి పండగలకు నేను చూశాను. మీకు సినిమా నచ్చుతుందని, ఈ సంక్రాంతి పండక్కి కూడా అలానే ఆదరిస్తారని.. నా సామిరంగ. మా సినిమాకి కీరవాణిగారు బ్లాక్‌బస్టర్‌ పాటలు ఇచ్చారు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేయడానికి కారణం కీరవాణిగారు. సినిమా స్టార్ట్‌ అవ్వకముందే మూడు పాటలు, ఓ ఫైట్‌కు ఆర్‌ఆర్‌ చేసి పెట్టారు.

విజయ్‌ బిన్నీని కీరవాణి, చంద్రబోస్‌గార్లు బాగా ప్రోత్సహించారు. మూడు నెలల్లోనే మేం సినిమా తీశాం. సెప్టెంబరు 20 నాన్నగారి నూరవ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ (గత ఏడాది) జరిగింది. ఆ సందర్భంగా  దండం పెడుతుంటే ‘వెళ్లి సినిమా చేయరా.. నా సామిరంగ’ అని చెప్పినట్లుగా అనిపించింది. ఆయన చెప్పిన ధైర్యంతోనే సినిమాను పూర్తి చేశాం. ఈసారి సంక్రాంతికి కిష్టయ్య (నాగార్జున పాత్ర పేరు) వస్తున్నాడు... బాక్సాఫీస్‌ కొడుతున్నాడు. కీరవాణి, చంద్రబోస్‌గార్లు తెలుగు ఇండస్ట్రీని ఆస్కార్‌ వేదికపై నిలబెట్టారు’’ అని అన్నారు.

‘‘నాగార్జునగారితో స్క్రీన్‌  షేర్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్‌. ‘‘నా తొలి సినిమా ‘ఉయ్యాలా.. జంపాల’ అన్నపూర్ణ స్టూడియోలో చేశాను. ‘రంగులరాట్నం’, ‘అనుభవించు రాజా’ సినిమాలు చేశాను. ఇప్పుడు నాగార్జునగారితో ‘నా సామిరంగ’ సినిమా చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు రాజ్‌ తరుణ్‌. ‘‘నా లైఫ్‌కి ఇంపార్టెంట్‌ పర్సన్‌  నాగార్జునగారు. దర్శకుల గత సినిమాల ఫలితాలు చూసి అవకాశాలు ఇచ్చే ఇండస్ట్రీ ఇది. అలాంటిది ఓ కొరియోగ్రాఫర్‌ను అయిన నన్ను నమ్మి, నాకు ఇంత పెద్ద సినిమా చేసేందుకు అవకాశం వచ్చిన రియల్‌ హీరో నాగార్జునగారు’’ అన్నారు విజయ్‌ బిన్నీ.

‘‘కొత్త దర్శకులు, కొత్త సాంకేతిక నిపుణులను గుర్తించి, వారిని ప్రోత్సహించడంలో నాగార్జునగారు ముందుంటారు’’ అన్నారు కీరవాణి. ‘‘మా అన్నయ్య కీరవాణిగారి స్వరకల్పనలో ఈ సినిమా కోసం మంచిగా నాలుగు పాటలు రాశాను’’ అన్నారు చంద్ర బోస్‌.  

Advertisement

తప్పక చదవండి

Advertisement