టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్ రావు, శరత్ మారర్ నిర్మించారు. నటి సోనాల్ చౌహాన్ కథానాయకిగా నటించిన ఇందులో శ్రీకాంత్ అయ్యర్, మనీశ్ చౌదరి, విక్రమాదిత్య, రవివర్మ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విజయదశమి సందర్భంగా బుధవారం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్రం యూనిట్ చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న నటుడు నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రం గురించి మాట్లాడే ముందు పొన్నియిన్ సెల్వన్ చిత్ర దర్శకుడు, తన మంచి మిత్రుడు మణిరత్నం అద్భుతమైన చిత్రా న్ని తెరకెక్కించినందుకు గానూ కంగ్రాట్స్ చెబుతున్నానన్నారు. మణిరత్నం దర్శకత్వంలో తాను ఇంతకు ముందు ఇదయతై తిరుడాదే (తెలుగులో గీతాంజలి) చిత్రం చేశానని గుర్తు చేశారు. ఆయన చాలా గొప్ప దర్శకుడని ప్రశంసించారు. అదేవిధంగా తాను నటించిన ఉదయం, రక్షన్, పయనం, ఇటీవల కార్తీతో కలిసి నటించిన తోళా చిత్రాలను ఇక్కడి ప్రేక్షకులు ఆదరించారన్నారు.
ఇకపోతే తాను చెన్నై, గిండీలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివినట్లు చెప్పారు. ఆ తరువాత హైదరాబాద్‌కు వెళ్లినా, చెన్నైకి వచ్చినప్పుడల్లా ఇక్కడ తిరిగిన ప్రాంతాలు గుర్తుకొస్తాయన్నారు. రక్షకన్ చిత్రం గురించి చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయిందన్నారు. కోవిడ్ తరువాత చిత్రాలకు భాషాబేధం చెరిగిపోయిందని తెలిపారు. మంచి కంటెంట్ ఉండే చిత్రాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రేక్షకులు ఇప్పుడు చిత్రాలను చూడటానికి థియేటర్లకు వస్తున్నారన్నారు. రక్షన్ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేయాలని ముందు అనుకోలేదన్నారు.
ఇది యూనివర్శల్ చిత్రం అనే నమ్మకం కలగడంతో తమిళంలోనూ విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. చిత్రం కోసం రిహార్సల్స్ చేసి నటించినట్లు తెలిపారు. తమిళ వెర్షన్‌కు తానే డబ్బింగ్ చెప్పినట్లు చెప్పారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా వచ్చాయన్నారు. నటి సోనాల్ చౌహాన్ పోరాట సన్నివేశాల్లోనూ చక్కగా నటించారని ప్రశంసించారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటి సోనాల్ సౌహాన్ పేర్కొన్నారు. నాగార్జున్ ఎంతగానో సహకరించారని కొనియాడింది.
Comments
Please login to add a commentAdd a comment