Grey Telugu Movie Review with Rating - Sakshi
Sakshi News home page

Grey Movie Review ‘గ్రే’ మూవీ రివ్యూ

Published Fri, May 26 2023 2:40 PM | Last Updated on Fri, May 26 2023 3:07 PM

Grey Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: గ్రే
నటీనటుటు: అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతేన్ తదితరులు
నిర్మాణ సంస్థ: అద్వితీయ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: వెంకట కిరణ్ కళ్లకూరి, హేమ మాధురి కాళ్లకూరి
రచన- దర్శకుడు: రాజ్ మాదిరాజు
సంగీతం: నాగరాజు తాళ్లూరి
సినిమాటోగ్రఫీ: చేతన్ మధురాంతకం
ఎడిటర్‌: సత్య గిడుతూరి
విడుదల తేదీ: మే 26, 2023

ఈ మధ్యకాలంలో విడుదలకు ముందే సినిమాలను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి పంపిస్తున్నారు.  అలా వెళ్లి 2022 నుంచి దాదాపుగా అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు అందుకున్న గ్రే సినిమా మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ది బుడాపెస్ట్ ఫిలిం ఫెస్టివల్, జైపూర్ ఫిలిం ఫెస్టివల్, ఠాగూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, సింగపూర్ వరల్డ్ ఫిలిం కార్నివాల్, యూరోపియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన గ్రే సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
మన భారతదేశానికి చెందిన అనేకమంది న్యూక్లియర్ సైంటిస్టులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇలాంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. న్యూక్లియర్ సైంటిస్ట్ సుదర్శన్ రెడ్డి(ప్రతాప్ పోతెన్) అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తాడు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన నాయక్(అలీ రెజా) అనే పోలీసు ఆఫీసర్ మొదటి చూపులోనే సుదర్శన్ రెడ్డి భార్య(ఊర్వశి రాయ్)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా నాయక్ కి ఎట్రాక్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా సుదర్శన్ రెడ్డి మృతికి డాక్టర్ రఘు(అరవింద్) కారణమని తేలుతుంది. అయితే సుదర్శన్ రెడ్డిని డాక్టర్ రఘు ఎందుకు చంపాడు? ఇందులో సుదర్శన్ రెడ్డి భార్య పాత్ర ఏమిటి? చివరికి సుదర్శన్ రెడ్డి మరణానికి కారణమైన ఒక కీలకమైన వస్తువు ఏమైంది? పోలీసులు పంపకుండానే పోలీసులా వచ్చిన నాయక్ ఎవరు? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఎలా ఉందంటే
సాధారణంగానే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనగానే ప్రేక్షకులకు ఎక్కడలేని ఆసక్తి వచ్చేస్తుంది. ఈ సినిమా కూడా కొంత ఆ జానర్ కి చెందిన సినిమానే. పబ్లిక్ లో పలుకుబడి ఉన్న ఒక బడా వ్యక్తి అనూహ్య పరిస్థితుల్లో మరణిస్తే అతని కేసు సాల్వ్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ అతని భార్యతోనే ప్రేమలో పడటం, క్షణాల వ్యవధిలోనే వారిద్దరూ బెడ్ రూమ్ వరకు వెళ్లడం, శారీరకంగా ఒక్కటవ్వడం ఇలాంటి విషయాలన్నీ ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించవు. అయితే ఫస్ట్ అఫ్ పూర్తయి ఇంటర్వెల్ తర్వాత సినిమా మొదలయ్యాక ఒక్కొక్క విషయాన్ని చిక్కుముడిలా విడదీస్తున్నట్లు క్లారిటీ ఇచ్చుకుంటూ రావడం గమనార్హం.

న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి సంబంధించిన రీసెర్చ్ చేసే సుదర్శన్ రెడ్డి అప్పటివరకు ఆడవాళ్ళందరికీ దూరంగా ఉంటూనే ఒక ప్రెస్ రిపోర్టర్ అయిన ఆరుషి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమలో పడిన తర్వాత తన రీసెర్చ్ అంతా పూర్తి చేసి ఆ రీసెర్చ్ కాపీ డెలివరీ ఇవ్వాల్సిన సమయంలో మరణిస్తాడు. అయితే అతని మరణానికి కారణం ఆరుషినా? ఆరుషితో వివాహేతర సంబంధం పెట్టుకున్న రఘు అనే డాక్టరా? లేక సుదర్శన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నిస్తున్న రష్యన్ లేదా ఐఎస్ఐ ఏజెంట్లా అనే విషయాలను తెరమీద ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు దర్శకుడు.

ఈ విషయాలన్నీ సినిమా తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే. కథగా చూసుకుంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ కథనం చప్పగా సాగడంతో బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని రొమాంటిక్ సీన్లు, డైలాగులు బాగా పేలుతాయి. కొద్ది రోజుల్లో అవి మీమ్స్ ద్వారా పాపులర్ అవుతాయి అనడంలో కూడా సందేహం లేదు. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసేవాళ్లు ఈ సినిమాను కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ స్లో నేరేషన్, ఏమాత్రం లాజిక్ లేని కొన్ని సీన్స్ ఇబ్బందిగా మారుతాయి.

ఎవరు ఎలా చేశారంటే
డాక్టర్ పాత్రలో అరవింద్, న్యూక్లియర్ సైంటిస్ట్ సుదర్శన్ రెడ్డి పాత్రలో ప్రతాప్ పొథెన్ బాగా సూట్ అయ్యారు. అయితే వారి పాత్రలకు ఏ మాత్రం ఎమోషన్స్ సెట్  అవ్వలేదు. ఎప్పటిలాగే అలీ రెజా తనకి అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఇక హీరోయిన్ ఊర్వశిరాయ్ తన గ్లామర్ తో అందరినీ డామినేట్ చేసే ప్రయత్నం చేసింది. ఇక మిగతా పాత్రలలో కనిపించిన వారు కూడా తమ తమ పాత్రల పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు. 

ఇక సాంకేతిక బృందం విషయానికి వస్తే సంగీత దర్శకుడు నాగరాజు తాళ్లూరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. పాటలు మాత్రం అంత క్యాచీగా లేవు కానీ సినిమా కథకు తగ్గట్టు సెట్ అయ్యాయి. చేతన్ మధురాంతకం అందించిన సినిమాటోగ్రఫీ ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే కలర్ సినిమాలకు అలవాటు పడిన అందరికీ తన కెమెరా పనితనంతో గ్రే ఎఫెక్ట్ లో చూపించాడు. ఇక ఎడిటింగ్ టేబుల్ మీద కూడా కాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమా నిర్మాణ విలువలు అయితే సినిమా స్థాయికి తగ్గట్టుగా సెట్ అయ్యాయి.
రేటింగ్‌: 2.5

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement