రవితేజ అనగానే అందరికీ గుర్తొచ్చేది అతని సహజ నటన మరియు ఎనర్జీ. ఈ రెండు మెండుగా ఉన్న ఏకైక హీరో రవితేజ. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్దిమంది జాబితాలో రవితేజ ఒక్కడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. నేడు(జనవరి 26) రవితేజ 53వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మీకోసం.
రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు.1968 జనవరి 26 తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించాడు. ముగ్గురు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి.
సంపన్నుల కుటుంబంలోనే జన్మించినా, తాను కోరుకున్న సినిమా రంగంలో రాణించాలనే చెన్నై వైపు పరుగు తీశాడు రవితేజ. సినిమాలు చూడటానికి నాన్న ఇచ్చిన పాకెట్ మనీతో పాటు అమ్మ బ్యాగులోనుంచి చిల్లర కొట్టేసేవారట.
మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు. దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. 1997లో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశాడు. కాని జనాల్లోకి రవితేజ పాత్ర విపరీతంగా వెళ్లిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘అన్నయ్య’ సినిమాలో కలిసి నటించిన రవితేజ.. అంతకు ముందు చిరంజీవి హిందీలో నటించిన ‘గ్యాంగ్ లీడర్’ హిందీ రీమేక్ ‘ఆజ్ కా గూండారాజ్’లో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా నటించాడు.
1999లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘నీ కోసం’ సినిమాలో రవితేజ హీరోగా చేశాడు. ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది.
రవితేజకు స్టార్‌గా బ్రేక్ నిచ్చింది మాత్రం పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. రవితేజతో పూరి తెరకెక్కించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. రవితేజను టాలీవుడ్ స్టార్స్ లో ఒకరిగా నిలిపాయి. ఇక రవితేజను ఉత్తమనటునిగా నిలిపింది కూడా పూరి జగన్నాథ్ రూపొందించిన 'నేనింతే' చిత్రమే కావడం విశేషం.
రాజమౌళి రెండు సినిమాల్లో రవితేజలోని టాలెంట్‌ను అద్భుతంగా వినియోగించుకున్నారు. 'విక్రమార్కుడు'లో విక్రమ్ సింగ్ రాథోడ్‌గా రవితేజలో అంతకు ముందు జనం చూడని కొత్తకోణాన్ని ఆవిష్కరించారు. అందులోనే అత్తిలి సత్తిబాబు పాత్రను తనదైన శైలిలో పండించారు రవితేజ. సునీల్ హీరోగా రాజమౌళి రూపొందించిన 'మర్యాద రామన్న'లో సైకిల్‌కు రవితేజతో డబ్బింగ్ చెప్పించడం మరో విశేషం.
'బలుపు' చిత్రంలో తొలిసారి రవితేజ పాట పాడారు ‘కాజల్ చెల్లివా... కరీనాకు కజినివా అనే పాట సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఆ తరువాత 'పవర్'లో "నోటంకి నోటంకి..." పాట పాడి పరవశింప చేశాడు. 'రాజా ది గ్రేట్’లోనూ ఓ పాటను ఆలపించాడు రవితేజ.
రవితేజ భార్య పేరు కల్యాణి.. కూతురు మోక్షద, కొడుకు మహాధన్
తాజాగా క్రాక్ మూవీతో సంక్రాంతి హీరోగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన రవితేజ.. 2021లో తొలి హిట్ నమోదు చేసాడు.
రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఏడాది మరికొన్ని సినిమాల్లోనూ నటించి, అలరించేందుకు సిద్ధంగా ఉన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment