హీరో సిద్ధార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినా.. తెలుగు హీరోలతో సమానంగా ఆయన సినిమాలు ఇక్కడ విజయం సాధించాయి. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం తదితర సినిమాలు సిద్ధార్థ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం సిద్ధార్థ్‌కి సరైన హిట్ పడలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ టాలెంటెడ్ హీరోని పక్కన పెట్టేశారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇటీవల టక్కర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ ఆ సినిమా రిలీజైన విషయమే చాలా మందికి తెలియదు.
‘చిన్నా’తో కమ్‌బ్యాక్
చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతవుతున్న సిద్ధార్థ్‌కి తాజాగా ఓ సూపర్ హిట్ పడింది. ఆయన నటిస్తూ నిర్మించిన ‘చిట్టా’ చిత్రం తమిళ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడే ఇదే చిత్రాన్ని ‘చిన్నా’పేరుతో తెలుగులో అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. అంజలీ నాయర్, నిమిష సజయన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 28నే తెలుగులో కూడా రిలీజ్ కావాల్సింది. కానీ ఆ రోజు ఇక్కడ చాలా సినిమాలు విడుదల కావడంతో థియేటర్స్ కొరత ఏర్పడింది. దీంతో అక్టోబర్ 6న వాయిదా వేశారు.
రిలీజ్‌కు ఎవరూ ముందుకు రాలేదు
‘చిన్నా’చిత్రాన్ని తమిళ్‌తో పాటు కన్నడ, మలయాళంలో కూడా సెప్టెంబర్ 28 నాడే రిలీజ్ చేశారు. కానీ తెలుగులో మాత్రం విడుదలకు నోచుకోలేదు. దానికి గల కారణం ఏంటో తాజాగా జరిగిన తెలుగు ప్రెస్‌మీట్ సిద్ధార్థ్ వెల్లడించాడు. ‘నా సినిమా బాగుందని ఉదయనిధి స్టాలిన్ తమిళ్‌లో కొన్నాడు. కేరళ కూడా అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ గోకులమ్ గోపాలన్ మా సినిమాను తీసుకున్నాడు. కన్నడలో కేజీయఫ్ నిర్మించివారు విడుదల చేశారు. కానీ తెలుగులో మాత్రం చిన్నా రిలీజ్‌కు ఎవరూ ముందుకు రాలేదు. కొంతమంది అయితే ‘సిద్ధార్థ్ సినిమానా ఎవరు చూస్తారని’అడిగారట.
(చదవండి: హీరో సిద్ధార్థ్ భావోద్వేగం.. ఇక్కడికి ఇకపై రానంటూ!)
మా సినిమా చూసి విడుదల చేయండి అని కొంతమంది దగ్గరకు వెళ్తే.. గేటు బయటే నిలబెట్టి మాట్లాడారు. ఇన్నేళ్ల నా సినీ కెరీర్‌లో ఇలాంటి అవమానం జరగలేదు. నేను తెలుగు సినిమాలు చేయకపోవడానికి కూడా కారణం ఉంది. 2013 నుంచి 2022 వరకు నా దగ్గరకు కేవలం మూడు కథలు మాత్రమే టాలీవుడ్ నుంచి వచ్చాయి. అందులో ‘మహా సముద్రం’ ఒకటి. నేనొక నటుడిని మాత్రమే. నాకు ఒక ప్రాంతం అంటూ ఉండదు. మంచి కథలు వస్తే ఎక్కడైనా నటిస్తాను. ఇప్పుడు ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చా. చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment