‘‘హారర్ సినిమాల విషయంలో నాకు ఓ భయం ఉంటుంది. పేరుకి హారర్ సినిమా అంటారు కానీ అందులో అనవసరమైన కామెడీ, రొమాన్స్, సాంగ్స్‌ను ఇరికిస్తుంటారు. హారర్ అంటే థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఉలిక్కిపడేలా ఉండాలి. సాయికిరణ్ దైదా ‘పిండం’ మూవీ కథ చెప్పినప్పుడు ప్రేక్షకులు ఉలిక్కి పడతారనిపించింది’’ అని హీరో శ్రీరామ్ అన్నారు. సాయికిరణ్ దైదా దర్శకత్వంలో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ చెప్పిన విశేషాలు.
► నేను నటించిన తొలి తెలుగు చిత్రం ‘ఒకరికి ఒకరు’ రిలీజై 20 ఏళ్లయింది. ఇన్నేళ్లయినా అలాగే ఉన్నారు. ఆరోగ్య రహస్యం ఏంటి? అని అడుగుతుంటారు. ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటాను. ఎక్కువగా ఇంటి భోజనం తింటాను. బయటకు వెళ్లినా ఎక్కువగా పప్పు, సాంబారు వంటి ఆహారమే తీసుకుంటాను. ఉన్న దాంతో సంతృప్తి చెంది ఆనందంగా ఉంటాను.
► సాయి కిరణ్ దైదా తీసిన ‘స్మోక్’ అనే షార్ట్ ఫిలిం చూసి తన ప్రతిభపై నమ్మకం కలిగింది. చెప్పిన బడ్జెట్ ప్రకారం టైమ్‌కి ‘పిండం’ పూర్తి చేశారు. యశ్వంత్ ఈ కథను నమ్మి సినిమా నిర్మించారు. ఇది థియేటర్‌లో చూసి అనుభూతి చెందాల్సిన హారర్ సినిమా. 1930, 1990, ప్రస్తుతం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రకథ జరుగుతుంది.
► నా దృష్టిలో ఇప్పటిదాకా తెలుగులో భయంకరమైన హారర్ సినిమా అంటే రామ్‌గోపాల్ వర్మగారు తీసిన ‘రాత్రి’. ఆ మూవీని చాలాసార్లు చూశాను. ‘పిండం’ అనేది కేవలం హారర్ సినిమా కాదు... ఇందులోని బలమైన కథ, భావోద్వేగాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.
► నేను చేసిన ‘రెక్కీ’ వెబ్ సిరీస్ సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం ఓటీటీ కోసం ‘నెట్ వర్క్, హరికథ’ అనే ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను. నేను, జీవీ ప్రకాశ్ తమిళ్‌లో ‘బ్లాక్ మెయిల్’ అనే మూవీ చేస్తున్నాం. అలాగే ‘సంభవం’ చిత్రం చేస్తున్నా. ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాను.
చదవండి: హీరోలనే ఎక్కువ మోస్తున్నారు.. హీరోయిన్ల పరిస్థితి ఏం కావాలి?
Comments
Please login to add a commentAdd a comment