చిట్టిపొట్టి దుస్తులు... రెండు మూడు పాటలు... హీరోని ప్రేమలో పడేయడానికి పడే పాట్లు... కథానాయికల పాత్రలు దాదాపు ఇలానే ఉంటాయి. అందుకే నిండైన దుస్తులు... మెండైన నటన కనబరిచే అవకాశం వస్తే ఎడారిలో ఒయాసిస్సులా భావిస్తారు. అది కూడా పౌరాణిక పాత్రలంటే చెప్పక్కర్లేదు.. పెద్ద సవాల్. ఆ సవాల్‌ని స్వీకరించారు కొందరు నాయికలు. ఏరికోరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అసలు సిసలైన పురాణ స్త్రీల్లా ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయ్యారు.
గ్లామర్, లేడీ ఓరియంటెడ్, నెగటివ్ షేడ్స్ (‘సూపర్ డీలక్స్’ సినిమా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్).. ఇలా తన యాక్టింగ్‌లోని భిన్న కోణాలను ఆవిష్కరించారు సమంత. యాభైకి పైగా సినిమాలు చేశారామె. కానీ కెరీర్‌లో తొలిసారి మైథాలజీ ఫిల్మ్ ‘శాకుంతలం’ చేశారు. దుష్యంతుడు, శకుంతల ప్రేమకావ్యం ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ నటించారు. ‘‘శకుంతల పాత్రను నేను జీవితాంతం మర్చిపోలేను’’ అని ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా పేర్కొన్నారు సమంత.
దీన్నిబట్టి ఈ పౌరాణిక పాత్ర చేయడంపట్ల ఆమె ఎంత సంతృప్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మహా సాధ్వి సీత పాత్రను అంగీకరించి, పెద్ద సాహసమే చేశారు కంగనా రనౌత్, కృతీ సనన్. సీత పాత్ర అంటే కత్తి మీద సామే. ఎందుకంటే ఆ పాత్ర అంటే అంజలీ దేవినే గుర్తొస్తారు. ఆ తర్వాత సీత పాత్రలో నయనతార మెప్పించగలిగారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’లో సీత పాత్ర చేస్తున్నారు కృతీ సనన్. తన కెరీర్‌లో ఇంతకుముందు ‘కళంక్’ వంటి పీరియాడికల్ ఫిల్మ్ చేసినప్పటికీ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ చేయడం ఇదే తొలిపారి.
అందుకే వేషధారణ, హావభావాల పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారట కృతీ సనన్. ఇక బాలీవుడ్‌లో బయోపిక్స్ అండ్ లేడీ ఓరియంటెడ్ ఫిలింస్‌కు ఓ కేరాఫ్ అడ్రస్‌గా మారారు కంగనా రనౌత్. ఇప్పటికే స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీభాయ్ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ), తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత (తలైవి)గా నటించిన కంగన తాజాగా భారత మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ (ఎమర్జెన్సీ) పాత్ర చేస్తున్నారు. అలాగే పౌరాణిక చిత్రం ‘సీత: ది ఇన్‌కార్నేషన్’లో సీతగా నటించనున్నారు.
ఇంకోవైపు సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకోన్ కూడా పురాణ స్త్రీగా కనిపించనున్నారు. 2018లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘పద్మావత్’ చిత్రంలో రాణీ పద్మావతిగా దీపికా పదుకోన్ అభినయం అద్భుతం. పద్మావతి పాత్రలో దీపిక ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులకు నచ్చింది. ఆ ఉత్సాహంతోనే మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన ద్రౌపది పాత్రలో నటించేందుకు ఇటీవల పచ్చజెండా ఊపారు దీపికా పదుకోన్. ద్రౌపది కోణంలో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రాన్ని రెండు లేదా మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నారు.ఈ నాయికలే కాదు.. రామాయణం, మహాభారతాల ఆధారంగా రూపొందుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో మరికొందరు తారలు పురాణ స్త్రీలుగా కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment