Vidya Iyer: వాయిస్‌ ఆఫ్‌ విద్య | Indian American YouTuber and Singer Vidya Iyer Success Story | Sakshi
Sakshi News home page

Vidya Iyer: వాయిస్‌ ఆఫ్‌ విద్య

Published Wed, Aug 25 2021 7:16 PM | Last Updated on Wed, Aug 25 2021 7:16 PM

Indian American YouTuber and Singer Vidya Iyer Success Story - Sakshi

భారతదేశంలో పుట్టింది. పెరిగిందేమో అమెరికాలో. డాక్టర్‌ అవ్వాలనుకుంది, కానీ అనుకోకుండా మంచి సింగర్‌గా మారింది. ఒక దేశంలో పుట్టి మరో దేశంలో పెరిగినప్పటికి.. దేశీయ సంప్రదాయ సంగీతాన్ని వెస్ట్రన్‌ మ్యూజిక్‌తో కలిపి, వీటికి తన సృజనాత్మకతను జోడించి సరికొత్త మ్యాషప్‌ సాంగ్స్‌తో ప్రపంచ వ్యాప్త వ్యూవర్స్‌ను ఉర్రూతలూగిస్తోంది విద్యా అయ్యర్‌.

విద్యా అయ్యర్‌ భారత సంతతికి చెందిన అమెరికన్‌ పాపులర్‌ మ్యాషప్‌సాంగ్స్‌ సింగర్‌. చెన్నైలో పుట్టిన విద్య, తల్లిదండ్రులు వృత్తిరీత్యా అమెరికాలోని వర్జీనియాకు మకాం మార్చడంతో చిన్నతనంలోనే అక్కడికి వెళ్లింది. అక్కడే పెరిగిన విద్య బీఎస్సీ (సైకాలజీ, బయోమెడికల్‌ సైన్స్‌) డిగ్రీ చేసింది. తరువాత మెడిసిన్‌ చదివేందుకు ఎమ్‌క్యాట్‌ (మెడికల్‌ కాలేజ్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)కు సన్నద్ధ మవుతున్న సమయంలో తన స్నేహితుడు శంకర్‌ టక్కర్‌ ఓ యూట్యూబ్‌ చానల్‌ నిర్వహించేవాడు. విద్య చిన్నప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నట్లు తెలుసుకున్న టక్కర్‌ తన యూట్యూబ్‌ చానల్‌కోసం పాటలు పాడమని అడగడంతో వీకెండ్స్‌లో విద్య పాటలు పాడేది. విద్య గొంతు వినసొంపుగా సుమధురంగా ఉండడంతో టక్కర్‌ నిర్వహించే వివిధ కన్సర్ట్‌లలో పాల్గొని పాటలు పాడేది. విద్య గాత్రం ఎక్కువ మంది శ్రోతల్ని ఆకట్టుకోవడంతో టక్కర్‌.. విద్యను ‘‘నువ్వు కూడా ఒక యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించు’’ అని చెప్పడంతో తన గొంతుకు వస్తున్న ఆదరణను చూసిన విద్య సంగీతాన్నే  కెరియర్‌గా మలుచుకోవాలనుకుంది. 
 

విద్యా వోక్స్‌...

మెడిసిన్‌ చదివేందుకు ప్రిపేర్‌ అవుతోన్న విద్య ఒక్కసారిగా తన ఆలోచన మార్చుకుని మ్యూజిక్‌ను కెరియర్‌గా ఎంచుకుంటానంటే తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోలేదు. ‘‘రెండేళ్లు సమయం ఇస్తా. నిన్ను నువ్వు నిరూపించుకోగలిగితే ఒకే, లేదంటే... తిరిగి మెడిసిన్‌ చదవాలి’’ అని అమ్మ కండిషన్‌ పెట్టింది. అమ్మమాటను ఒప్పుకుని 2013లో ముంబై వచ్చి సంగీతంలో మరిన్ని మెళకువలు నేర్చుకుంది. రెండేళ్లపాటు ఇక్కడే ఉండి  కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, వెస్ట్రన్‌ వాయిస్‌ పాఠాలను నేర్చుకుని తిరిగి 2015లో ఆమెరికా వచ్చేసింది. ఇదే ఏడాది ఏప్రిల్‌లో  ‘విద్యావోక్స్‌’ పేరిట యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించింది. ‘వోక్స్‌’ అంటే  లాటిన్‌లో వాయిస్‌ అని అర్థం. 

మ్యాషప్‌ సాంగ్స్‌...
సమకాలీన, సంప్రదాయమైన పాటలకు వెస్ట్రన్‌ సంగీతాన్ని జోడించి సరికొత్త  పాటలను విద్యావోక్స్‌లో అప్‌లోడ్‌ చేసేది. ‘బిగ్‌ గార్ల్స్‌ క్రై’, ‘కభీ జో బాదల్‌ బర్సే’ మ్యాషప్‌ పాటలను అప్‌లోడ్‌ చేసింది. ‘మ్యాడ్‌ డ్రీమ్స్‌’ ‘కుథు ఫైర్‌’ సాంగ్స్‌ విద్యకు బాగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి. విద్యకు బాగా పేరు వచ్చిన వాటిలో ‘‘లవ్‌ మీ లైక్‌ యూ డు, కబీరా–క్లోజర్, లీన్‌ ఆన్, జింద్‌ మహి, వుయ్‌ డోంట్‌ టాక్‌ ఎనీమోర్, పానీ ద ర్యాంగ్, కుట్టునందన్‌ పుంజయితే’’లు ఉన్నాయి. వెస్ట్రన్‌ పాప్‌ హిట్‌ సాంగ్స్‌కు భారతీయ సంగీతానికి జోడించి మ్యూజిక్‌ వీడియోలను రూపొందిస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. విద్య తనే పాటలు రాయడం, స్వయంగా కంపోజ్‌ చేసి, సొంత బ్యాండ్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష షోలు కూడా నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా ఇండియా, మారిషస్, ట్రినిడాడ్, సురనామ్, దుబాయ్, హాంగ్‌కాంగ్, అమెరికాలలో లైవ్‌షోలు నిర్వహించి శోతల్ని తన సుమధుర గానం, మ్యాషప్‌ పాటలతో ఆలరించింది. 

టక్కర్‌తో ప్రారంభించిన తన మ్యూజిక్‌ జర్నీ ఇప్పటికీ అతని సలహాలు, సూచనలతో కొనసాగడం విశేషం. కెమెరా, ఎడిటింగ్, డైరెక్షన్‌లలో సాయం చేస్తూ విద్యను ముందుండి నడిపిస్తున్నాడు. విద్య తల్లి, చెల్లి కూడా తనని  ప్రోత్సహించడంతో ఆమె చానల్‌ ప్రస్తుతం 7.41 మిలియన్ల (దాదాపు డెభైఐదు లక్షలు) మంది సబ్‌స్క్రైబర్స్‌తో దూసుకుపోతోంది. మనం ఎంచుకున్న రంగం ఏదైనా విభిన్నంగా ఆలోచిస్తూ, కష్టపడి ముందుకు సాగితే ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అనడానికి విద్య గొప్ప ఉదాహరణ. ఆమె ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement