సినిమా చూపిస్త మావా.. నీకు సినిమా చూపిస్త మామా.. అంటూ తొలిసారి భారతీయులకు చలనచిత్రాన్ని పరిచయం చేశారు లూమియర్ సోదరులు. సరిగ్గా 127 ఏళ్ల క్రితం ఇదే రోజు(జూలై 7న) ఈ అన్నదమ్ములు భారతీయులకు మొట్టమొదటి సారి సినిమా వీక్షించే అవకాశం కల్పించారు. అది కూడా ఒకటో, రెండో అనుకునేరు.. ఏకంగా ఆరు సినిమాలు. అవి ‘ఎంట్రీ ఆఫ్ సినిమాటోగ్రాఫ్’, ‘ద సీ బాత్’, ‘అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్’, ‘ఎ డిమాలిషన్’, ‘లేడీస్ అండ్ సోల్జర్స్ ఆన్ వీల్స్’, ‘లీవింగ్ ద ఫ్యాక్టరీ’.
1896లో ముంబైలోని వాట్సన్ హోటల్‌లో ఈ సినిమాలను ప్రదర్శించారు. అప్పుడు టికెట్ ధర ఎంతనుకునేరు? కేవలం ఒక్క రూపాయి మాత్రమే! ఇండియాలోకి సినిమా అడుగుపెట్టిన ఈ అద్భుత క్షణాలను టైమ్స్ ఆఫ్ ఇండియా 'మిరాకిల్ ఆఫ్ ద సెంచరీ'గా అభివర్ణించింది. ఫ్రెంచ్ సినిమాటోగ్రాఫర్లు అయిన ఈ లూమియర్ సోదరులు సినిమాలపై తమకున్న పట్టుకున్న పారిస్‌లో నిరూపించుకున్నాకే భారత్‌లో అడుగుపెట్టారు.
1896 జూలై 7న తొలిసారి సినిమా ప్రదర్శించగా దీనికి అద్భుత స్పందన లభించింది. వెంటనే వాళ్లు కోల్‌కతా, చెన్నై నగరాల్లోనూ సినిమా షోలు వేయడం ప్రారంభించారు. రెండో స్క్రీనింగ్ ముంబైలోని నొవాల్టీ థియేటర్‌లో జూలై 14న జరగ్గా ఒకేరోజు ఏకంగా 24 సినిమాలు ప్రదర్శించారు. ఆగస్టు 15 వరకు ఈ షోల ప్రదర్శన ఒక పండగలా జరిగింది.
ఇండియన్స్ తీసిన సినిమాలు..
ఈ ఉత్సాహంతో హీరాలాల్ సేన్ అనే ఇండియన్ ఫోటోగ్రాఫర్ స్టీవెన్‌సన్స్ కెమెరా ఉపయోగించి స్టేజీ షోను చిత్రీకరించాడు. ఈ షోకి ద ఫ్లవర్స్ ఆఫ్ పర్షియా అని నామకరణం చేశారు. హెచ్‌ఎస్. భటవ్‌దేకర్ 1899లో ద రెజ్లర్స్ అనే డాక్యుమెంటరీ చిత్రీకరించాడు. ముంబైలోని హ్యాంగింగ్ గార్డెన్స్‌లో ఇద్దరు రెజ్లర్స్ తలపడ్డ పోటీని ఆయన లైవ్‌లో చిత్రీకరించాడు. ఇండియాలో ఇదే తొలి డాక్యుమెంటరీ సినిమాగా గుర్తింపు పొందింది.
చలనచిత్ర పితామహుడు
పూర్తి స్థాయిలో సినిమాను తీసి రిలీజ్ చేసింది మాత్రం దాదా సాహెబ్ ఫాల్కే. ఈయన 1913లో మరాఠీ భాషలో రాజా హరిశ్చంద్ర అనే మూకీ(సైలెంట్) సినిమా తీశాడు. అప్పట్లో ఇది సంచలన విజయం నమోదు చేసుకుంది. భారతీయ సినిమాకు ప్రాణం పోసిన ఈయనను చలనచిత్ర పితామహుడిగా చెప్పుకుంటారు. ఇండియాలో తొలి టాకీ సినిమా ఆలం అరా. అర్దేశిర్ ఇరానీ తెరకెక్కించిన ఈ సినిమా 1931 మార్చి 14న విడుదలైంది. అదే ఏడాది తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద కూడా రిలీజైంది.
చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో ముద్దులాట.. తప్పు మీదైతే నన్నంటారేంటి? నటి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment