ఆయన్ను చూస్తే చాలనుకున్నాను... సినిమా చేశాను | Bollywood, Tollywood and other celebs tributes to the legend Dilip Kumar | Sakshi
Sakshi News home page

ఆయన్ను చూస్తే చాలనుకున్నాను... సినిమా చేశాను

Published Thu, Jul 8 2021 12:56 AM | Last Updated on Thu, Jul 8 2021 1:11 AM

Bollywood, Tollywood and other celebs tributes to the legend Dilip Kumar - Sakshi

దిలీప్‌కుమార్‌ అందరూ మెచ్చిన నటుడు. భారతీయ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన నటుడు. అంతటి లెజండరీ నటుడు మన తెలుగు హీరో కృష్ణంరాజు నిర్మించిన ‘ధర్మ్‌ అధికారి’లో నటించారు. ఇది కృష్ణంరాజు రెండు పాత్రల్లో నటించి, నిర్మించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’కి హిందీ రీమేక్‌. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన కె. రాఘవేంద్రరావు హిందీ రీమేక్‌ని తెరకెక్కించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున తండ్రీ కొడుకులుగా బి. గోపాల్‌ దర్శకత్వం వహించిన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ హిందీ రీమేక్‌ ‘కానూన్‌ అప్నా అప్నా’లో దిలీప్‌ కుమార్‌ నటించారు.

ఈ చిత్రాన్ని బి. గోపాల్‌ దర్శకత్వంలోనే తెలుగు నిర్మాత ఏఎస్‌ఆర్‌ ఆంజనేయులు నిర్మించారు. అలాగే ఎన్టీఆర్‌ నటించిన ‘రాముడు–భీముడు’ హిందీ రీమేక్‌ ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’లోనూ దిలీప్‌కుమార్‌ నటించారు. తెలుగు నిర్మాతలు చక్రపాణి, బి. నాగిరెడ్డి నిర్మించగా, తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. ఇలా తెలుగు చలనచిత్ర దర్శక–నిర్మాతలతో దిలీప్‌కుమార్‌కి అనుబంధం ఉంది. ఇప్పుడు దిలీప్‌కుమార్‌ భారతీయ సినీరంగాన్ని విషాదంలో ముంచి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయనతో సినిమాలు చేసిన రాఘవేంద్ర రావు, కృష్ణంరాజు, బి. గోపాల్‌ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన విశేషాల్లోకి వెళదాం...

► నేను నాగేశ్వరరావుగారికి పెద్ద అభిమానిని. నేల టికెట్‌ కొనుక్కుని మరీ ఆయన సినిమాలు చూసేవాణ్ణి. అలాగే నాకు దిలీప్‌ కుమార్‌గారంటే కూడా చాలా ఇష్టం. కాలేజ్‌ డేస్‌లో ఫ్రెండ్స్‌ అందరం దిలీప్‌ కుమార్‌గారు రోజుకి 18 లక్షలు తీసుకుంటారట, చాలా పెద్ద హీరో అని చెప్పుకునేవాళ్లం. అసలు దిలీప్‌గారిని లైఫ్‌లో దూరంగా అయినా నిలబడి చూడగలమా? అనుకునేవాణ్ణి. కానీ ఆయన సినిమాకి డైరెక్షన్‌ చేయగలిగాను.

► నాగేశ్వరరావుగారు, నాగార్జునగారు తండ్రీ కొడుకులుగా నా దర్శకత్వంలో వచ్చిన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ని ప్రొడ్యూసర్‌ ఏస్‌ఆర్‌ ఆంజనేయులుగారు హిందీలో రీమేక్‌ చేద్దామన్నారు. ఆ తర్వాత దిలీప్‌కుమార్‌తో ఈ సినిమా చేస్తున్నాం అని ఆయన అన్నారు. అసలు నాకేమీ అర్థం కాలేదు. ఇంత అదృష్టం మనకు దక్కుతుందా అనిపించింది. దూరంగా అయినా చూడగలుగుతామా? అనుకున్న నాకు ఆయన్ను డైరెక్షన్‌ చేసే చాన్స్‌ అంటే చాలా ఆనందంగా అనిపించింది. షాకింగ్‌గా కూడా అనిపించింది.

► ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఆంజనేయులుగారు నన్ను ముంబయ్‌ తీసుకెళ్లారు. దిలీప్‌కుమార్‌గారి ఇంటికి వెళ్లాం. వెళ్లగానే ఆయన కాళ్లకు దండం పెట్టాను. కాసేపయిన తర్వాత ‘ఏంటీ మీరు మాత్రమే మాట్లాడుతున్నారు. డైరెక్టర్‌ ఏమీ మాట్లాడటంలేదు’ అని ఆంజనేయులుగారిని దిలీప్‌గారు అడిగారు. ‘అలా ఏం లేదు. మీకు పెద్ద ఫ్యాన్‌ ఆయన. మిమ్మల్ని చూసిన ఆనందంలో మాట్లాడకుండా ఉండిపోయారు’ అంటే ఆయన నవ్వుకున్నారు. అలా ఆయనతో ‘కానూన్‌ అప్నా అప్నా’ సినిమా చేశాను.

► రీ టేక్‌ అని చెప్పడానికి టెన్షన్‌ పడిన సందర్భాలు లేవు. ఎందుకంటే దిలీప్‌గారు చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉండేవారు. ఈ సినిమా కమిట్‌ అయినప్పుడు ‘గోపాల్‌.. తెలుగులో ఈ సినిమా పెద్ద హిట్టయిందని నాకు తెలుసు. నాకున్న ఇమేజ్‌కి తగ్గట్టుగా కాకుండా వేరే ఏదైనా ట్రై చేద్దాం.. డిస్కస్‌ చేద్దాం’ అని చెప్పి, అప్పట్లో రాజేశ్‌ ఖన్నాగారి ‘ఆరాధన’కు రచయితగా చేసిన సచిన్‌ బౌమిక్‌ని పిలిపించారు. దిలీప్‌గారు కొన్ని సలహాలూ సూచనలూ ఇచ్చి, ‘నువ్వు ‘నో’ అంటే ‘నో’. నీకూ కరెక్ట్‌గా అనిపిస్తేనే పెట్టు. లేకపోతే వద్దు. ఎందుకంటే తెలుగు వెర్షన్‌ కోసం చాలా రోజులు వర్క్‌ చేశారు. ఆ కథ డిస్ట్రబ్‌ కాని మార్పులే చేద్దాం. లేకపోతే వద్దు’ అన్నారు. అంత ఫ్రీడమ్‌ ఇచ్చారు.

► ‘నేను మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.15 లోపు షూటింగ్‌కి వస్తాను. నా అలవాటు అది. మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి’ అని ముందే మాతో అన్నారు. ఆయనకు తగ్గట్టుగానే షూటింగ్‌ ప్లాన్‌ చేశాం. దిలీప్‌గారు బాగా షటిల్‌ ఆడేవారు. బాగా ఎక్సర్‌సైజులు కూడా చేసేవారు. అవన్నీ చేసుకుని చెప్పినట్లుగానే 12 గంటలకల్లా లొకేషన్లో ఉండేవారు. కంటిన్యూస్‌గా సాయంత్రం 3 గంటల వరకూ షూటింగ్‌ చేసినా బ్రేక్‌ కావాలనేవారు కాదు. 3 గంటల తర్వాత లైట్‌గా లంచ్‌ తిని, ఓ అరగంట రెస్ట్‌ తీసుకుని, మళ్లీ ఫుల్‌ ఎనర్జీతో షూటింగ్‌లో పాల్గొనేవారు. హైదరాబాద్‌లో, మదరాసులలో షూటింగ్‌ చేసినప్పుడు బస చేసిన హోటల్‌లో షటిల్‌ ఆడుకుని షూటింగ్‌కి వచ్చేవారు.

► అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్‌ చేశాం. అప్పుడు నాగేశ్వరరావుగారు వచ్చారు. దిలీప్‌గారు, ఆయన ఇద్దరూ కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటే చూడటానికి రెండు కళ్లూ చాలలేదు. ఒకరినొకరు గౌరవించుకున్న తీరు చూసి, నాకు చాలా ముచ్చటేసింది.

► దిలీప్‌గారు ఎక్కువ టేక్స్‌ తీసుకునేవారు కాదు. ‘కానూన్‌ అప్నా అప్నా’కి ఖాదర్‌ ఖాన్‌ డైలాగ్‌ రైటర్‌. ఆయన ఒక పెద్ద క్యారెక్టర్‌ కూడా చేశారు. ఖాదర్‌ రాసిన వెర్షన్‌ తీసుకెళ్లి, దిలీప్‌గారు ఫైనల్‌గా ఒక వెర్షన్‌ రాసుకొచ్చేవారు. ఖాదర్‌ ఖాన్‌ రాసిన ఫ్లేవర్‌ పోకుండా చిన్న చిన్న మార్పులతో డైలాగులు రాసుకొచ్చేవారు. క్యారెక్టర్‌ని ఓన్‌ చేసుకోవడానికి ఆయన అలా చేసేవారు. అంటే.. ఎంత హోమ్‌వర్క్‌ చేసేవారో ఊహించవచ్చు.

► కానూన్‌ అప్నా అప్నా’ చేసిన కొంతకాలం తర్వాత ఓ సందర్భంలో చెన్నైలో దిలీప్‌కుమార్‌గారిని కలిశాను. గుర్తుపట్టి,  ‘గోపాల్‌.. ఎలా ఉన్నావ్‌’ అని ఆప్యాయంగా పలకరించారు. ఒక లెజండరీ నటుణ్ణి కోల్పోయాం. చాలా బాధగా ఉంది.

ఇండియన్‌ సినిమాకు గుర్తింపు తెచ్చిన నటుడు

– కృష్ణంరాజు

► ప్రపంచవ్యాప్తంగా ఇండియన్‌ ఇండస్ట్రీకి గుర్తింపు తెచ్చిన గొప్ప కళాకారుడు దిలీప్‌కుమార్‌. ప్రతి సినిమాలో ఆయన నటన ఎంతో గొప్పగా ఉంటుంది. వ్యక్తిగా కూడా చాలా గొప్పవారు. దిలీప్‌కుమార్‌కి నేను పెద్ద అభిమానిని. ‘బొబ్బలి బ్రహ్మన్న’ సినిమాలో యంగ్, ఓల్డ్‌ క్యారెక్టర్స్‌ నేనే చేసినప్పటికీ హిందీలో రీమేక్‌ చేయాలన్నప్పుడు పెద్ద వయసు పాత్రకు ధర్మేంద్రను, యంగ్‌ క్యారెక్టర్‌కు జితేంద్రను అనుకున్నాం. అలా అనుకున్నప్పటికీ దిలీప్‌కుమార్‌ అభిమానిగా ఆయన నటిస్తే బాగుంటుందనుకున్నాను. కానీ నటిస్తారో లేదో అని సందేహం. కానీ దిలీప్‌కుమార్‌గారు  ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమా చూసి, నాకు ఫోన్‌ చేసి అభినందించారు. నటిస్తానని అన్నారు. అలా ‘ధర్మ్‌ అధికారి’ ఆరంభమైంది. ఇందులో యంగ్‌ క్యారెక్టర్‌ను జితేంద్ర చేశారు.

► సాధారణంగా దిలీప్‌కుమార్‌గారు సినిమా షూటింగ్‌కు మధ్యాహ్నం 12 గంటల మధ్యలో వచ్చేవారు. కానీ ఈ సినిమాకి మాత్రం ఉదయం ఏడు గంటలకే సెట్స్‌కి వచ్చేవారు. ఇందులోని  ధర్మ్‌ రాజ్‌  క్యారెక్టర్‌ ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే నేనంటే ఆయనకు ఉన్న ఇష్టం కూడా ఆయన్ను సెట్స్‌కు రప్పించిందేమో! ‘భాయీజాన్‌’ అంటూ ఆప్యాయంగా హత్తుకునేవారు.

► ఈ సినిమా షూటింగ్‌ అప్పుడు ఓ సందర్భంలో జితేంద్ర ఓ సన్నివేశానికి ఇంకా కాస్ట్యూమ్‌తో రెడీ కాలేదు. దిలీప్‌కుమార్‌గారు ఆలస్యంగా వస్తారని ఆయన అనుకున్నారు. కానీ ఆల్రెడీ వచ్చారని, షాట్‌కు రెడీ అయిపోయారని చెప్పాను. ‘దిలీప్‌గారు అప్పుడే వచ్చారా.. అబద్ధం చెప్పకు’ అని జితేంద్ర అన్నారు. ‘లేదు.. వచ్చారు’ అని చెప్పగానే అప్పటికప్పుడు జితేంద్ర షాట్‌కు రెడీ అయ్యారు.

► ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రం 100 డేస్‌ ఫంక్షన్‌కు దిలీప్‌గారు వచ్చారు. ఆయనతో పాటు ఆయన భార్య సైరా బానుని కూడా తీసుకువచ్చారు. నేను, దిలీప్, ఆమె ఒకే చోట పక్కపక్కనే కూర్చున్నాం. అప్పుడు వేదిక మీద ఉన్న ‘బొబ్బిలి బ్రహ్మన్న’ పోస్టర్‌ చూసి, ఆయన ఎవరు? అని దిలీప్‌గారిని సైరా బాను అడిగారు. ‘నీ పక్కన ఉన్న అతన్ని అడుగు’ అని నన్ను చూపిస్తూ, ఆయన చమత్కరించారు. అప్పట్లో నేను యంగ్‌గా ఉన్నాను. పోస్టర్‌లో పెద్ద వయసున్న బ్రహ్మన్న గెటప్‌లో నన్ను గుర్తుపట్టలేకపోయారామె. యంగ్‌ రవి పాత్రను మాత్రమే నేను చేశానని ఆమె అనుకుని ఉంటారు.


లెజెండ్‌ దూరమయ్యారు
 
– కె. రాఘవేంద్రరావు

భారతీయ సినిమా చరిత్రలో టాప్‌ లెజెండ్‌ దిలీప్‌కుమార్‌గారు. అన్ని రకాల పాత్రలు చేసిన గొప్ప నటుడు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ స్క్రిప్ట్‌ చదివి, సినిమా చూడగానే హిందీ రీమేక్‌లో నటించడానికి ఒప్పుకున్నారాయన. ఈ సినిమా షూటింగ్‌ అప్పుడు రాజమండ్రిలో చిన్న విలేజ్‌ దగ్గర ఓ ఇల్లు తీసుకున్నాం. అప్పుడు దిలీప్‌గారి భార్య సైరా బాను కూడా వచ్చారు. ఇద్దరూ చాలా సింపుల్‌ పర్సన్స్‌. ఒక గొప్ప వ్యక్తితో, గొప్ప నటుడితో సినిమా చేయడం నాకు హ్యాపీ అనిపించింది. ఇండియన్‌ ఇండస్ట్రీ ఒక లెజెండ్‌ని కోల్పోయింది.

ప్రముఖుల నివాళి
‘‘ఒక శకం ముగిసింది. ఇక భారతీయ సినిమా అంటే దిలీప్‌కుమార్‌కి ముందు ఆ తర్వాత అనాలి’’ అంటూ దక్షిణ, ఉత్తరాది భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు
దిలీప్‌కుమార్‌ మృతి పట్ల సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

లెజెండరీ యాక్టర్‌ దిలీప్‌కుమార్‌గారి మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో దిలీప్‌కుమార్‌గారు ఒకరు. ఆయన ఒక యాక్టింగ్‌ ఇనిస్టిట్యూషన్‌. తన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన సినీ సంపద.
– చిరంజీవి

భారతీయ సినీ పరిశ్రమకు దిలీప్‌కుమార్‌గారి మరణం తీరని లోటు. ఒక నటుడిగా మొదలై స్టార్‌గా ఎదిగిన దిలీప్‌గారి మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. అయితే వివిధ సందర్భాల్లో ఆయన్ను కలుసుకోగలిగినందుకు ఐ యామ్‌ బ్లెస్డ్‌.  
– మోహన్‌బాబు

దిలీప్‌కుమార్‌ సార్‌ మనకు శాశ్వతంగా దూరమయ్యారనే వార్త నన్ను బాధించింది. ఆయన ఎప్పటికీ ఓ లెజెండ్‌. మన హృదయాల్లో దిలీప్‌గారి లెగసీ ఎప్పటికీ నిలిచే ఉంటుంది.
– వెంకటేశ్‌

ప్రపంచ సినిమాపై దిలీప్‌కుమార్‌ చెరగని ముద్ర వేశారు. గ్రేటెస్ట్‌ యాక్టర్‌. లెజెండ్స్‌ ఎప్పటికీ బతికే ఉంటారు 
– రవితేజ

దిలీప్‌గారి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్టర్స్‌ అందరికీ ఓ ప్రేరణ. సినీ చరిత్రలో నిలిచిపోతారు. 
– మహేశ్‌బాబు
భారతీయ సినీ పరిశ్రమ ఎదుగుదలలో దిలీప్‌కుమార్‌గారి పాత్ర విలువైనది.
– జూనియర్‌ ఎన్టీఆర్‌

దిలీప్‌కుమార్‌గారి మరణం ఇండియన్‌ సినిమాకు తీరని లోటు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేం.
– రామ్‌చరణ్‌

దిలీప్‌కుమార్‌గారు భారతీయ సినిమాకు చేసిన కృషి అసమానమైనది. ఈ తరం యాక్టర్స్‌కే కాదు. భవిష్యత్‌ తరాల యాక్టర్స్‌కూ ఆయన ఓ స్ఫూర్తి.
– అల్లు అర్జున్‌
ఒక ఇనిస్టిట్యూషన్‌ వెళ్లిపోయింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ చరిత్రను రాస్తే అది కచ్చితంగా దిలీప్‌కుమార్‌కు ముందు, దిలీప్‌కుమార్‌ తర్వాత అన్నట్లు ఉంటుంది.
– అమితాబ్‌ బచ్చన్‌

దిలీప్‌ కుమార్‌తో నేను ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాను. దిలీప్, సైరా బానులతో నాకు మంచి అనుబంధం ఉంది. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలనే కాదు.. ఇతర సంగతుల గురించి కూడా మేం మాట్లాడుకునేవాళ్లం. ఆయన సినిమాలు విడుదలైన ప్రతిసారీ సైరా నన్ను వాళ్ల ఇంటికి ఆహ్వానించేవారు. నేను వెళితే ‘‘మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు.. మన ‘మధుమతి’ (దిలీప్‌కుమార్‌ సరసన వైజయంతీ మాల నటించిన సినిమా) వచ్చారు’’ అని దిలీప్‌తో సైరా అనేవారు. అప్పుడు ‘ధనో  వచ్చింది’ అని దిలీప్‌ అనేవారు. ‘గంగాజమున’ చిత్రంలో నేను పోషించిన పాత్ర పేరు ధనో. దిలీప్‌కుమార్‌ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. తనతో కలిసి ఉండేందుకు ఆ అల్లాయే దిలీప్‌ను పిలిచాడని అనుకుంటున్నాను.
– వైజయంతీ మాల

నా ఆప్యాయమైన సోదరుడు దిలీప్‌కుమార్‌ని కోల్పోయాను. మా దిలీప్‌ ఉండటం ఆ స్వర్గానికే అదృష్టం.
– ధర్మేంద్ర

నా జీవితంలో ఓ తండ్రిలా ఉన్న దిలీప్‌ సార్‌తో నాకు ఎన్నో ప్రత్యేకమైన అనుభూతులు ఉన్నాయి. 
– సంజయ్‌ దత్‌
 

ఇండియన్‌ సినిమా అద్భుతమైన నటుడిని కోల్పోయింది. ఇలాంటి ప్రతిభాశాలి లేరు, రారు. 
– సల్మాన్‌ ఖాన్‌

అద్భుత నటన ద్వారా విలువైన, వెలకట్టలేని, ప్రత్యేకమైన బహుమతులను మాకు ఇచ్చిన యూసుఫ్‌ సాహెబ్‌కు ధన్యవాదాలు. నా దృష్టిలో మీరెప్పటికీ గ్రేటెస్ట్‌. సలామ్‌!
– ఆమిర్‌ ఖాన్‌

ఈ ప్రపంచంలో చాలామంది హీరోలు ఉండొచ్చు. కానీ మా యాక్టర్స్‌ హీరో దిలీప్‌కుమార్‌ సారే. ఇండియన్‌ సినిమాలో ఆయన మరణంతో ఓ శకం సమాప్తమైపోయింది.
– అక్షయ్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement