ఆమెకు 12.. అతడికి 34.. ఇద్దరి మధ్య సుమారుగా 22 ఏళ్ల వయోభేదం ఉన్నా చూపులు కలిశాయి. తొలిచూపులోనే ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఆపై తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న వయసు గురించి అందరూ పలు రకాలుగా మాట్లాడుకున్నా ‘మాది దేవుడు కలిపిన బంధం’ అంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా చివరి వరకు నిలిచారు. అలా బాలీవుడ్‌లో తమ ప్రేమ గొప్పదనాన్ని చూపారు ఈ లెజెండరీ కపుల్స్.. వారెవరో కాదు దిలీప్ కుమార్ - సైరా భాను.
1960ల నాటి సంగతి..
దిలీప్ కుమార్‌ను చూడ్డం కోసం ముంబైలో ‘మొఘల్ ఎ ఆజం’ ప్రీమియర్‌కు హాజరైంది ఒక పదహారేళ్లమ్మాయి. అప్పుడే లండన్ నుంచి వచ్చింది స్కూల్ చదువు ముగించుకొని. ఆ షోకి దిలీప్ కుమార్ రాకపోయేసరికి చాలా నిరాశపడింది. తర్వాత యేడాదికి తనూ హీరోయిన్ అయింది ‘జంగ్లీ’ సినిమాతో.. షమ్మీకపూర్ పక్కన. ఆమే సైరా బాను. ‘మొఘల్ ఎ ఆజం’ ప్రీమియర్ ప్రస్తావనకు తర్వాత ఆమె జీవితంలోని మలుపుకి సంబంధం ఉంది.
(టాప్ హీరో రాజేంద్ర కుమార్‌తో సైరా భాను)
మొదటి ప్రేమ రాజేంద్ర కుమార్‌తో
ఆ రోజుల్లో దిలీప్ కుమార్ టాప్-1 స్థానంలో ఉంటే రాజేంద్ర కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. సైరా బాను సినిమాల్లోకి రాకముందే రాజేంద్ర కుమార్ స్టార్. ఆ తరం ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు. ‘జంగ్లీ’ హిట్‌తో సైరా బానుకు స్టార్స్ పక్కన నటించే అవకాశాలు క్యూ కట్టాయి. అందులో రాజేంద్ర కుమార్ హీరోగా ‘ఆయీ మిలన్ కీ బేలా’ కూడా ఉంది. సైన్ చేసింది సైరా. ఆ సెట్స్‌లో ఆమెను చూసిన రాజేంద్ర కుమార్ గుండె లయ తప్పింది. సైరా కళ్లల్లోని అమాయకత్వం అతణ్ణి పిచ్చివాణ్ణి చేసింది. ‘తుమ్హే క్యా దూ మై దిల్ కె సివా (నా హృదయాన్ని తప్ప నీకేం ఇవ్వ గలను)’ అంటూ సాగే ‘ఆయీ మిలన్ కీ బేలా’లోని పాటలో సైరా కోసం జీవించాడు. ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అంతటి హీరో తనకు ఫిదా కావడంతో రాజేంద్ర కుమార్ పట్ల ఆమెకూ ఆకర్షణ మొదలైంది.
సినిమా పూర్తయ్యేటప్పటికి ప్రేమలో పడిపోయారిద్దరూ. ఆ మూవీ బాక్సాఫీస్ హిట్. దాంతో ఈ ఇద్దరి కలయికలోనే ‘ఝుక్ గయా ఆస్‌మాన్’ ప్రారంభమైంది. ఇందులోని ‘కౌన్ హై జో సప్‌నో మే ఆయా (నా కలలోకి వచ్చినదెవరు)’ పాటలో తన కళ్లల్లో సైరాను కొలువుంచుకొనే అభినయించాడు రాజేంద్ర కుమార్. ఈ సినిమా కూడా హిట్ అయ్యి ఆ జంటకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. తెర మీది కెమిస్ట్రీతో పాటు వీళ్లిద్దరి ప్రేమాయణమూ బాలీవుడ్ నోట షికారు చేసింది. అయితే రాజేంద్ర కుమార్ అప్పటికే పిల్లల తండ్రి. అదేమీ అడ్డంకిగా భావించని సైరా అతణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంది. సైరా ప్రేమ కోసం భార్యా,పిల్లలనూ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు రాజేంద్ర కుమార్. ఈ విషయం సైరా తల్లి నసీమ్ బానుకు తెలిసింది. నిజానికి రాజేంద్ర కుమార్ అంటే నసీమ్ కుటుంబానికి అపారమైన గౌరవం. ఒకరోజు ఆయన్ను కలిసి ‘సైరా చాలా మంచి పిల్ల. ఆమెను అర్థం చేసుకునే చక్కటి భాగస్వామి దొరకాలి’ అంటూ. రచ్చ కాకుండానే సైరాను ఆ ప్రేమ నుంచి తప్పించేసింది. అంతటితో వారిద్దరి ప్రేమకు ఫుల్‌స్టాప్ పడింది.
బర్త్‌డే పార్టీలో దిలీప్ కుమార్‌తో సైరా ప్రేమ
చాన్స్ రానే వచ్చింది సైరా బాను బర్త్‌డే రూపంలో. పార్టీ అనౌన్స్ చేసి దిలీప్ కుమార్‌ను అతిథిగా ఆహ్వానించింది నసీమ్. పుట్టిన రోజు పార్టీలో తన అభిమాన హీరో కనిపించడంతో ‘దిలీప్ సాబ్’ అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సైరా. దిలీప్ కుమార్ కూడా సైరాను చూసి ముగ్ధుడయ్యాడు. ఆ క్షణం దిలీప్ కుమార్ కళ్లల్లో మెరిసిన మెరుపు నసీమ్ దృష్టిని దాటిపోలేదు. అలా కొన్నేళ్లపాటు సైరా- దిలీప్‌లు కూడా తమ మధ్య మూగప్రేమనే మనసులో నింపుకొన్నారు.
అయితే వీరిద్దరి ప్రేమను పెళ్లిపీటలెక్కించిన ఘనత మాత్రం సైరా తల్లి నసీమ్ భానుకే దక్కుతుంది. సమయం చిక్కగానే అతణ్ణి అడిగింది.. ‘మీరంటే సైరాకు పిచ్చి.. చిన్నప్పటి నుంచీ. నా కూతురిని పెళ్లి చేసుకుంటారా?’ అని. అప్పటికే వహీదా రెహ్మాన్‌తో డేటింగ్‌లో ఉన్నాడు దిలీప్ కుమార్. అయినా నసీమ్ ప్రతిపాదనను సమ్మతించాడు రెండో ఆలోచన లేకుండానే. అలా తనకన్నా ఇరవై రెండేళ్లు పెద్దవాడైన దిలీప్ కుమార్‌కు 1966లో జీవిత భాగస్వామి అయింది సైరా బాను.
పెళ్లి తర్వాత అలాంటి కామెంట్లు
అయితే పెళ్లి తర్వాత చాలామంది వీళ్లిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించే మాట్లాడుకున్నారట! పలు రకాలుగా కామెంట్లు వచ్చినా వాటన్నింటినీ పట్టించుకోకుండా ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరుగా ముందుకు సాగారు. ఎళ్లు గడుస్తున్నా వారి బంధాన్ని నిక్షేపంగానే కొనసాగించారు. 'మనసులో ప్రేముంటే వయసుతో పనేముంది' అని తమ అనుబంధంతోనే నిరూపించారీ ఐకానిక్ కపుల్.
పెళ్లయ్యాక ఆరేళ్లకు అంటే 1972లో మొదటిసారి గర్భం ధరించారు సైరా. ఎనిమిదో నెలలో ఆమెకు అబార్షన్ అయింది. పుట్టిన బేబీ కూడా దక్కలేదు. కొన్ని కారణాల వల్ల ఇకపై ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు కూడా తేల్చి చెప్పేశారు. దీంతో పలు కారణాల వల్ల హైదరాబాద్‌కు చెందిన ఆస్మా రెహ్మాన్ అనే మహిళను దిలీప్ రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ బంధం రెండేళ్లకు మించి కొనసాగలేదు. సైరాను మరిచిపోలేకపోయాడు దిలీప్. రెండేళ్లపాటు సైరాకు దూరంగా ఉండటం ఒక నరకంగా భావించాడు. తిరిగి సైరాను చేరుకున్నారు.
అంత జరిగినా దిలీప్ నా వాడే అంటూ సైరా కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో దిలీప్ నా కోహినూర్ వజ్రం.. నా జీవితంలో అల్లాను రెండే రెండు కోరికలు కోరాను. మా అమ్మలా ఫేమస్ కావాలని, దిలీప్ కుమార్‌లాంటి భర్త దొరకాలని. అల్లా రెండిటినీ నెరవేర్చాడు. అని ఆమె చెప్పుకొచ్చింది. ఎన్ని జన్మలెత్తినా దిలీప్ నా వాడు! అంటూ తన భర్తపై అపారమైన ప్రేమను ఆమె బయటపెట్టింది. దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్.. 1944 నుంచి 1998 వరకు బాలీవుడ్‌ను ఏలిన దిలీప్ 2021లో అనారోగ్యంతో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment