మాస్‌ మెచ్చిన క్లాస్‌ సినిమా ‘స్వాతిముత్యం’ | Interesting Facts About Kamal Haasan Swathi Muthyam Movie | Sakshi
Sakshi News home page

కమల్‌ మనవడిగా అల్లు అర్జున్‌.. ‘స్వాతిముత్యం’..ఓ నిరంతర స్ఫూర్తి

Published Sun, Dec 8 2024 8:41 AM | Last Updated on Sun, Dec 8 2024 9:32 AM

Interesting Facts About Kamal Haasan Swathi Muthyam Movie

హీరో మానసికంగా ఎదగనివాడు... హీరోయిన్‌  అప్పటికే ఓ పిల్లాడికి తల్లైన విడో. అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరికీ ముడిపడితే? ఇలాంటి కథతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ ఆ ప్రయోగాన్ని క్లాస్‌తో పాటు మాస్‌ కూడా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు బాక్సాఫీస్‌ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు. అది ఓ క్రియేటివ్‌ జీనియస్‌ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం. ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట కె.విశ్వనాథ్‌. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్‌ హీరోలు హిట్స్‌ మీద హిట్స్‌ ఇస్తున్న సందర్భంలో కమల్‌హాసన్‌  లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్‌బస్టర్‌ అద్భుతం ఈ ‘స్వాతిముత్యం’. 1985లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది.

కమల్‌హాసన్‌ ట్యూన్‌... గానం
మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్‌ చేసిన ఈ సినిమాకు కమల్‌హాసన్, రాధిక నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీ రికార్డింగ్‌ ప్రాణం పోశాయి. ఆత్రేయ, సినారె రాసిన పాటలు మరో అద్భుతం. ఈ సినిమా పాటల రచనలోనూ విశ్వనాథ్‌ హస్తం ఉంది. హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం. స్క్రీన్‌పై ఎస్టాబ్లిష్‌ చేయడానికి విశ్వనాథ్‌ అప్పటికప్పుడు అనుకొని జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని..’ అనే పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్‌ కోసం వెళ్తుండగా మార్గమధ్యంలో కమల్‌హాసనే ఆ పాటకు ట్యూన్‌  కట్టి పాడారు. ఆ వెర్షన్‌తోనే షూటింగ్‌ చేశారు. ఆ తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక ‘వటపత్రసాయికి...’  పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్‌ సమకూర్చినవే. ఇదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్‌ ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ కన్నా ముందే ఈ సినిమా, ఈ  పాటతో సీతారామశాస్త్రి పేరు తెరమీదకు వచ్చింది.

రాజ్‌కపూర్‌ హార్ట్‌ టచ్‌ అయిన వేళ
బాలీవుడ్‌ రారాజు రాజ్‌ కపూర్‌ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ నుండి ఏ సినిమా తీసినా బొంబాయిలో రాజ్‌ కపూర్‌కు చూపించడం కె. విశ్వనాథ్‌కు అలవాటు. అలాగే ‘స్వాతిముత్యం’ కూడా చూశారాయన. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్‌ కపూర్‌ వెనక్కి తిరిగి విశ్వనాథ్‌తో... మీరు నా హార్ట్‌ టచ్‌ చేశారు. దేర్‌ ఈజ్‌ ఎ లాట్‌ ఆఫ్‌ హానెస్టీ ఇన్‌ దిస్‌ ఫిల్మ్‌ అంటూ తెగ మెచ్చుకున్నారు. 

కమల్‌హాసన్, విశ్వనాథ్‌లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్‌ చేయాలనీ రాజ్‌ కపూర్‌ ముచ్చటపడ్డారు. శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమల్‌హాసన్‌కు ఫోన్‌ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ, తర్వాత ఎందుకనో అది కుదరలేదు. అయితే... మూడేళ్ల తర్వాత అనిల్‌ కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్‌’ పేరుతో కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలోనే హిందీలో రీమేక్‌ చేశారు. అక్కడా హిట్‌ అయింది. తెలుగు వెర్షన్‌  రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ను తమిళ, మలయాళంలో డబ్‌ చేయగా మంచి విజయం సాధించాయి. అయితే 2003లో సుదీప్‌ కన్నడలో రీమేక్‌ చేయగా అది ఆకట్టుకోలేకపోయింది.

కమల్‌ మనవడిగా అల్లు అర్జున్‌
‘స్వాతిముత్యం’లో మరో విశేషం ఉంది.. ఇందులో రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనవడు మాస్టర్‌ కార్తీక్‌ నటించగా... కమల్‌హాసన్‌  మనవడిగా అల్లు అరవింద్‌ కొడుకు ఇప్పటి ఐకాన్‌  స్టార్‌ అల్లు అర్జున్‌  నటించారు. మనవరాళ్లుగా అరవింద్‌ మేనకోడళ్లు విద్య, దీపు తెరపైకి వచ్చారు. అల్లు అర్జున్‌  చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక.. ఆ ఏడాది  (1985) తెలుగులో ఆరుగురు స్టార్‌ హీరోలు పోటీలో ఉన్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్‌ బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్‌ కొట్టారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరుమీదున్నారు. బాక్సాఫీస్‌ ఖైదీ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా, రాక్షసుడు’ లాంటి హిట్స్‌తో పోటీపడుతున్నారు. నాగార్జున ‘విక్రమ్‌’తో, వెంకటేశ్‌ ‘కలియుగ పాండవులు’తో మాస్‌ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడితో, నాన్‌ కమర్షియల్‌ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది . స్వాతిముత్యం’. అదీ... వెండితెరపై విశ్వనాథ్‌ సమ్మోహనం.  

స్వాతిముత్యం.... ఓ నిరంతర స్ఫూర్తి
తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్‌ ఉత్తమ దర్శకుడిగా, కమల్‌హాసన్‌  ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్‌కు అఫీషియల్‌ ఇండియన్‌  ఎంట్రీగా పంపిన ఫస్ట్‌ సౌతిండియా  ఫిల్మ్‌ కూడా ఇదే. ఎప్పుడైనా సరే... కమర్షియల్‌ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్‌ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి.
– దాచేపల్లి సురేష్‌కుమార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement