Intinti Gruhalakshmi: తులసి చేతిలో నందు జాతకం! | Intinti Gruhalakshmi June 10: Is Tulasi Signs On Nandu Project | Sakshi
Sakshi News home page

తులసి ఒప్పుకోకపోతే నందు జీవితం చీకటిమయం!

Published Thu, Jun 10 2021 1:30 PM | Last Updated on Thu, Jun 10 2021 1:38 PM

Intinti Gruhalakshmi June 10: Is Tulasi Signs On Nandu Project - Sakshi

నందు పడ్డ కష్టానికి ప్రతిఫలం తులసి మీద ఆధారపడి ఉంది. అతడు పూర్తి చేసిన ప్రాజెక్టుకు డబ్బులు రావాలంటే తులసి సంతకం తప్పనిసరి అని చెప్పడంతో నందు, లాస్య టెన్షన్‌ పడ్డారు. ఎలాగైనా తులసితో సంతకం పెట్టిస్తానని లాస్య ఆమె ఇంటికి వెళ్లింది. మరి అక్కడేం జరిగింది? లాస్య అడిగినదానికి తులసి అంగీకరించిందా? లేదా? అనేది నేటి (జూన్‌ 10) ఎపిసోడ్‌లో చదివేయండి...

కళ్లు తిరిగి పడిపోయిన అంకిత ఆరోగ్యానికి ఏమైందోనని అభి కలవరడ్డాడు. తను తీసుకోవాల్సిన ఫుడ్‌ దగ్గర నుంచి మెడిసిన్‌ వరకు అంతా తానే దగ్గరుండి చూసుకుంటానని చెప్పాడు. అతడి ప్రేమకు పరవశించిపోవాలో, గర్భవతి అన్న విషయాన్ని దాస్తున్నందుకు బాధపడాలో తెలీని దుస్థితిలో ఉంది అంకిత. మరోవైపు ఆమె తల్లి మాత్రం వీలైనంత త్వరగా అబార్షన్‌ చేయించాలని నిర్ణయించుకుంది.

మరోపక్క ప్రేమ్‌, శృతిల మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ్‌ మీద అభిప్రాయమేంటి అని పనిమనిషి రాములమ్మ అడగ్గానే శృతి గుటకలు మింగింది. తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టాలా? వద్దా? అని నానారకాలుగా ఆలోచించింది. చివరకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు గుండె దాటి బయటకు రాలేవంటూ సమాధానం దాటవేసింది.. కానీ రాములమ్మ మాత్రం ప్రేమ్‌ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడని తేల్చి చెప్పింది. ఏదో ఒకరోజు అతడే ఈ విషయాన్ని నీ ముందుకు వచ్చి చెప్తాడని అనడంతో శృతి సిగ్గుతో బిడుసుకుపోయింది.

తులసి ఇంటికి వచ్చిన అంజలి తన స్నేహితురాలితో కాసేపు కబుర్లాడింది. బిజినెస్‌ స్టార్ట్‌ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది. సరిగ్గా అప్పుడే అక్కడకు వచ్చిన మాధవి.. నందు అన్నయ్యతో బంధాన్ని తెగతెంపులు చేసుకోమని వదినకు సెలవిచ్చింది. ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకడం దేనికని ప్రశ్నించింది. అన్నయ్య వదిలేసినా ఆయన తిరిగొస్తాడని చూడటం వ్యర్థమని అభిప్రాయపడింది. దీనికి తులసి స్పందిస్తూ కలిసి ఉండాలా? విడిపోవాలా? అనేది నిర్ణయించుకునేందుకు ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చింది.

మరో పక్క నందు పూర్తి చేసిన ప్రాజెక్టులో అతడి భార్య సంతకం కూడా ఉంటేనే ప్రాజెక్టు పూర్తి డబ్బులు పంపిస్తామని చెప్పాడు. తులసి సంతకాన్ని ఫోర్జరీ చేస్తే సరిపోతుంది కదా అని లాస్య సలహా ఇచ్చింది. ఆ సంతకం ఫోర్జరీ అని తెలిస్తే జైలుపాలవుతామని నందు హెచ్చరించాడు. ఎలాగైనా తన దగ్గర సంతకం తీసుకోవాల్సిందేనని చెప్పాడు. కానీ తులసి దగ్గరకు వెళితే ఒక మెట్టు దిగినట్లు అవుతుందని మధనపడ్డాడు. దీంతో లాస్య తన చేత ఎలాగైనా సంతకం చేయించుకొస్తానని చెప్పింది. అన్నట్లుగానే ఆమె ఇంటికి వెళ్లి సంతకం కోసం రిక్వెస్ట్‌ చేయకుండా ఆర్డర్‌ వేసింది. సంతకం పెట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చింది. మరి లాస్య మాటలకు తులసి వెనకడుగు వేసి సంతకం పెడుతుందా? లేదా? అనేది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.

చదవండి: సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement