ఇంటింటి గృహలక్ష్మి జూన్ 24వ ఎపిసోడ్: నందు తల్లిదండ్రులకు పెళ్లై 50 ఏళ్లు పూర్తయిందని భాగ్య లాస్యకు చెప్పింది. దీన్ని ఓ వేడుకలా జరుపుకుందామని తులసి ప్లాన్ చేస్తోందని తెలిపింది. కానీ ఆ వేడుక జరపాలంటే డబ్బులు అవసరమని, అంత డబ్బు తులసి దగ్గర లేదు కాబట్టి నువ్వే ఆ సెలబ్రేషన్స్ దగ్గరుండి జరిపించావంటే ఆ కుటుంబం అంతా నిన్ను తలకెక్కించుకుంటుందని చెప్పింది. దీంతో ఇదేదో వర్కవుట్ అయ్యేలా ఉందని లాస్య ఆలోచించింది.
మరోవైపు తన అత్తామామల పెళ్లిరోజును పండగలా జరపాలని తులసి తెగ ఆశపడుతోంది. అయితే తన పెద్ద కొడుకు లేకపోతే ఆ ఫంక్షన్‌లో కూర్చునే ప్రసక్తే లేదని అనసూయ తెగేసి చెప్పింది. నందు వస్తే అతడి వెంట ఆ కొరివి దెయ్యం లాస్య వస్తుందని, అది నాకిష్టం లేదన్నాడు ఆమె భర్త. మీరు ఎన్ని చెప్పినా ఈ విషయంలో ఎవరి మాటా విననని, తన కొడుకు రావాల్సిందేనని అనసూయ తేల్చి చెప్పింది.
నందు మాత్రం ఏకంగా ఈ ఫంక్షన్‌ను రిసార్ట్‌లో జరిపించాలనుకుంటాడు. ఇదే విషయాన్ని ఎంతో ఆదుర్దాగా ఇంటికి వెళ్లి మరీ చెప్తాడు. కానీ నందు నిర్ణయాన్ని అతడి తండ్రి అంగీకరించడు. నీ ఆఫర్లు ఇక్కడ ఎవరికీ అక్కర్లేదంటాడు. ఈ వేడుక జరిపే అర్హత కూడా లేదని నిందిస్తాడు. ఇక్కడి నుంచి వెళ్లిపో అని అవమానిస్తాడు. దీంతో ఆవేశపడ్డ నందు తన మాట కాదన్నారంటే ఈ కొడుకు చచ్చిపోయినట్లేనని, ఇంకెప్పుడూ మీ ముఖం కూడా చూడనని చెప్పి విసురుగా వెళ్లిపోతాడు.
అతడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న నందు తల్లి అతడి చేతుల మీదుగా ఫంక్షన్ జరగలేదంటే పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోనని చెప్పింది. నువ్వు చచ్చినా సరే, తాను మాత్రం ఆ ఫంక్షన్‌కు వచ్చేదే లేదని నందు తండ్రి తేల్చి చెప్తాడు. ఈ క్రమంలో అనసూయ తన పంతం నెగ్గించుకోవడానికి నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో కంగారుపడ్డ తులసి.. నందు చేతుల మీదుగా ఫంక్షన్ జరుగుతున్నట్లు అతడి నోటితోనే చెప్పించాలనుంది. ఇందుకోసం లాస్య ఇంటి మెట్లు ఎక్కక తప్పలేదు. మరి తన ఇంటికి వచ్చిన తులసిని లాస్య అవమానిస్తుందా? లేక అటు నుంచటే బయటకు పంపించేస్తుందా? అసలేం జరగనుందనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment