నందు కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేయాలన్న లాస్య పాచిక పారింది. దివ్య ఆత్మహత్యకు యత్నించడం, ఆమె చదువుకు ఫీజు కడదాం అని వెళ్తుంటే శశికళ ఎంట్రీ ఇవ్వడం, ఇప్పుడు దివ్య కనిపించకుండా పోవడం.. అన్నీ ఆమెకు కలిసొస్తున్నాయి. మొత్తానికి నందు ఇంట్లో ఆనందానికి స్థానం లేకుండా పోయిందని తెగ సంతోషించింది. అసలు దివ్య ఎలా అదృశ్యమైంది? ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావడం కోసం నందు, తులసి ఏం చేశారు? అన్న విషయాలు నేటి(మే 11) ఎపిసోడ్‌లో చదివేయండి..
తను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే దివ్యను చదివించడం కోసం పక్కనపెట్టిన డబ్బును శశికళ గద్దలాగా తన్నుకుపోయింది. దీంతో తన కూతురి ముఖంలో సంతోషం, భవిష్యత్తుకు ధీమా కల్పించేందుకు ఏం చేయాలా? అని మల్లగుల్లాలు పడ్డాడు నందు. తన దగ్గర అంత డబ్బు కూడా లేదే? అని తల పట్టుకున్నాడు. ఇంతలో తన కారును అమ్మేయాలన్న మెరుపులాంటి ఆలోచన మెదడులో కదిలింది. అంతే.. ఎప్పటినుంచో తన కారులాంటి మోడల్‌ను కొనాలని తెగ ఆసక్తి చూపిస్తున్న స్నేహితుడికి ఫోన్ చేశాడు. అతడు కూడా కొనడానికి అంగీకారం తెలపడంతో మెడిసిన్ ఫీజు కట్టొచ్చని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.
కానీ ఈ విషయం తెలియక దివ్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. ముందు రోజు తల్లి ఒడిలో నిద్రపోయిన ఆమె తెల్లారేసరికి కనిపించకుండా పోవడంతో ఇంటిల్లిపాది కంగారు పడిపోయింది. దివ్యను ఆమాత్రం చూసుకోలేవా? అని నందు, అతడి తల్లి తులసిని ఏకిపారేశారు. వయసొస్తే సరిపోదని కాస్త బుర్ర కూడా ఎదగాలని ఆమెను నిందించారు. ఇలా గొడవపడితే సమస్యకు పరిష్కారం దొరకదని నందు తండ్రి సూచించడంతో అందరూ ఆమెను వెతకడం మొదలు పెట్టారు.
కానీ భాగ్య మాత్రం వీరి ఆందోళనను పోగొట్టాల్సింది పోయి, వారి టెన్షన్‌ను రెట్టింపు చేసేలా మాట్లాడింది. దివ్య చావడానికి వెళ్లిపోయి ఉంటుందిలే, అలాంటి వాళ్ల కోసం ఎందుకు వెతకడం అంటూ నోటికొచ్చినట్లు వాగింది. తన కూతురి గురించి దురుసుగా మాట్లాడిన భాగ్య మీద చెయ్యి చేసుకోబోయిన నందు తర్వాత తనను తాను తమాయించుకున్నాడు. ఛీ కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇవేవీ పెద్దగా పట్టించుకోని భాగ్య ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ పూస గుచ్చినట్లు లాస్యకు ఫోన్‌లో చేరవేసింది భాగ్య. దివ్య బకెట్ తన్నేసిందంటే నీకు లైన్ క్లియర్ అంటూ మరో పథకాన్ని రచించమమని చెప్పకనే చెప్పింది. ఇదే కనక జరిగితే దివ్యతో పాటు, లాస్య కూడా నందు జీవితంలో దూరమవుతుందని విషాన్ని చిమ్మింది.
మరోవైపు తన కూతురు కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేద్దామని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నందుకు చేదు అనుభవం ఎదురైంది. అతడి ఫిర్యాదును తీసుకోకుండా కాలక్షేపం చేస్తున్న పోలీస్ మీద నందు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన పోలీస్.. నీ కూతురు ఎవరితోనో లేచిపోయి ఉంటుందని చులకనగా మాట్లాడాడు. ఆ మాటలను సహించలేకపోయిన నందు ఏకంగా అతడి కాలర్ పట్టుకున్నాడు. దీంతో డ్యూటీలో ఉన్న పోలీసాఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు అతడిని స్టేషన్లో బందీని చేశారు. మరి అతడిని తులసి విడిపించుకుంటుందా? భర్త, కూతురు కోసం తులసి ఏం చేయనుందనేది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.
చదవండి: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా
Comments
Please login to add a commentAdd a comment