
మెడిసిన్ చదవలేనేమోనన్న భయంతో తనకు తెలియకుండానే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తోంది దివ్య. ఏదో మైకంలో ఆత్మహత్యకు యత్నించడం, ఇంటి నుంచి వెళ్లిపోవడం లాంటివి చేస్తూ అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. ఆమెను ఎలా ఓదార్చాలో, డిప్రెషన్‌లో నుంచి ఎలా బయటపడేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు దివ్య తల్లిదండ్రులు. మరి నేటి(మే 12) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో వారు దివ్య కోసం ఏం చేశారు? తనను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారా? అనేది తెలియాలంటే దీన్ని చదివేయండి..
కన్నకూతురును కంటిపాపలా చూసుకునే నందుకు దివ్య అదృశ్యమవడం అశనిపాతంలా మారింది. తనను జాగ్రత్తగా చూసుకోనందుకు తులసి మీద రంకెలు వేసిన అతడు పోలీస్ స్టేషన్‌లోనూ సహనాన్ని కోల్పోయాడు. తన కూతురు ఎవరితోనో లేచిపోయిందంటూ చులకనగా మాట్లాడిన ఇన్‌స్పెక్టర్ మీద నిప్పులు చెరిగాడు. ఏకంగా అతడి కాలర్ పట్టుకున్నాడు. దీంతో అందరి ముందు తనను అవమానించిన నందును అరెస్ట్ చేసి లాకప్‌లో వేశారు. ఈ విషయం తెలిసిన తులసి మరింత షాక్‌కు గురైంది.
పరుగుపరుగున పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతడిని వదిలేయండి అంటూ ఇన్‌స్పెక్టర్‌ను చేతులెత్తి వేడుకుంది. దీంతో రవ్వంత కరిగిపోయిన అతడు నందు సారీ చెప్తే వదిలేస్తానని మెలిక పెట్టాడు. సారీ చెప్పడం కష్టమే అయినప్పటికీ తప్పదంటూ, ఈ ఒక్కసారికి సారీ చెప్పేయమని కొడుకు వేడుకున్నాడు. ఇక తప్పని పరిస్థితుల్లో తనను తాను తమాయించుకున్న నందు క్షమించమని చెప్పి అక్కడ నుంచి బయటపడ్డాడు. మరోవైపు దివ్య తనకు తెలియకుండానే రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటే గుర్తించిన బంధువు ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు.
ఆమెను చూడగానే ఇంటివాళ్లకు పోయిన ప్రాణం లేచివచ్చినట్లైంది. కన్నకూతురు కళ్లెదురుగా కనిపించడంతో సంతోషపడిపోయారు నందు దంపతులు. అయితే నందు తల్లి మాత్రం దివ్యకు మాయదారి రోగం వచ్చిందంటూ ఆడిపోసుకుంది. ఇది నచ్చని నందు తన కూతురును అలా అనొద్దంటూ హెచ్చరించాడు. మొత్తానికి దివ్య క్షేమంగా ఇల్లు చేరింది. కానీ అక్కడ లాస్య మరో ఎత్తు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నందుతో కాన్ఫరెన్స్ కాల్‌లో తులసిని ఇరికించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ సక్సెస్ అయిందా? బెడిసి కొట్టిందా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment