
లాస్య ప్లాన్ బెడిసికొడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయి అల్లకల్లోలం సృష్టించాలనుకుంది. అనుకున్నట్లుగా వరుస సమస్యలు కూడా వచ్చిపడ్డాయి. కానీ వాటన్నింటిని చాకచక్యంగా దాటుకుంటూ ముందుకు సాగుతోంది తులసి కుటుంబం. దీంతో త్వరలోనే తానేంటో చూపిస్తానని మంగమ్మ శపథం చేస్తోంది లాస్య. మరి నేటి(మే 14) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి..
నా చదువుకు డబ్బులు కూర్చింది నువ్వే కదా అని దివ్య తన తల్లిని అడిగింది. అందుకు తులసి అవునని తలూపడంతో దీన్నెందుకు దాచిపెట్టడం? ఈ మంచి విషయాన్ని అందరికీ చెప్తానని మారాం చేసింది. దీంతో ఆందోళన పడ్డ తులసి.. చేసిన పని అందరికీ తెలియాల్సిన అవసరం లేదని, దీనికి ఫలితం దక్కితే అంతే చాలు అని చెప్పి కూతురిని ఆప్యాయంగా హత్తుకుంది. తన కలలు నిజమవుతుండటంతో దివ్య గాల్లో తేలుతోంది. తన కూతురు సంతోషాన్ని చూసి ఉప్పొంగిపోయాడు నందు. తన చదువు కోసం సాయపడ్డ ఇంటి సభ్యులందరికీ (తులసితో సహా) థ్యాంక్స్ చెప్పాడు.
ఈ సంతోషాన్ని చిన్నాభిన్నం చేసేందుకు లాస్య తులసికి ఫోన్ చేసింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది నీకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడానికేనంటూ తులసిని హెచ్చరించింది. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడని తులసి.. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే పెళ్లి రోజున ఆయనను బయటకు తీసుకెళ్లి మనసారా మాట్లాడేలా చేశాను. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే ఇంత చేసిన నేను.. నువ్వు ఆయన పక్కన లేనప్పుడు ఇంకెంత చేస్తానో ఊహించలేవు అని రివర్స్ కౌంటరిచ్చింది. ఇదేమీ పెద్దగా పట్టించుకోని లాస్య.. త్వరలోనే నిన్ను గెంటేస్తానని తులసికి సవాలు విసిరి ఫోన్ పెట్టేసింది.
మరోవైపు అభి తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకోసం ఇంటర్వ్యూ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రయత్నాన్ని అంకిత అడ్డుకుంది. అమ్మ చెప్పినట్లు ఫారిన్‌కు వెళ్లి అక్కడ ఇంకా చదవుకుని డాక్టర్స్‌గా స్థిరపడదాం అని సూచించింది. కానీ మీ అమ్మ ఇచ్చే డబ్బుతో ముందడుగు వేయలేనని తేల్చి చెప్పాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య అగ్గి రాజుకోవడంతో అభి ఆవేశంలో అంకిత మీద చేయి చేసుకోబోయాడు. ఎప్పుడూ ప్రేమగా మాట్లాడే అభి తన మీద చేయెత్తడం తట్టుకోలేకపోయిన అంకిత కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసిన అంకిత తల్లి.. ఇదే సరైన సమయమని, ఫారిన్‌కు వెళ్దామని అభిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయమని సూచించింది. దీంతో అమ్మ సలహాను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమైంది అంకిత.
ఇక దివ్య సమస్య పరిష్కారం అయిందనుకుంటున్న తరుణంలో నందు ఇంట్లో మరో కొత్త సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. తన భర్త విడాకులు అడుగుతున్నాడంటూ నందు సోదరి ఉరేసుకోవడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన ఇంటి సభ్యులు ఆమెను అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరి ఆమె సమస్యను నందు దంపతులు ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
చదవండి: ఇంట్లో ఉంటే ఆకలి, బయటకు వెళితే కరోనా: నటి భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment