
విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న మోహన్ మనసు ఎలా మార్చాలా? అని నందు ఫ్యామిలీ మల్లగుల్లాలు పడుతోంది. కానీ వీరి ఆలోచనకు భిన్నంగా మాధవి కూడా విడాకులకై సై అనడం గమనార్హం. మరి వీరి మనసు మార్చేదెవరు? విడాకులను అడ్డుకున్నారా? అందుకోసం ఏం చేశారు? అనేది తెలియాలంటే నేటి(మే19) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్ స్టోరీ చదివేయాల్సిందే!
భవిష్యత్తు అల్లకల్లోలం అవుతుందని తెలిసీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది మాధవి. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్లు ఇంకిపోయాయే తప్ప సమస్యకు మాత్రం మంచి పరిష్కారం దొరకలేదు. ఆర్తనాదాన్ని కూడా అల్లరే అనుకునేవారికి మన గుండె ఘోష అర్థం కాదంటూ తులసి మాధవిని ఊరుకోబెట్టింది. తనను వద్దనుకున్న వ్యక్తిని పట్టుకుని వేలాడుతూ ఉండటం వల్ల లాభం లేదని భావించిన మాధవి విడాకుల పత్రం మీద సంతకం పెట్టింది. తనకు విడాకులు మంజూరైన వెంటనే తులసి, తాను ఇంటి నుంచి వెళ్లిపోతామని నిర్ణయం తీసుకుంది. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఈ ఇంట్లో బతకాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
ఇంట్లో జరుగుతున్న వరుస పరిణామాలపై నందు కలత చెందాడు. ఈ సమయంలో ప్రేమ్ తండ్రి దగ్గరకు వెళ్లి వీటన్నింటికీ కారణం నువ్వే అని నిందించాడు. మీ వల్లే రెండు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నించకపోతే జీవితాంతం బాధపడతారని హెచ్చరించాడు. దీంతో నందు ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో లాస్య కాల్ చేసిందంటూ భాగ్య ఫోన్ తీసుకెళ్లడంతో నందు చిరాకు ప్రదర్శించాడు.
ఫోన్ చేసింది సీఎం, పీఎం కాదు కదా, తర్వాత చేస్తానంటూ చిర్రుబుర్రులాడాడు. తన ఫోన్ కాల్ పట్టించుకోకపోవడమేంటి? అని లాస్యకు ఒక క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. మన ప్లాన్ మనకే తిప్పికొట్టేలా ఉందని కంగారుపడిపోయింది. వీలైనంత త్వరగా తిరిగి ఇంట్లో అడుగుపెట్టాల్సిందేనని డిసైడ్ అయింది.
చెల్లెలి జీవితం ఏమైపోతుందోనన్న ఆలోచనలతో నందుకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మాధవి కూడా తెగదెంపులు చేసుకోవడానికే రెడీ అయిందని తెగ బాధపడ్డాడు. తాను చేసిన తప్పే తన చెల్లెలి రూపంలో వచ్చి వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తోందని దిగులు చెందాడు. తులసి జీవితంలో నిప్పులు పోయడానికి ఇంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది లాస్య. తన భార్య స్థానం లాస్యదేనని నందు తేల్చి చెప్పడంతో సహించలేకపోయింది. లాస్య చేయి పట్టుకుని బయటకు గెంటేసింది. దీంతో రేపటి ఎపిసోడ్ రసవత్తరంగా మారనున్నట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment