
విడాకుల ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో మాధవి దంపతులు తులసికి క్షమాపణలు చెప్పారు. తమ మూలంగా నీ మీద ద్వేషం పెరిగిందంటూ దిగులు చెందారు. ఇప్పుడు నందు మనల్ని నమ్మే పరిస్థితిలో లేడని, అతడిని ఎలా దారికి తెచ్చుకుంటావని ఆవేదని చెందారు. కష్టాలు, కన్నీళ్లతోనే సహజీవనం చేసిన తులసికి చేజారిన పరిస్థితిని ఎలా దారికి తేవాలో అర్థం కాక తల పట్టుకుంది. మరి నేటి(మే 21వ) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..
మాధవి ఆడిన విడాకుల నాటకం బయటపడటంతో నందు తులసికి విడాకులు ఇచ్చి తీరుతానని శపథం చేశాడు. ఇంకా విడాకులైనా మంజూరు కాకముందే లాస్యను నెత్తిన ఎక్కించుకుని తిరుగుతున్నాడు. ఆమె కోసం ఇంటివాళ్లనే ఎదిరిస్తున్నాడు. మరోవైపు తన పాచిక పారడంతో మరింత రెచ్చిపోయిన లాస్య నందు ఎదుట మొసలి కన్నీళ్లు కార్చింది. మీ ఇంట్లో వాళ్లు నన్ను పురుగులా చూస్తారని, అవి నేను భరించలేనని ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటూ బ్లాక్‌మెయిల్ చేసింది. దీంతో ఏం చేయాలో చెప్పమని నందు ఆమెకు లొంగిపోయాడు.
ఇదే అదునుగా భావించిన లాస్య.. తనను ఇంటి కోడలిగా చేయమని పరోక్షంగా సూచించింది. అది అర్థమైన నందు.. ఇంట్లో వాళ్లందరినీ పిలిచి లాస్యకు ఇంటి సర్వాధికారాలు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇంటికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అది లాస్య ఆధ్వర్యంలోనే జరగాలని ఆదేశించాడు. ఎవరేం చేయాలన్నా లాస్య అనుమతి తీసుకోవాల్సిందేనని నొక్కి చెప్పాడు. ఇకపై ఈ ఇంట్లో కోడలి స్థానం, తన భార్య స్థానం కూడా లాస్యదే అని చెప్పడంతో అందరూ షాకయ్యారు. తనకిచ్చే విలువను లాస్యకు కూడా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పాడు. తన భార్య స్థానంలో తులసి ఉండదని నందు కుండ బద్ధలు కొట్టాడు.
ఇక ఇంట్లో జరుగుతున్న పరిణామాలకు దివ్య కన్నీరుమున్నీరుగా విలపించింది. అన్నయ్య అభికి ఫోన్‌కు చేసి జరిగిందంతా చెప్తూ ఏడ్చేసింది. ఇంతలో ప్రేమ్ వచ్చి దివ్యను మందలించాడు. సమస్యను చూసి పారిపోయేవాడికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావ్ అని మండిపడ్డాడు. భార్య మాటలు విని అమ్మను అపార్థం చేసుకున్నవాడికేం తెలుస్తుందని నిందించాడు. అతడి మాటలు విన్న అభికి నోట మాట రాక కళ్లలో నీళ్లు తిరిగాయి. అయినా దుఃఖాన్ని దిగమింగుకుని తనను తాను తమాయించుకున్నాడు. ప్రేమ్ మాటలతో అభిలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి.
మరోపక్క జిత్తులమారి లాస్య తన అసలు రంగును చూపించేందుకు రెడీ అవుతోంది. ఇంట్లో ఉన్న ఒక్కొక్కరిని ఈ ఇంటి నుంచే కాదు, ఏకంగా ఈ లోకం నుంచే పంపించేస్తానని తులసికి వార్నింగ్ ఇచ్చింది. కళకళలాడుతున్న ఇల్లు వల్లకాడు చేయాలనుకుంటున్న లాస్య ఆలోచనకు తులసి బెంబేలెత్తింది. ముందుగా నందు తండ్రి మీద గురి పెట్టిన లాస్య అతడికి పాలల్లో మోతాదుకు మించి ఎక్కువగా బీపీ ట్యాబ్లెట్లు వేసిచ్చింది. దీంతో అతడు గుండెనొప్పితో విలవిల్లాడిపోయాడు. ఇది చూసిన తులసి తన మామయ్యను రక్షించుకుంటుందా? లాస్యకు ఎలా బుద్ధి చెప్తుంది? అనేది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.
చదవండి: మెగా హీరోతో గరుడవేగ డైరెక్టర్ తర్వాతి సినిమా?

Comments
Please login to add a commentAdd a comment