
తులసితో విడాకులు మంజూరు కాకముందే లాస్యతో వేరు కాపురం పెట్టాడు నందు. తన ఇంటి ముందే మరో ఇల్లు అద్దెకు తీసుకుని దిగాడు. ఈ క్రమంలో భార్య ఉద్యోగం చేయబోతుందని తెలిసి సహించలేకపోయాడు. అలా అని ఆమె దగ్గరకు వెళ్లి కుదరదని చెప్పలేకపోయాడు. మరి నేటి(మే 27) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే చదివేయండి..
నన్నే మెడపట్టుకుని బయటకు గెంటేస్తుందా? అంటూ ప్రతీకారంతో రగిలిపోయింది లాస్య. తనకు జరిగిన అవమానం వల్ల ఇప్పుడు ఏకంగా కురుక్షేత్రమే జరగబోతుందని, అందుకు సిద్ధంగా ఉండమంటూ తులసికి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ యుద్ధంలో ఓడేందుకు సిద్ధంగా ఉండమంటూ తులసి రివర్స్ కౌంటరిచ్చింది. మరోవైపు రోహిత్ దగ్గర తులసి తిరిగి ఉద్యోగంలో చేరుతుందన్న విషయం తెలిసి నందు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె ఉద్యోగం చేస్తే నీకేంటని లాస్య నిలదీయగా తులసి తను తాళి కట్టిన భార్య అని స్పష్టం చేశాడు. ఆమెతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు తను నీ భార్య అని గుర్తు రాలేదా? అని లాస్య తిరిగి ప్రశ్నించింది. నీ మనసులో భార్య స్థానంలో ఇంకా తులసే ఉందంటూ అలక బూనింది. దీంతో నందు అలాంటిదేమీ లేదంటూ లాస్యను ఊరడించే ప్రయత్నం చేశాడు.
మరోవైపు అభి తన దగ్గర డబ్బులు లేకే బయటకు తీసుకెళ్లడం లేదని, ఏమీ కొనివ్వలేకపోతున్నాని అంకితతో చెప్పాడు. ఈ మాటలు విన్న అంకిత తల్లి తన దగ్గర డబ్బుందని, దాన్ని తీసుకుని బయట తిరిగి రండని సూచించింది. నీ డబ్బుతో నా కూతురిని ఏమీ ఉద్ధరించలేవని నానామాటలు అంది. నువ్వు సంపాదించేదానితో కూతురికి కనీసం నెయిల్ పాలిష్ కూడా కొనలేవని సూటిపోటి మాటలతో అతడిని ఛిద్రం చేస్తూ డబ్బు చేతిలో పెట్టింది. ఇన్ని అవమానాలు పడాల్సి వస్తున్నందుకు అభి కోపంతో రగిలిపోయాడు.
ఇక తులసి, నందుతో వ్రతం చేయించేందుకు తులసి తల్లి నేరుగా ఇంటికి వచ్చింది. ఇక్కడ తన కూతురి కాపురం చిన్నాభిన్నమైందన్న విషయం తెలుసుకున్న ఆమె ఏం చేయనుంది అనేది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment