ఉపాసన తాతగారికి రూ.కోటి చెక్‌ అందించిన ‘జైలర్‌’ నిర్మాత | Jailer Movie Production House Sun Pictures Donate Rs 1 Crore To Apollo Hospitals - Sakshi
Sakshi News home page

ఉపాసన తాతగారికి రూ.కోటి చెక్‌ అందించిన ‘జైలర్‌’ నిర్మాత, ఎందుకో తెలుసా?

Published Wed, Sep 6 2023 10:10 AM | Last Updated on Wed, Sep 6 2023 10:26 AM

Jailer Movie Producer Sun Picture Donate RS 1 Crore To Apollo Hospitals - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఖాతాలో చాలా కాలం తర్వాత ‘జైలర్‌’తో ఓ హిట్‌ పడింది. అది ఆషామాషీ హిట్‌ కాదు.. ఇటీవల కాలంలో తమిళ్‌లో ఇలాంటి విజయం సాధించిన సినిమానే లేదు. ఆగస్ట్‌ 10న విడుదలైన ఈ చిత్రం.. నెల రోజులు పూర్తికాకముందే ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్ల మేర గ్రాస్‌ వసూళ్లను రాబట్టి..సూపర్‌ స్టార్‌ స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన చిత్రమిది. వాస్తవానికి ఈ స్థాయి విజయాన్ని ఈ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా ఊహించలేదు. ప్రిరిలీజ్‌ బిజినెస్‌ కంటే ఎక్కువగా వసూళ్లు వచ్చాయట. అందుకే చిత్ర నిర్మాత కళానిధి మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 

లాభాల్లోని కొంత భాగాన్ని హీరో రజనీకాంత్‌, దర్శకుడు  నెల్సన్ దిలీప్ కుమార్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌కి పంచేశారు. అంతటితో ఆగకుండా ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా అందించారు. జైలర్‌ విజయంలో కీలక పాత్ర వహించింది ఈ ముగ్గురే కాబట్టి..వారికి లాభాల్లోని కొంత మొత్తం ఇవ్వాల్సిందేనని నిర్మాత ఇలా చేశారట. కేవలం చిత్రబృందానికే కాకుండా లాభాల్లోని కొంత డబ్బును సామాజిక సేవ చేయడానికి ఉపయోగించాలని నిర్మాత కళానిధి మారన్  నిర్ణయం తీసుకున్నారు.

 అందులో భాగంగా అపోలో హాస్పిటల్స్‌కు రూ.కోటి  చెక్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ తరఫున నిర్మాత కళానిధి మారన్ భార్య కావేరి.. మంగళవారం అపోలో హాస్పిటల్స్ చైర్మన్, ఉపాసన కొణిదెల తాతయ్య డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డిని కలిసి కోటి రూపాయల చెక్ అందజేశారు. 100 మంది నిరుపేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్సల కోసం ఆ డబ్బును అందించారట.

ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. సన్ పిక్చర్స్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాల్లో వచ్చిన లాభాలను ఇలాంటి మంచి పనులకు ఉపయోగించడం గొప్ప విషయమని కామెంట్‌ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని హిట్‌ చిత్రాలను నిర్మించి, లాభాల్లో కొంత మొత్తాన్ని ఇలా సామాజిక సేవకు ఉపయోగించాలని  కోరుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement