హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఇతడు ప్రస్తుతం ఓటీటీలోనూ అలరిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. తనపై విషప్రయోగం జరిగిందన్న సంచలన విషయాన్ని సైతం వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు. కానీ కొంతకాలం క్రితం నాకు ఉన్నట్టుండి శ్వాసకోస సమస్యలు వచ్చాయి. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఎంతో కష్టమయ్యేది.
డాక్టర్లు చేతులెత్తేశారు..
ఎంతోమంది వైద్యులకు చూపించినా ఎవరికీ అంతు చిక్కలేదు. నేనేమో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిపడుతూనే ఉన్నాను. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో చెక్ చేయించుకున్నా నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. డాక్టర్లు నా పరిస్థితి చూసి కష్టమే అని చేతులెత్తేశారు. అప్పుడు నా స్నేహితుడు, నిర్మాత శేషు రెడ్డి నాకు అండగా నిలబడ్డాడు. డాక్టర్ నాగార్జున దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయన నన్ను పరీక్షించి డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావని అడిగాడు. నాకసలు డ్రగ్స్ అలవాటే లేదని చెప్పాను.
కషాయం తాగినందుకు అస్వస్థత
ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను ఎడిటింగ్ చేస్తున్న రోజుల్లో ప్రతిరోజు కషాయం తాగేవాడిని. ఓసారి నాతో ఉండే నిర్మాత ఖాసీం తాను నా కషాయం తాగుతానన్నాడు. సరేనని ఇచ్చాను. ఆ కషాయం తాగినందుకు ఖాసీంకు రెండురోజులు తీవ్రమైన జ్వరం వచ్చి లేవలేకపోయాడు. ఇదే మాట నాకు కషాయాన్ని ఇచ్చే వ్యక్తికి చెప్పాను. చూశావా? నువ్విచ్చే కషాయాన్ని నేను ఎంత కష్టపడి తాగుతున్నానో అని! అతడు షాకైపోయాడు.
8 నెలలు విషప్రయోగం..
నీకోసం చేసిన కషాయాన్ని వేరేవాళ్లకు ఎందుకిచ్చావు? అని తిట్టాడు. మా మధ్య మాటల యుద్ధమే జరిగింది. చివరకు ఆస్పత్రిలో తేలిందేంటంటే నాకు 8 నెలలుగా స్లో పాయిజన్ ఇచ్చారు. నేను ఔషధం అని తాగుతున్నదే విషం. దానివల్లే శ్వాసకోస సమస్యలు వచ్చాయని తెలిసింది. ఖాసీంకు మందు తాగే అలవాటు ఉంది. అందుకే ఆ కషాయాన్ని అతడి శరీరం స్వీకరించలేకపోయింది. అందుకే అతడు వాంతులు చేసుకున్నాడు' అని చెప్పుకొచ్చాడు జేడీ చక్రవర్తి. అయితే విషప్రయోగం చేసిందెవరన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.
చదవండి: సినిమా రిలీజ్ తర్వాత ఆదిపురుష్ డైరెక్టర్ ట్వీట్.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment