
తమిళ సినిమా: అగ్ర కథానాయికల్లో ఒకరు కాజల్ అగర్వాల్. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలందరితో జతకట్టారు. కాగా కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యారు. అయితే ఇదంతా రెండేళ్ల లోపే జరిగిపోయింది. 2020లో పెళ్లి చేసుకున్న కాజాల్ అగర్వాల్ 2022 కల్లా గోడకు తగిలిన బంతిలా మళ్లీ నటన వైపు తిరిగొచ్చేశారు. వివాహం అయిన తర్వాత, నటీమణులు హీరోయిన్‌గా కొనసాగటం కష్టమే అంటారు. దాన్ని కాజల్ అగర్వాల్ బ్రేక్ చేశారు. పెళ్లే కాదు బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
మరో విషయం ఏమిటంటే కమలహాసన్‌కు జంటగా నటిస్తున్న ఇండియన్ –2 చిత్ర షూటింగ్ వాయిదాలు పడుతూ రావటం కాజల్ పాలిట వరంగా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి తెలుగులో బాలకృష్ణ సరసన నటించే లక్కీ చాన్స్ కాజల్‌ను వరించింది. కాగా కోలీవుడ్లో నటుడు అజిత్‌కు జంటగా నటించే అవకాశం కూడా ఈమె తలుపు తట్టిందనేది తాజా సమాచారం. అజిత్ 62వ చిత్రంలో కాజల్‌ను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
వీరిద్దరు ఇంతకుముందు వివేకం చిత్రంలో జతకట్టారన్నది గమనార్హం. ఇకపోతే పెళ్లి అయిన తర్వాత కూడా గ్లామర్‌గా నటిస్తారా..? అన్న ప్రశ్నకు కాజల్ అగర్వాల్ బదులిస్తూ వైనాట్ అని టక్కున చెప్పారు. ఈ విషయంలో తాను తన భర్త చాలా క్లియర్‌గా ఉన్నామని పేర్కొన్నారు. ప్రేమ సన్నివేశాల్లో సహా నటుడితో సన్నిహితంగా నటించాల్సి ఉంటుందన్నారు. అలా నటించనని చెప్పడం వీలుకాదన్నారు. వివాహ జీవితం, చేసే వృత్తి వేరు వేరు అన్నారు. అయితే గ్లామర్ సన్నివేశాలు చిత్ర కథకు ఎంతవరకు అవసరం అన్నది కూడా ముఖ్యమన్నారు. వివాహానంతరం తాను నటించనని ప్రచారం చేశారని, అయితే తాన చర్యలతో దాన్ని బ్రేక్ చేశానని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.