‘బింబిసార’ చిత్రానికి ముందే ‘అమిగోస్’ కథ విన్నాను. రాజేంద్రగారు స్టోరీ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పాను. ఒకే పోలికలతో ఉండే ముగ్గురు వ్యక్తులు ఎలా కలిశారు? వాళ్ల లక్ష్యం ఏంటి? వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ పంచుకున్న విశేషాలు.
►‘బింబిసార’ హిట్ తర్వాత నేను కథలు ఎంచుకునే విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. ముందు ఎలా ఉన్నానో తర్వాత కూడా అలానే ఉన్నాను. ఎందుకంటే ‘బింబిసార’, ‘అమిగోస్’, ‘డెవిల్’ సినిమాల కథలను 2020లోనే ఓకే చేశాను. ‘బింబిసార’ హిట్ తర్వాత కొత్తగా ఏ కథనీ ఎంచుకోలేదు. అయితే ఆ సినిమా విజయం నా బాధ్యతని పెంచింది. అంతకంటే ఇంకా పెద్ద విజయాన్ని నా నుంచి ఆశిస్తారు. అందుకే మంచి కాన్సెప్ట్, స్టోరీ ఉన్నవి ఒప్పుకోవాలి. లక్కీగా నాకు అన్నీ అలాంటి మంచి కథలు వస్తున్నాయి.
► ‘అమిగోస్’ చిత్రంలో నేను త్రిపాత్రాభినయం చేశాను. సిద్ధార్థ్ చాలా చురుకుగా ఉంటాడు. మంజునాథ్‌ది చాలా సైలెంట్ అండ్ సాఫ్ట్ క్యారెక్టర్. మైఖేల్ పాత్ర గ్యాంగ్‌స్టర్‌ని పోలిన విలన్‌లా ఉంటుంది. విలన్‌లా నటించడం చాలా కొత్తగా అనిపించింది. ట్రిపుల్ రోల్ చిత్రంలో కనీసం ఇద్దరు కథానాయికలైనా ఉంటారు. కానీ ఇది రెగ్యులర్ సినిమాలకు పూర్తి విభిన్నమైనది కావడంతో ఒక హీరోయిన్ మాత్రమే ఉంటుంది. పైగా ఈ మూవీలో విలన్ ఉండకపోవడం ఓ విశేషం.
► మనిషిని పోలిన మనుషులను ‘డాపుల్ గాంగర్’ అంటారని రాజేంద్రగారు చెప్పారు. ఈ సినిమాకి ‘అమిగోస్’ టైటిల్ అనుకున్నప్పుడు అందరికీ అర్థం అవుతుందా? అన్నాను. అమిగో అనే పదం సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య బాగా వాడుతున్నారని చెప్పడంతో ఫిక్స్ చేశాం. సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టామో అర్థం అవుతుంది. ఈ మధ్య సూపర్ హిట్ అయిన ‘కాంతారా’ టైటిల్ అర్థం నాకు తెలీదు. దాని గురించి వెతికితే ‘వైల్డ్ ఫారెస్ట్’ అని అర్థం అయింది.
► కోవిడ్ సమయంలో నన్ను నేను బాగా తెలుసుకున్నాను. నేను చేసిన కొన్ని సినిమాలు పరాజయం కావడానికి కారణం ఏంటి? నేను చేసిన తప్పులు ఏంటి? అని తెలుసుకున్నాను. ‘అమిగోస్’ సినిమా 2 గంటల 19 నిమిషాలు ఉంటే.. అందులో రెండు గంటల పదిహేడు నిమిషాలు కల్యాణ్ రామ్‌నే చూస్తారు.. సినిమాలో జస్ట్ రెండు నిమిషాలు మాత్రమే కనబడను. ఆ పాత్రకి అంత ప్రాధాన్యం ఉంటుంది.
► ప్రస్తుతం నేను నటిస్తున్న ‘డెవిల్’ మూవీ చిత్రీకరణ మే నెలలో పూర్తవుతుంది. ‘బింబిసార 2’ షూటింగ్‌ని ఈ ఏడాది ఆఖరులో ప్రారంభిస్తాం.
► తారకరత్న ఆరోగ్యం ఎలా ఉందో నేను చెబితే బాగుండదు. వైద్యం అందిస్తున్న ఆస్పత్రి వర్గాలు చెబితేనే బాగుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment