కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ విడుదలలో మరింత జాప్యం కానుంది. సెప్టెంబర్ 6న విడుదల కావాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇదే విషయాన్ని తాజాగా కంగనా రనౌత్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఎమర్జెన్సీ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్టడంతో సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ జారీ చేయలేదు. దీంతో ఈ సినిమా విడుదలకు మరోసారి బ్రేక్ పడింది.
ఎమర్జెన్సీ సినిమా వాయిదా పడుతుందని తాజాగా కంగనా రనౌత్ ఒక పోస్ట్ చేశారు. ' ఎంతో ప్రతిష్టాత్మకంగా నా దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' విడుదల మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి చాలా బాధగా ఉంది. సెన్సార్ బోర్డు నుంచి అనుమతి కోసం ఇప్పటికీ నేను ఎదురుచూస్తూనే ఉన్నాను. అడ్డంకులు అన్నీ తొలిగిపోతాయని ఆశిస్తున్నాను. సాధ్యమైనంత త్వరగా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈ విషయంలో ప్రేక్షకులు మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.' అని కంగనా పేర్కొంది.
కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. గత ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. సినిమా ప్రారంభం నుంచే చాలా విమర్శలు వచ్చాయి. సినిమా విడుదల కోసం ముంబై హైకోర్టును కూడా కంగనా ఆశ్రయించారు. కానీ, అక్కడ కూడా ఆమెకు ఊరట లభించలేదు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను తాము ఆదేశించలేమని ముంబై హైకోర్టు తెలిపింది. దీంతో మరోసారి వాయిదా తప్పలేదు.
ఎమర్జెన్సీ సినిమా విషయంలో ఇందిరా గాంధీ హత్యను చూపించకూడదనీ, భింద్రన్‌వాలేను చూపించవద్దనీ, పంజాబ్ అల్లర్లను చూపించవద్దనే ఒత్తిడి తనపై ఉందని కంగనా తెలిపారు. ఇవేవీ చూపించొద్దంటే ఇక చూపించడానికి ఏం మిగిలి ఉంటుందో..? అని ఆమె ప్రశ్నించారు. కొన్ని సినిమాలు రూపొందించడానికి కొందరికి మాత్రమే సెన్సార్‌షిప్ ఉంటుందని ఆమె ఘాటుగా స్పందించారు. ఈ సినిమా విషయంలో కంగనాపై హత్య బెదిరింపులు కూడా వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment