టైటిల్: కీడా కోలా
నటీనటులు: చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, జీవన్ కుమార్, తరుణ్ భాస్కర్, విష్ణు, రవీంద్ర విజయ్ తదితరులు
నిర్మాతలు: కె.వివేక్ సుదాంశు, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద నందరాజ్, ఉపేంద్ర వర్మ
సమర్పణ: రానా దగ్గబాటి
దర్శకత్వం: తరుణ్ భాస్కర్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్
ఎడిటింగ్ : ఉపేంద్ర వర్మ
విడుదల తేది: నవంబర్ 3, 2023
కథేంటంటే..
వాస్తు(చైతన్య రావు)కి నత్తి ఉంటుంది. చిన్నప్పుడే పెరెంట్స్ చనిపోవడంతో తాత వరదరాజు(బ్రహ్మానందం)తో కలిసి ఉంటాడు. వాస్తు స్నేహితుడు కౌశిక్ అలియాస్ లంచం(రాగ్ మయూర్)ఓ లాయర్. ఈ ముగ్గురికి డబ్బు చాలా అవసరం. డబ్బు సంపాదించడం కోసం ప్లాన్ చేస్తున్న క్రమంలో కీడాకోలా(శీతల పానీయం)బాటిల్‌లో బొద్దింక కనిపిస్తుంది. వెంటనే లాయర్ కౌశిక్‌కి ఓ ఆలోచన వస్తుంది. ఈ బొద్దింకను చూపించి కీడా కోలా కంపెనీ యజమాని నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ వేస్తాడు. యజమానికి ఫోన్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తాడు.
మరోవైపు వీధి రౌడీ జీవన్(జీవన్ కుమార్) తనకు జరిగిన అవమానంతో.. ఎలాగైన కార్పోరేటర్ కావాలనుకుంటారు. 20 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన తన అన్న నాయుడు(తరుణ్ భాస్కర్)తో తన కోరిక ఏంటో చెబుతాడు.దాని కోసం రూ. కోటి వరకు ఖర్చు అవుతుందని భావించి.. డబ్బు కోసం ఓ కుట్ర పన్నుతారు. ఆ కుట్ర ఏంటి? వాస్తు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ ఎలా కలిశాయి? కీడాకోలాలో బొద్దింక ఎలా పడింది? ఈ రెండు గ్యాంగులతో ఆ కంపెనీ యజమాని(రవీంద్ర విజయ్) కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? చివరకు చేసిందేంటి? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్‌లో ‘కీడా కోలా’ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
తరుణ్ భాస్కర్ గత సినిమాలు(పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది) చూస్తే.. వాస్తవికతకు దగ్గరగా అనిపిస్తాయి. అలాంటి పాత్రల్ని, కొన్ని సన్నివేశాలను నిజ జీవితంలో ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ వాటికి పూర్తి భిన్నంగా తెరకెక్కించిన చిత్రం కీడా కోలా. లాజిక్స్‌ని పక్కకి పెట్టి కేవలం నవ్వించడమే టార్గెట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఇదొక రోటీన్ క్రైమ్ కామెడీ చిత్రం. కానీ తరుణ్ కథను నడిపించిన తీరు, మాటలు, పాత్రలకు పెట్టిన మాడ్యులేషన్ కారణంగా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కథ పెద్దగా ఉండదు కానీ..నవ్వించే సీన్లకు కొదవ ఉండదు.
వాస్తు, లంచం పాత్రలని పరిచయం చేస్తూ కోర్టు సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత వెంటనే జీవన్ గ్యాంగ్‌ని పరిచయం చేసి.. ఈ రెండు గ్యాంగుల పరిస్థితి ఏంటి? ఎలా వ్యవహరిస్తారనే క్లారిటీని మొదట్లోనే ఇచ్చాడు. ఆ ఏరియా కార్పోరేటర్ జీవన్ పోస్టర్‌ని డిజైన్ చేసిన సీన్‌తో నవ్వులు ప్రారంభం అవుతాయి. నాయుడి పాత్ర ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్వాసమీద ధ్యాస, రోజుకు గంట ఇంగ్లీష్ అంటూ నాయుడు పాత్ర పండించే కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అసలు కథను పక్కకి పెట్టి సరదా సన్నివేశాలతో ఫస్టాఫ్‌ని ముగించేశాడు.
ఇక సెకండాఫ్‌లో కథనం ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. అయితే పార్ట్ పార్టులుగా వచ్చే సీన్లు నవ్విస్తాయి. కీడా కోలా యాడ్‌లో నటిస్తూ హీరోగా గెటప్ శ్రీను చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథ లాగినట్లు అనిపిస్తుంది. రెండు గ్యాంగ్‌ల మధ్య వచ్చే ‘ సరెండర్ ’ సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. షూటర్స్ లోపాలు, బొమ్మతో నాయుడు ప్రేమాయణం.. ఇవన్నీ ఆకట్టుకున్నా.. చెప్పుకోదగ్గ కథ లేదనే వెలితిమాత్రం ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
తరుణ్ భాస్కర్‌లో మంచి నటుడు ఉన్నాడు. గతంలో పలు చిత్రాల్లోనూ ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. ఇక ఇందులో ఓ డిఫరెంట్ రోల్ ప్లే చేశాడు. నాయుడు పాత్రలో ఆయన పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. పైకి నవ్విస్తూనే..అంతర్లీనంగా మంచి సందేశం ఇచ్చే పాత్ర తనది. వాస్తు పాత్ర కోసం చైతన్య రావు పడిన కష్టం తెరపై కనిపించింది. లాయర్ లంచం పాత్రకి రాగ్ మయూర్ న్యాయం చేశాడు. ‘మ్యాడ్’ఫేమ్ విష్ణు తనదైన కామెడీతో నవ్వించాడు. తాతగా బ్రహ్మానందం పాత్ర వీల్ ఛైర్‌కే పరిమితం అయినా.. సందర్భానుసారం నవ్విస్తుంది. జీవన్ కుమార్, రవీంద్ర విజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
ఇక తరుణ్ గత సినిమాల మాదిరే కీడా కోలా కూడా సాంకేతిక పరంగా ఉన్నతంగా ఉంది. ఏజే అరోన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. పాటలు కథలో భాగంగా అలా వచ్చిపోతాయి. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. బూతులు వాడాల్సిన చోట పాటలు వినిపించి.. సెన్సార్ వాళ్లకు పని తగ్గించాడు. ఎడిటర్ పనితనం బాగుంది. సినిమా నిడివి(రెండు గంటలు)తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment